Tirumala :శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆరోజు తిరుమల ఆలయం మూసివేత!

Tirumala : శ్రీవారి భక్తులు ఈ మార్పులను గమనించి, దానికి తగినట్లుగా తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Tirumala

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబరు 7న సంభవించనున్న చంద్రగ్రహణం కారణంగా ఆ రోజు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు.

సెప్టెంబరు 7వ తేదీన సాయంత్రం 3:30 గంటల నుంచి ఆలయాన్ని మూసివేసి, మరుసటి రోజు, అంటే సెప్టెంబరు 8వ తేదీ తెల్లవారుజామున 3:00 గంటల వరకు మొత్తం 12 గంటల పాటు ఆలయ ద్వారాలు మూసి ఉంటాయని టీటీడీ తెలిపింది.

సాధారణంగా గ్రహణం ప్రారంభం కావడానికి ఆరు గంటల ముందు ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీగా వస్తుంది. సెప్టెంబరు 7వ తేదీ రాత్రి 9:50 గంటలకు చంద్రగ్రహణం మొదలై, సెప్టెంబరు 8న తెల్లవారుజామున 1:31 గంటలకు పూర్తవుతుంది.

సెప్టెంబరు 7న చంద్రగ్రహణం కారణంగా ఆ రోజు ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

సెప్టెంబరు 8న తెల్లవారుజామున 3:00 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి, ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా జరుపుతారు. ఉదయం 6:00 గంటల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం పునఃప్రారంభమవుతుంది.

అలాగే సెప్టెంబరు 7వ తేదీ సాయంత్రం 3:00 గంటల నుంచి తిరుమలలో అన్నప్రసాదాల పంపిణీ నిలిపివేయబడుతుంది. తిరిగి సెప్టెంబరు 8వ తేదీ ఉదయం 8:30 గంటలకు పంపిణీ తిరిగి మొదలవుతుంది. ఈ సమయంలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో 30వేల పులిహోర ప్యాకెట్లను సెప్టెంబరు 7వ తేదీ సాయంత్రం 4:30 గంటల నుంచి పంపిణీ చేయనున్నారు.

Tirumala

వీటిని శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపం, రామ్ భగీచా, పీఏసీ-1, సీఆర్వో, ఏఎన్‌సీ ప్రాంతాల్లోని ఫుడ్ కౌంటర్లు, శ్రీవారి సేవ సదన్ వద్ద అందుబాటులో ఉంచుతారు. శ్రీవారి భక్తులు ఈ మార్పులను గమనించి, దానికి తగినట్లుగా తమ తిరుమల (Tirumala )యాత్రను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

 

 

Exit mobile version