Sun Temple
ఒడిశా తీరంలో సముద్రపు హోరుకు సాక్షిగా నిలబడిన మహా అద్భుతం కోణార్క్ సూర్య దేవాలయం(Sun Temple). 13వ శతాబ్దంలో తూర్పు గంగ వంశపు రాజు నరసింహదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం, కేవలం రాయిపై చెక్కిన శిల్పం కాదని అంటారు అది ఒక సౌర గణిత శాస్త్ర అద్భుతం అని పొగుడుతారు.
ఏడు గుర్రాల రథంపై సూర్యభగవానుడు స్వారీ చేస్తున్నట్లుగా రూపొందించిన ఈ ఆలయంలోని 24 చక్రాలు ..ఇప్పటికీ కచ్చితమైన సమయాన్ని చూపిస్తాయి. అయితే, ఈ మహాద్భుత కట్టడం వెనుక ఒక తీరని విషాదం, ఒక పెద్ద రహస్యం దాగి ఉన్నట్లు చాలామందికి తెలీదు. కొన్ని కారణాలతో ఈ ఆలయ గర్భగుడి (జగమోహన్) మూసివేయడంతో భక్తులకు వెళ్లడానికి మార్గం లేదు.
1903వ సంవత్సరంలో ఆలయం శిథిలావస్థకు చేరుతోందని, ముఖ్యంగా మధ్యలో ఉన్న జగమోహన్ మండపం ఎక్కడ కూలిపోతుందోనని బ్రిటిష్ పాలకులు భయపడ్డారు. అయితే దానిని కాపాడటానికి వారు ఒక వింతైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆలయం లోపల గాలి కూడా చొరబడకుండా 15 అడుగుల ఎత్తున గోడ కట్టి, వేల టన్నుల ఇసుకను దాని లోపల నింపేశారు.
ఇలా 1904లో ఆ గర్భగుడి తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయి. దీంతో ఆ ఆలయం లోపల ఏముంది? రాజులు దాచిన సంపద ఉందా? లేక అద్భుతమైన రహస్య శిల్పాలు ఉన్నాయా? అనేది 122 ఏళ్లుగా ఎవరికీ తెలియని మిస్టరీగా మిగిలిపోయింది.
మళ్లీ ఇన్నాళ్ల తర్వాత డిసెంబర్లో భారత పురావస్తు శాఖ (ASI), ఐఐటీ మద్రాస్ నిపుణులు కలిసి.. ఆ కోణార్క్ సూర్య దేవాలయం(Sun Temple)లోని రహస్య గదిని తెరవడానికి సాహసం చేశారు. ఏకంగా ఒడిశా హైకోర్టు ఆదేశాలతో 2025 డిసెంబర్ 8న ఈ పనులు మొదలయ్యాయి. నిజానికి ఇది ఒక ఇంజనీరింగ్ సవాలు అనే చెప్పాలి.
ఎందుకంటే లోపల ఉన్న ఇసుకను తీసేటప్పుడు ఆ ఆలయం కూలిపోకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి. దీని కోసం పశ్చిమ గోడ వైపు 26 అడుగుల సొరంగం తవ్వి, అత్యాధునిక లేజర్ కెమెరాలు, సెన్సార్లను లోపలికి పంపారు. 14 నుంచి 16 టన్నుల బరువున్న ఐరన్ బీములతో లోపల గట్టిగా సపోర్ట్ ఏర్పాటు చేస్తూ.. దశలవారీగా కొద్దికొద్దిగా ఇసుకను బయటకు తీస్తున్నారు.
ఈ ఇసుక తొలగింపు ప్రక్రియ 2026 ఫిబ్రవరి నెలాఖరకు కానీ మార్చి మొదటి వారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇసుక పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత, లోపల దాగి ఉన్న శతాబ్దాల నాటి రహస్య చిత్రకళలు, అపూర్వమైన శాసనాలు ఎన్నో బయటపడతాయని చరిత్రకారులు ఆశిస్తున్నారు.
ఒకవేళ లోపల గోడలన్నీ పటిష్టంగా ఉంటే మాత్రం, పునర్నిర్మాణం తర్వాత 122 ఏళ్ల విరామం తర్వాత భక్తులు, పర్యాటకులు మళ్లీ ఆ గర్భగుడిలోకి అడుగు పెట్టొచ్చు. ఏటా 35 లక్షల మంది సందర్శకులు వచ్చే కోణార్క్‌కు..ఈ నిర్ణయం మరో వెయ్యేళ్ల ఆయుష్షునిస్తుంది అనడంలో సందేహం లేదు.
