FIFA: ఫిఫా వరల్డ్ కప్ విన్నర్లకు జాక్‌పాట్.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ప్రైజ్ మనీ

FIFA: అమెరికా, మెక్సికో , కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ ప్రపంచకప్ జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగనుంది.

FIFA

ఫుట్‌బాల్ అంటేనే ఒక ఉద్వేగం, ఒక పిచ్చి. అటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరం ఫిఫా (FIFA)ప్రపంచకప్ 2026కి సంబంధించి ఒక కళ్లు చెదిరే వార్త బయటకు వచ్చింది. ఈ మెగా టోర్నీలో విజేతగా నిలిచే జట్టుకు ఇచ్చే బహుమతి సొమ్మును ఫిఫా భారీగా పెంచింది.

2026 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు ఏకంగా 50 మిలియన్ డాలర్లు, అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 451 కోట్ల రూపాయలు లభించనున్నాయి. గత ప్రపంచకప్‌తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీలో 50 శాతం పెరుగుదల ఉండటం క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

దోహాలో జరిగిన ఫిఫా (FIFA)కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు అధికారిక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం టోర్నీ కోసం కేటాయించిన బహుమతి నిధిని (ప్రైజ్ పూల్) 440 మిలియన్ డాలర్ల నుండి 655 మిలియన్ డాలర్లకు అంటే సుమారు 5,912 కోట్ల రూపాయలకు పెంచారు.

FIFA

రన్నరప్ జట్టుకు కూడా తక్కువ కాకుండా 297 కోట్ల రూపాయలు దక్కనున్నాయి. మూడవ స్థానంలో నిలిచిన జట్టుకు 261 కోట్లు, నాలుగో స్థానానికి 243 కోట్ల రూపాయలు లభిస్తాయి. 2022లో అర్జెంటీనాకు వచ్చిన ప్రైజ్ మనీ కంటే ఈసారి విజేతకు 100 కోట్లు ఎక్కువే దక్కనుండటం గమనార్హం.

ఈసారి కేవలం ప్రైజ్ మనీ మాత్రమే కాదు, టోర్నీలో పాల్గొనే జట్ల సంఖ్యను కూడా 32 నుండి 48కి పెంచారు. దీనివల్ల ఎక్కువ దేశాలు ఈ మెగా ఈవెంట్ లో భాగస్వాములు కావడానికి వీలవుతుంది.

టోర్నీకి క్వాలిఫై అయిన ప్రతి జట్టుకు ప్రిపరేషన్ ఖర్చుల కింద 13.5 కోట్లు ఇవ్వడంతో పాటు, ఒకవేళ గ్రూప్ స్టేజ్ లోనే నిష్క్రమించినా వారికి 81 కోట్ల రూపాయలు అందుతాయి. అమెరికా, మెక్సికో , కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ ప్రపంచకప్ జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగనుంది. పెరిగిన ప్రైజ్ మనీ వల్ల జట్ల మధ్య పోటీ ఇంకా తీవ్రంగా ఉండబోతోంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version