Nitin Nabeen
బీజేపీలో ఒక శకం ముగిసి, మరో కొత్త శకం మొదలవుతోంది. భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా 45 ఏళ్ల నితిన్ నబీన్(Nitin Nabeen) పేరు దాదాపు ఖరారు అయినట్లే కనిపిస్తోంది.
ఇది కేవలం ఒక సంస్థాగత మార్పు మాత్రమే కాదు.. 2029 సార్వత్రిక ఎన్నికల టార్గెట్‌గా మోదీ–షా ద్వయం సిద్ధం చేసిన ఒక భారీ వ్యూహం అని విశ్లేషకులు చెబుతున్నారు.దీంతో అసలు ఈ నియామకం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి ? ఈ మార్పు భారత రాజకీయాలను ఎలా ప్రభావితం చేయనుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఇంతకీ ఎవరీ నితిన్ నబీన్(Nitin Nabeen)? ఎందుకు ఈయననే ఎంచుకున్నారు అన్న ప్రశ్న వినిపిస్తోంది. ప్రస్తుతం బీహార్ మంత్రిగా ఉన్న నితిన్ నబీన్, పట్నా బంకిపూర్ నుంచి ఏకంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బలమైన నేత. 1980లో బీజేపీ ఆవిర్భవించినప్పుడు నబీన్ వయస్సు కేవలం 7 వారాలు మాత్రమే. అంటే పార్టీతో పాటే పెరిగిన తరం ఆయనది అన్నమాట.
ఇప్పటి వరకు అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నడ్డా వంటి 60 ఏళ్లు దాటిన హేమాహేమీలు అధ్యక్ష పదవిని అలంకరించారు. కానీ ఇప్పుడు 45 ఏళ్ల యువ నేతకు పగ్గాలు ఇవ్వడం వల్ల “జనరేషన్ షిఫ్ట్” (తరాల మార్పు)కు బీజేపీ శ్రీకారం చుట్టబోతోంది. వచ్చే 25 ఏళ్ల అమృత కాలంలో పార్టీని నడిపించే సత్తా ఉన్న నేతను ఇప్పుడే తయారు చేయాలనేది మోదీ-షా ప్లాన్‌గా తెలుస్తోంది.
నిజానికి నబీన్ (Nitin Nabeen) నియామకం వెనుక బలమైన ప్రాంతీయ లెక్కలు కూడా ఉన్నాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వంటి హిందీ బెల్ట్ రాష్ట్రాలు ఎప్పుడూ బీజేపీకి వెన్నెముక అనే చెప్పొచ్చు. బీహార్‌కు చెందిన నేతను అధ్యక్షుడిని చేయడం వల్ల అటు నితీష్ కుమార్ జేడీ(యూ), ఇటు తేజస్వీ యాదవ్ ఆర్జేడీలకు ఒకేసారి చెక్ పెట్టొచ్చు.
బీహార్ రాజకీయ కేంద్రం ఇప్పుడు బీజేపీ చేతిలో ఉందనే బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపడమే దీని ఉద్దేశ్యం. అంతేకాకుండా, బూత్ లెవెల్ కార్యకర్త కూడా ఏదో ఒక రోజు జాతీయ అధ్యక్షుడవుతాడనే భరోసాను కేడర్‌లో నింపడానికి నబీన్ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలిచే అవకాశం కూడా ఉంటుంది.
గాంధీ సిద్ధాంతాలైన గ్రామ స్వరాజ్, స్వచ్ఛ భారత్ వంటివి తమ పాలసీల్లోనే ఉన్నాయని, కేవలం పేరు మార్చడం వల్ల గాంధీని అవమానించినట్లు కాదని బీజేపీ కేడర్ ప్రచారం చేయనుంది. ఇక్కడ “మోదీ – సెంట్రల్ మెసేజింగ్, నబీన్ – ఫీల్డ్ కోఆర్డినేషన్” అనే ద్వంద్వ నాయకత్వ నమూనా పనిచేయబోతోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి యువ నేతలను ఎదుర్కోవడానికి బీజేపీకి కూడా ఒక అగ్రెసివ్ యువనేత ముఖం అవసరం. ఆ అవసరాన్ని నబీన్ తీర్చబోతున్నారు.
నితిన్ నబీన్ కేవలం పొలిటికల్ ఫేస్ మాత్రమే కాదు, ఆయనకు ఆర్ఎస్ఎస్ నుంచి బలమైన మద్దతు కూడా ఉంది. రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ నుంచి మరికొంత మంది కొత్త ముఖాలు వచ్చే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మోదీ చరిష్మాకు తోడు, నబీన్ ఆర్గనైజేషన్ స్కిల్స్ వంటివి తోడైతే 2029లో హ్యాట్రిక్ విజయం సాధించడం సులభమని బీజేపీ భావిస్తోంది. ఇది కేవలం ఒక వ్యక్తి మార్పే కాదు, భారతీయ జనతా పార్టీ తన భవిష్యత్ ప్రయాణానికి వేసుకున్న ఒక దృఢమైన బాటగా విశ్లేషకులు చెబుతున్నారు.
