T20 World Cup : వరల్డ్ కప్ నుంచి ఆసీస్ ఔట్…సూపర్ 8లో జింబాబ్వే

T20 World Cup : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో ఆస్ట్రేలియా పోరాటం ముగిసింది. లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది

T20 World Cup

టీ20 ప్రపంచకప్(T20 World Cup) 2026లో ఆస్ట్రేలియా కథ ముగిసింది. మరో మ్యాచ్ మిగిలుండగానే ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. వర్షం కారణంగా జింబాబ్వే, ఐర్లాండ్ మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. దీంతో గ్రూప్ బి నుంచి శ్రీలంక ఇప్పటికే సూపర్ 8లోకి అడుగుపెట్టగా.. ఇప్పుడు 5 పాయింట్లతో జింబాబ్వే కూడా ముందంజ వేసింది.

ఈ మ్యాచ్ లో జింబాబ్వే ఓడిపోయి ఉంటే ఆస్ట్రేలియాకు సూపర్ 8కు చేరే అవకాశాలుండేవి. అయితే వర్షంతో మ్యాచ్ రద్దవడంతో ఆసీస్ కు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో గ్రూప్ స్టేజ్ లోనే ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టింది. 2009 తర్వాత గ్రూప్ స్టేజ్ లోనే టోర్నీ నుంచి నిష్క్రమించడం కంగారూలకు ఇదే తొలిసారి.

నిజానికి ఈ సారి ఆసీస్ జట్టు కీలక ఆటగాళ్ల సేవలు కోల్పోయింది. హ్యాజిల్ వుడ్, కమ్మిన్స్, స్టార్క్ వంటి పేసర్లు లేకుండానే మెగాటోర్నీ ఆడేందుకు వచ్చింది. గాయాల కారణంగా వారంతా వరల్డ్ కప్ కు దూరమయ్యారు. దీంతో ఆసీస్ బౌలింగ్ బలహీనంగా మారిపోయింది.

ఈ కారణంగానే జింబాబ్వే చేతిలో ఆసీస్ చిత్తుగా ఓడింది. ఆ జట్టుపై జింబాబ్వే మంచి స్కోరు సాధించి వారి అవకాశాలను దెబ్బకొట్టింది. గ్రూప్ స్టేజ్ లో కేవలం ఐర్లాండ్ పై మాత్రమే గెలిచిన ఆస్ట్రేలియా తర్వాత జింబాబ్వే చేతిలోనూ, శ్రీలంక చేతిలో పరాజయాలు చవిచూసింది. జింబాబ్వే చేతిలో ఓడిపోవడం ఒక విధంగా కంగారూలకు పెద్ద షాకే.

T20 World Cup

కీలక బ్యాటర్లు ఎవ్వరూ కూడా రాణించడం లేదు. మాక్స్ వెల్ ఒక్క మ్యాచ్ లోనూ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. మార్ష్ గాయంతో మధ్యలో లేకపోవడం కూడా ప్రభావం చూపింది. ఇప్పుడు ఆసీస్ చివరి మ్యాచ్ ఒమన్ తో తలపడుతుంది. ఆ మ్యాచ్ లో గెలిచి మెగాటోర్నీ విజయంతో ముగించాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే ఆసీస్ జింబాబ్వే చేతిలో ఓడిపోయిన తర్వాత ఆ దేశ మాజీ ఆటగాళ్లు సెలక్టర్లపై మండిపడుతున్నారు. ఫామ్ లో లేని ఆటగాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి కొంపముంచారని విమర్శిస్తున్నారు.

కాగా 2027 తొలి ఎడిషన్ లో సెమీఫైనల్స్ వరకూ చేరిన ఆసీస్ తర్వాత 2009లో గ్రూప్ స్టేజ్ లోనూ, 2010లో రన్నరప్ గానూ నిలిచింది. 2012లో సెమీఫైనల్స్ , 2014,2016 ఎడిషన్లలో సూపర్ 10 స్టేజ్ కే పరిమితమైంది. అయితే 2021లో ఛాంపియన్ గా నిలిచి తర్వాత గత రెండు ఎడిషన్లలోనూ సూపర్ 8 స్టేజ్ లోనే ఇంటిదారి పట్టింది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version