IND vs SA
భారత్, సౌతాఫ్రికా(IND vs SA) జట్ల మధ్య ఇక ధనాధన్ సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది. అభిమానులకు మరింత కిక్కిచ్చే టీ20 సిరీస్ కు మంగళవారం నుంచే తెరలేవబోతోంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 కటక్ వేదికగా జరగబోతోంది. వన్డే సిరీస్ గెలిచి ఫుల్ జోష్ మీద ఉన్న టీమిండియా పార్ట్ ఫార్మాట్లో కూడా దుమ్మురేపేందుకు ఎదురుచూస్తోంది.
టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా పొట్టి క్రికెట్ లో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తోంది. ఇప్పటి వరకూ ఒక్క సిరీస్ కూడా ఓడిపోకుండా తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పుడు వచ్చే టీ20 ప్రపంచకప్ కు టీమ్ కాంబినేషనను సెట్ చేసుకోవాలని భావిస్తోంది. తొలి టీ ట్వంటీ కోసం భారత జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. మెడనొప్పి నుంచి కోలుకున్న వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ రీఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది. గిల్ పూర్తి ఫిట్ నెస్ సాధించాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. అలాగే హార్లిక్ పాండ్యా, బుమ్రా కూడా రీఎంట్రీ ఇస్తున్నారు.
ఈ(IND vs SA) సిరీస్ లో అభిషేక్ శర్మ, గల్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా.. నంజూ శాంసన్ కు చోటు దక్కడం డౌటే. అతని స్థానంలో ఫినిషర్ గా జితేశ్ శర్మకు ప్లేస్ దక్కనుంది. వన్ డౌన్ లో కెప్టెన్ స్కై రానుండగా, నాలుగో స్థానంలో హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ దిగుతాడు. తర్వాత హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే బ్యాటింగ్ కు రానున్నారు. ఒకవేళ దూబే స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు చోటు దక్కితే అతడే దిగుతాడు.
ఏడో స్థానంలో జితేశ్ శర్మ బ్యాటింగ్ కు వస్తాడు. ఇక బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలలో ఒకరికి స్పెషలిస్ట్ స్పిన్నర్ గా చోటు దక్కడం ఖాయం. బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే మాత్రం అక్షర్ పటేల్ కు ఛాన్స్ ఇవ్వొచ్చు. పేస్ విభాగంలో హర్షిత్ రాణా కూడా బ్యాట్ తో మెరుపులు మెరిపిస్తుండడంతో బుమ్రా, అర్షదీప్ సింగ్ తో పాటు అతనికి చోటు దక్కే అవకాశముంది.
మరోవైపు సౌతాఫ్రికా (IND vs SA)కూడా బలంగానే ఉంది. టెస్టుల్లో వైట్ వాష్ చేసిన సఫారీలు, వన్డే సిరీస్ లో సైతం బాగానే రాణించారు. ఇక టీ20 స్పెషలిస్టులు సైతం సౌతాఫ్రికా జట్టులో బాగానే ఉన్నారు. మాక్రరమ్ మళ్లీ పార్ట్ ఫార్మాట్ లో సఫారీ కెప్టెన్ గా తిరిగి వచ్చాడు. డికాక్, బ్రెవిస్, స్టబ్స్, డేవిడ్ మిల్లర్ వంటి హిట్టర్స్ సౌతాఫ్రికాకు ప్రధాన బలం. అలాగే వన్డే సిరీస్ లో మెరుపులు మెరిపించిన డి జోర్జీ, మార్కో జెన్సన్, కార్బిన్ బోస్చ్ కూడా కీలకం కాబోతున్నారు. ఏ విధంగా చూసినా టీ20 స్టార్స్ తో కూడిన సౌతాఫ్రికాను తేలిగ్గా తీసుకోలేం. టీ20 ఫార్మాట్లో సౌతాఫ్రికాపై భారతే పైచేయిగా ఉంది. రెండు జట్లు 31 సార్లు తలపడితే భారత్ 18 మ్యాచ్ లలో, సౌతాఫ్రికా 12 మ్యాచ్ లలో గెలిచాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
