Vijay
ఊహించినట్టుగానే తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. అధికార పార్టీ డీఎంకే, విజయ్(Vijay) కొత్త పార్టీ టీవీకే మధ్య తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకుంటున్నాయి. గత వారం కరూర్ లో విజయ్ ర్యాలీ సందర్భంగా తీవ్ర విషాదం జరిగింది. అంచనాలకు మించి విజయ్ ను చూసేందుకు ప్రజలు, అభిమానులు తరలివాడంతో తొక్కిసలాటకు దారితీసింది.
ఫలితంగా 41 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు కారణం మీరంటే మీరంటూ అధికార డీఎంకే, విజయ్ పార్టీ టీవీకే విమర్శలు చేసుకుంటున్నాయి. టీవీకే పార్టీ ఈ ఘటన వెనుక కుట్ర దాగి ఉందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ లేదా స్వతంత్ర కమిటీతో విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
అయితే ఈ ఘటన తర్వాత మృతులు, బాధితుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున నటుడు, టీవీకే అధినేత విజయ్ నష్టపరిహారం ప్రకటించారు. తాజాగా తొలిసారి ఈ ఘటన గురించి కూడా మాట్లాడుతూ వీడియో విడుదల చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఇలాంటి బాధ తన జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదని చెప్పారు. ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సిందన్న విజయ్ త్వరలోనే నిజాలు బయటకొస్తాయంటూ వ్యాఖ్యానించారు. తాను ఎప్పుడూ భద్రతకే తొలి ప్రాధాన్యత ఇస్తానని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్ కు కోపం ఉంటే తనను టార్గెట్ చేయాలని, ప్రజలను కాదంటూ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి తమపై ప్రతీకారం తీర్చుకోడానికి తాము ఎలాంటి తప్పుచేయలేదన్నారు. ఆయనకు ఏమైనా రివేంజ్ ప్లాన్స్ మనసులో ఉంటే తనపై చేసుకోవచ్చని, తాను ఇల్లు లేదా ఆఫీసులో అందుబాటులో ఉంటానంటూ చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ ఘటనలో బాధితులను కలుస్తానని చెప్పారు. అలాగే తిరుమల వెళ్ళి వెంకన్నను దర్శించుకుంటానని విజయ్(Vijay) వెల్లడించారు.
ఇదిలా ఉంటే తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే జిల్లా సెక్రెటరీ మతియఝగన్‌పై పోలీసులు కేసు చేశారు. మరో ఇద్దరు సీనియర్ టీవీకే నేతలపైనా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. సభను హైప్ చేసుకునే క్రమంలో ఉద్దేశపూర్వకంగానే ఆలస్యంగా వచ్చి ఘటనకు కారణమయ్యారన్న అభియోగాలు నమోదు చేశారు.
మరోవైపు టీవీకే పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విల్లుపురం జిల్లాకు అయ్యప్పన్ అనే వ్యక్తి టీవీకే పార్టీ కార్యకర్తగా ఉన్నారు. కరూర్ ఘటనలో అంతమంది చనిపోవడం తనను తీవ్రంగా బాధించిందని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.