Navathirupathi
చాలామంది తమకు గ్రహ దోషాలు ఉన్నప్పుడు కేవలం శివాలయాలకు లేదా నవగ్రహాల వద్దకు మాత్రమే వెళతారు. కానీ, సాక్షాత్తు శ్రీమహావిష్ణువే నవగ్రహాల రూపంలో కొలువైన అద్భుతమైన క్షేత్రాలు తమిళనాడులోని తామ్రపర్ణి నది తీరాన ఉన్నాయి. వీటినే ‘నవ తిరుపతి’ (Navathirupathi) అని పిలుస్తారు.
తిరునెల్వేలి జిల్లాలోని శ్రీవైకుంఠం చుట్టుపక్కల ఉన్న ఈ తొమ్మిది వైష్ణవ ఆలయాలను దర్శిస్తే చాలు నవగ్రహ దోషాలు పటాపంచలై, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
సాధారణంగా నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. కానీ ఈ నవ తిరుపతి క్షేత్రాల్లో మాత్రం సూర్యుడు కాకుండా ప్రతి గ్రహానికి ఒక విష్ణు మూర్తి రూపం ఉంటుంది. ఉదాహరణకు, శ్రీవైకుంఠంలోని కల్లాపిరాన్ స్వామి.. సూర్య గ్రహానికి ప్రతీకగా నిలుస్తారు.
అలాగే ఆళ్వార్ తిరునగరిలోని ఆదినాథ స్వామి.. గురు గ్రహానికి (బృహస్పతి), తిరుక్కోళూరులోని వైతమానిధి స్వామి ..కుజ గ్రహానికి సంకేతంగా పూజలందుకుంటారు. మిగిలిన ఆలయాలు చంద్ర, బుధ, శుక్ర, శని, రాహు, కేతు గ్రహాలకు ప్రతిరూపాలుగా భావిస్తారు. ఈ తొమ్మిది క్షేత్రాలు 108 దివ్య దేశాలలో భాగంగా ఉండటం విశేషం అంటారు వేద పండితులు.
అంతేకాదు ఈ నవ తిరుపతి క్షేత్రాల దర్శనం వెనుక ఒక ప్రత్యేక క్రమం కూడా ఉంటుందట. ఒకే రోజులో ఈ తొమ్మిది ఆలయాలను దర్శించుకోవడం వల్ల.. వారివారి జాతకంలోని గ్రహ దోషాల తీవ్రత తగ్గుతుందని పండితులు చెబుతుంటారు.
అలాగే జ్యోతిష్య రీత్యా ఏ గ్రహం అనుకూలించకపోయినా సరే ఆ గ్రహానికి సంబంధించిన విష్ణు క్షేత్రాన్ని దర్శించి..తమ మొక్కులు చెల్లించుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. తామ్రపర్ణి నది ఒడ్డున ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ఈ ఆలయాల శిల్పకళ, అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం భక్తులకు మనశ్శాంతిని ప్రసాదిస్తాయి. దక్షిణ భారతదేశ పర్యటనకు వెళ్లే భక్తులంతా తప్పక దర్శించాల్సిన అద్భుతమైన ఆధ్యాత్మిక చక్రం ఇది అంటారు చరిత్రకారులు.
