India Bowling : ఇలా అయితే కష్టమే !..పేలవంగా భారత బౌలింగ్

India Bowling : న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 1-2 తేడాతో దారుణమైన ఓటమిని చవిచూసింది

India Bowling

క్రికెట్ లో ఏ ఒక్క అంశంలో బాగా రాణిస్తే సరిపోదు… బ్యాటింగ్, బౌలింగ్ , ఫీల్డింగ్.. ఇలా మూడు విభాగాలూ ముఖ్యమే.. అన్నింటిలో అదరగొడితేనే విజయాలు అందుతాయి. ఏదో ఒక విభాగంలో చెలరేగి మరో దానిలో చేతులెత్తేస్తే ఓటములే పలకరిస్తుంటాయి. ప్రస్తుతం టీమిండియాకు ఎదురువుతోంది ఇదే పరిస్థితి.. ఎందుకంటే బ్యాటింగ్ పరంగా సమస్యలు లేకున్నా భారత బౌలింగ్ (India Bowling) లోనూ మాత్రం చాలా ఇబ్బందులున్నాయి.

తాజాగా న్యూజిలాండ్ తో ముగిసిన వన్డే సిరీసే దీనికి అసలైన ఉదాహరణ. ఈ సిరీస్ భారత బౌలింగ్ (India Bowling) బలహీనతలను పూర్తిగా బయటపెట్టింది. తొలి మ్యాచ్ లో భారత్ గెలిచినా కూడా ఆ వన్డేలోనూ మన బౌలర్లు విఫలమయ్యారు. ఇక రెండు, మూడు వన్డేల్లో మన బౌలింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.. ఎందుకంటే సొంతగడ్డపై అదీ మన కంటే పటిష్టంగా అయితే లేని న్యూజిలాండ్ పై ఇలాంటి బౌలింగ్ ప్రదర్శనే ఒకవిధంగా అవమానమనే చెప్పాలి.

ముందు రెండో వన్డే గురించి మాట్లాడుకుంటే మన బౌలర్లు అస్సలు ప్రభావం చూపలేకపోయారు. పవర్ ప్లేలో రెండు వికెట్లు తీసామని సంబరపడే లోపు తర్వాత మిడిల్ ఓవర్లు, స్లాగ్ ఓవర్లలో చేతులెత్తేశారు. ఫలితంగా కివీస్ సిరీస్ ను సమం చేసింది. రెండో వన్డేలో డారిల్ మిచెల్ , విల్ యంగ్ జోడీని భారత బౌలర్లు ఏ దశలోనూ ఇబ్బంది పెట్టలేకపోయారు. అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు సమిష్టిగా విఫలమయ్యారు.

ఒకదశలో మనది సాదాసీదా  భారత బౌలింగ్ (India Bowling) కనిపించిందంటే అతిశయోక్తి కాదు. బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. అలా అని సిరాజ్ , అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణ , కుల్దీప్ యాదవ్, జడేజా లాంటి బౌలర్లను తక్కువ చేసి చూపడం కాదు. కివీస్ బ్యాటింగ్ లో దిగ్గజాలు లేకపోయినా యువ బ్యాటర్లను సైతం మన బౌలర్లు ఎందుకు ఇబ్బంది పెట్టలేకపోయారన్నదే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. నిజం చెప్పాలంటే హైదరాబాదీ పేసర్ సిరాజ్ పర్వాలేదనిపించినా అతని బౌలింగ్ లో పేస్ పదును తగ్గిందనేది వాస్తవం.

India Bowling

అలాగే అర్షదీప్ సింగ్ కు చివరి మ్యాచ్ లో మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. అయితే వరుసగా రెండు మ్యాచ్ లలో ఫెయిలయిన ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్ అంతంత మాత్రంగానే కనిపించింది. వికెట్లు తీసినా అతని బౌలింగ్ లో వైవిధ్యం అయితే లేదు. మ్యాచ్ విన్నర్ కూడా కాని ప్రసిధ్ధ కృష్ణను ఎందుకు తుది జట్టులో కొనసాగిస్తున్నారనేది గంభీరే చెప్పాలి. ఇక హర్షిత్ రాణా తన ప్రియ శిష్యుడు కావడంతో అతనికి వరుస అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. వికెట్లు తీస్తున్నా రాణా భారీగా పరుగులు ఇచ్చేస్తున్నాడు.

ఈ వైఫల్యం కవర్ చేసుకునేందుకే బ్యాటింగ్ మీద ఫోకస్ పెట్టాడేమో అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అటు జడేజా స్పిన్ మ్యాజిక్ పనిచేయడం లేదు. అతని కెరీర్ ముగింపు దశలో ఉండగా.. కుల్దీప్ కూడా పెద్దగా రాణించడం లేేదు. మరి ఇలాంటి బౌలింగ్ తో మ్యాచ్ లు గెలవడం కష్టమని చెప్పొచ్చు. 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా పెట్టుకున్న కోచ్ గంభీర్ బౌలింగ్ కాంబినేషన్స్ పై మరింతగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఖఛ్చితంగా ఉంది.

Vygha Reddy :పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసే వారంతా వేస్ట్ ఫెలోస్..వైరల్ అవుతోన్న వైఘారెడ్డి కామెంట్స్

Exit mobile version