God
దేవుడి(God)ని పూజిస్తూ కోరికలు కోరడంలో తప్పు కాదు, మన ఆలోచనల్లోనే అసలు సమస్య. చాలామందిలో ఉండే ఒక కామన్ డౌట్ ఇదే. దేవుడి(God)ని అడగడం తప్పా? ఎందుకంటే కొందరు అడగకూడదు, నమ్మకం ఉంటే చాలు అంటారు. మరికొందరు మాత్రం ప్రతి చిన్న విషయానికీ దేవుడిని అడుగుతూనే ఉంటారు.
అసలు ఇందులో తప్పు ఏంటి, కరెక్ట్ ఏంటి అనే విషయం మనం ఎప్పుడూ సరిగ్గా అర్థం చేసుకోలేదు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవుడిని గుర్తు చేసేవాళ్లు తక్కువ. కానీ కష్టాలు వచ్చినప్పుడు మాత్రం దేవుడు వెంటనే గుర్తొస్తాడు. దీనికి కారణం భక్తి కాదు, మానసిక భద్రత కోసం మన మెదడు వెతుక్కోవడమే.
సైకాలజీ ప్రకారం, మనకు మన చేతుల్లో లేని పరిస్థితులు ఎదురైనప్పుడు, మనసు ఒక సపోర్ట్ సిస్టమ్ కోసం చూస్తుంది. ఆ సపోర్ట్ సిస్టమ్ చాలా మందికి దేవుడు.
దేవుడి(God)ని అడగడం అంటే నిజానికి మన లోపల ఉన్న భయాలను, అనిశ్చితిని బయట పెట్టడం. ఇది జరగాలి లేదా ఇది జరగకూడదు అని అడిగేటప్పుడు మనసు కొంత ఉపశమనాన్ని పొందుతుంది. అందుకే అడిగిన వెంటనే సమస్య తీరకపోయినా మనకు కొంచెం తేలికగా అనిపిస్తుంది.
అయితే ఇక్కడే అసలు తేడా మొదలవుతుంది. అడగడం తప్పు కాదు, కానీ అడిగినదే జరగాలి అని పట్టుబట్టడం ప్రమాదం. ఎందుకంటే అప్పుడు మనం జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నట్టు ఫీల్ అవుతాం, కానీ నిజానికి కంట్రోల్ మన చేతుల్లో ఉండదు. ఆ అసహనం చివరకు దేవుడిపైనే కోపంగా మారుతుంది.
చాలామంది నేను ఇన్ని పూజలు చేశాను, ఇన్ని నోములు చేశాను. అయినా ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతారు. ఇక్కడ సమస్య ప్రార్థనలో కాదు, మన అంచనాల్లో ఉంటుంది. దేవుడిని ఒక వ్యాపారిలా చూసినప్పుడు, ఫలితం మనకు నచ్చకపోతే నమ్మకం కూడా కుదేలవుతుంది.
నిజానికి పురాణాల్లో కూడా దేవుడిని అడగడం తప్పు అని ఎక్కడా చెప్పలేదు. కానీ ఫలితాన్ని వదిలేయమని మాత్రం చెప్పారు. అంటే ప్రయత్నం మనది, ఫలితం మన చేతుల్లో లేదు అనే అర్థం. ఈ అర్థం తెలిసినప్పుడు అడగడం కూడా శాంతిగా ఉంటుంది. అడగడం ఒక ఎమోషనల్ అవుట్‌లెట్.
మనసులో ఉన్న మాటను బయట పెట్టడం. అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే, అడగడం తర్వాత మన బాధ్యతను వదిలేయడం. దేవుడే చూసుకుంటాడు అని మనం ఏమీ చేయకుండా కూర్చోవడం వల్ల నష్టం జరుగుతుంది. అడగడం, నమ్మకం, ప్రయత్నం ఈ మూడు కలిసి ఉన్నప్పుడే మనసుకు నిజమైన శాంతి వస్తుంది.
నిజమైన భక్తి అంటే అడిగాక కూడా ధైర్యంగా ముందుకు వెళ్లడం. ఫలితం ఎలా వచ్చినా, మనసు కూలిపోకుండా నిలబడడం. దేవుడు మన కోరికల జాబితాను పూర్తి చేసే వ్యక్తి కాదు, మన మనసుకు బలం ఇచ్చే ఒక అద్భుతమైన భావన.
