Vijay:మదురైలో విజయ్ రాజకీయ సమరం.. స్టార్ డమ్ ఓట్లుగా మారుతుందా?

Vijay:  రెండో రాష్ట్ర సమావేశం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాలని విజయ్ ప్రణాళికలు వేసుకున్నారు.

Vijay

తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యారు హీరో, తమిళగ విజయ్ కజగం (TVK) పార్టీ అధినేత విజయ్. ఆగస్టు 21న మదురై(Madurai)లో ఆయన నిర్వహించనున్న రెండో రాష్ట్ర సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా తీసుకురావడానికి సిద్ధం అవుతున్నారు.

పార్టీ కార్యకర్తలకు రాసిన లేఖలో విజయ్ (Vijay) ఈ సమావేశం తమ పార్టీకి ..DMK రాజకీయ శత్రువులు, BJP ఆలోచనీయ శత్రువులతో పోరాడి గెలవడంలో ఒక కీలకమైన దశ అవుతుందని స్పష్టం చేశారు. తమిళనాడులో ఒక అధికారిక రాజకీయ శక్తిగా ఎదగడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే తమిళనాడులోనూ ఎం.జి. రామచంద్రన్, జె. జయలలిత వంటి నట-నాయకుల వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి విజయ్ ప్రయత్నిస్తున్నారు. తన భారీ అభిమాన బలం, నిరంతర క్షేత్రస్థాయి కార్యక్రమాలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. ఇంతకుముందు ఏఐఏడీఎంకేపై ఎలాంటి విమర్శలు చేయకపోవడం, భవిష్యత్‌లో ద్రవిడ పార్టీలతో పొత్తుకు తలుపులు తెరిచి ఉంచారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇటీవల TVK సభ్యత్వ నమోదు యాప్ ప్రారంభ కార్యక్రమంలో, డీఎంకే వ్యవస్థాపకుడు సి.ఎన్. అన్నాదురైని స్ఫూర్తిగా తీసుకుని, “ప్రజల మధ్యకు వెళ్లి, వారి జీవితం తెలుసుకుని, వారితో కలిసి పని చేయాలని తన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం, రహదారి, ఇంటింటికి వెళ్లి కష్టపడి పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

vijay

మదురైలో జరగనున్న ఈ సమావేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఊపందుకుంటోంది. ఈ సమావేశం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాలని విజయ్ ప్రణాళికలు వేసుకున్నారు. రాజకీయ విశ్లేషకుల ప్రకారం, ఈ సమావేశం TVK యొక్క భారీ ఎన్నికల ప్రచారానికి నాంది పలకనుంది. అయితే, ఈ ప్రయాణంలో విజయ్‌కు కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

విజయ్(Vijay) ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. పార్టీ నిర్మాణం, శాసనసభ వ్యూహాలు, స్థానిక సమస్యల పరిష్కారాలపై ఆయనకు అనుభవం తక్కువ. ఎంటర్‌టైన్‌మెంట్ ఫేమ్‌ను ఓట్లుగా మార్చడం అంత సులభం కాదు, గతంలో శివాజీ గణేశన్, కమల్ హాసన్, విజయ్ కాంత్ లాంటి నటుల అనుభవాలు దీనికి నిదర్శనం.

టీవీకేకి ఇంకా బలమైన, అనుభవజ్ఞులైన రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకత్వం లేదు. పబ్లిసిటీ ఉన్నా, వ్యవస్థాగత నిర్మాణం దృఢంగా లేకపోతే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం కష్టం.విజయ్ ఎక్కువగా యువత, అభిమానులపైనే దృష్టి పెడుతున్నారు. కానీ రైతులు, ముస్లింలు, మహిళలు వంటి వివిధ వర్గాల సమస్యలపై స్పష్టమైన విధానాలు ఇంకా ప్రకటించలేదు.

ఏఐఏడీఎంకేతో పొత్తుకు తలుపులు తెరిచి ఉంచడం ఓటర్లలో గందరగోళం సృష్టిస్తుంది. ఒంటరిగా పోటీ చేస్తే రిస్క్ ఎక్కువ. పొత్తులు కుదిరితే పార్టీ సిద్ధాంతాలు పలచబడే అవకాశం ఉంది.మీడియా, అభిమానుల నుంచి వస్తున్న అధిక అంచనాలు మొదటి ఎన్నికల్లోనే పెద్ద విజయాన్ని అందుకోవడం కష్టమైతే, పార్టీ ఊపు తగ్గిపోవచ్చు. డీఎంకే, బీజేపీ, ఏఐఏడీఎంకే వంటి బలమైన పార్టీలు సినిమా ఇమేజ్‌ను రియల్ పాలిటిక్స్‌లో తట్టుకోలేదని ప్రచారం చేసే అవకాశం ఉంది.

మొత్తానికి, విజయ్ అభిమాన బలం, వ్యక్తిత్వం, ఫ్రెష్ ఇమేజ్ వంటి సానుకూల అంశాలు ఉన్నప్పటికీ, వాటిని ఓట్లుగా మార్చడమే అసలు సవాలు. పార్టీ నిర్మాణం, నాయకత్వ కొరత, స్పష్టమైన పాలసీలు, పొత్తుల వ్యూహం వంటి అంశాలపై స్పష్టత లేకపోతే, ఈ ఉత్సాహం కొనసాగడం కష్టమని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా, మదురైలో జరగనున్న టీవీకే రెండో రాష్ట్ర సమావేశం తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త పోటీ వాతావరణాన్ని సృష్టించడం ఖాయం.

 

Exit mobile version