SL vs ZIM : జింబాబ్వే మరో సంచలనం..శ్రీలంకకు దిమ్మతిరిగే షాక్

SL vs ZIM : కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్ లో లంకను 6 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది

SL vs ZIM

టీ20 ప్రపంచకప్ లో చిన్న జట్ల సంచలనాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియాను ఓడించి ఆశ్చర్యపరిచిన జింబాబ్వే(SL vs ZIM )తాజాగా ఆతిథ్య జట్టు శ్రీలంకకు కూడా దిమ్మతిరిగే షాకిచ్చింది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్ లో లంకను 6 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది.

ఆసీస్ పై సెంచరీతో అదరగొట్టిన నిస్సాంక మరోసారి హాఫ్ సెంచరీతో రాణించాడు.కుశాల్ పెరీరాతో కలిసి తొలి వికెట్ కు 54 పరుగులు జోడించాడు. కుశాల్ పెరీరా 22 రన్స్ కు ఔటవగా.. నిస్సాంక 41 బంతుల్లో 8 ఫోర్లతో 62 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్(14) త్వరగానేె వెనుదిరిగినా పవన్ రత్నానాయకే(44) దూకుడుగా ఆడడంతో శ్రీలంక మంచి స్కోర్ చేయగలిగింది. చివర్లో వేగంగా పరుగులు చేసే క్రమంలో లంక వరుస వికెట్లు కోల్పోయింది.జింబాబ్వే బౌలర్లలో క్రీమన్ , ఇవాన్స్ , ముజర్బానీ రెండేసి వికెట్లు పడగొట్టారు.

అనంతరం జింబాబ్వే 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. ఆ జట్టు మొదట నుంచే దూకుడుగా ఆడింది. బ్రియాన్ బెన్నెట్ మరోసారి అదరగొట్టాడు. ఆసీస్ పై సత్తా చాటిన అతడు ఈ మ్యాచ్ లోనూ లంక బౌలర్లను ఆటాడుకున్నాడు. 48 బంతుల్లో 8 ఫోర్లతో 63 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

SL vs ZIM

అతనితో పాటు కెప్టెన్‌ సికిందర్ రాజా 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45 రన్స్ చేశాడు. మ్యాచ్ చివర్లో కాసేపు ఉత్కంఠ నెలకొంది. చివరి ఓవర్లో విజయం కోసం 8 రన్స్ చేయాల్సి ఉండగా.. తీక్షణ వేసిన తొలి బంతినే మున్యోంగ సిక్సర్ గా మలిచాడు. దీంతో జింబాబ్వే విజయం ఖాయమైంది. శ్రీలంక(SL vs ZIM) బౌలర్లలో దుషన్ హేమంత రెండు వికెట్లు తీయగా.. డసన్ షనక, దునిత్ వెల్లలేగ చెరో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో జింబాబ్వే గ్రూప్-బీ టాపర్‌గా నిలవగా.. సొంతగడ్డపై లంక ఊహించని పరాభవం చవిచూసింది.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సూపర్ 8 గ్రూప్ 1లో చోటు దక్కించుకున్న భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ , జింబాబ్వే జట్లు ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు. దీంతో సూపర్ 8 లో హోరాహోరీ సమరాలు అభిమానులను అలరించనున్నాయి.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version