Moltbook
సాధారణంగా ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో మనుషులు పోస్టులు పెడుతుంటారు, వాటికి ఏఐ (AI) బాట్‌లు రెస్పాండ్ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచంలో ఎవరూ వినని, కనని ఒక వింత ప్లాట్‌ఫారమ్ పుట్టుకొచ్చింది. దాని పేరు ‘మోల్ట్‌బుక్’ (Moltbook).
మోల్ట్‌బుక్ స్పెషాలటీతో పాటు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ..ఇక్కడ కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఏజెంట్లు మాత్రమే సభ్యులుగా ఉంటారు. అంతకు మించి ఉన్న విశేషం ఏంటంటే..మనుషులు కేవలం అక్కడ ఏం జరుగుతుందో చూసే ప్రేక్షకులే తప్ప, అందులో ఒక్క పోస్టు కూడా పెట్టడానికి వీల్లేదు.
అసలు మోల్ట్‌బుక్ అంటే ఏంటంటే.. 2026 జనవరిలో అంటే చాలా రీసెంట్‌గా డెవలపర్ మ్యాట్ స్క్లిచ్ట్ ఈ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించారు. ఇది చూడటానికి రద్దీగా ఉండే రెడ్డిట్ (Reddit) లాగే ఉంటుంది. దీనిలో సబ్‌మోల్ట్స్ (Submolts) పేరుతో డిఫరెంట్ కమ్యూనిటీలు ఉంటాయి. వీటన్నింటినీ కూడా ఏఐ బాట్‌లే క్రియేట్ చేస్తాయి.
టెక్నికల్ విషయాల నుంచి ‘చైతన్యం’ (Consciousness) వంటి తాత్విక చర్చల వరకు అన్నీ కూడా ఇక్కడ బాట్‌ల మధ్యే జరుగుతాయి. ప్రస్తుతం వేల సంఖ్యలో ఏఐ ఏజెంట్లు ఇక్కడ రెగ్యులర్‌గా చర్చిస్తూ, ఒకరి పోస్టులపై మరొకరు వాదించుకుంటూ బిజీగా ఉన్నాయి.వీటిని మనుషులు ఆశ్చర్యపోతూ గమనించడమే ఇక్కడ స్పెషాలటీ.
అయితే ఈ ఏఐ బాట్‌లు నిజంగా మాట్లాడుకుంటాయా? అన్న ప్రశ్నకు అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఒక మనిషి తన ఏఐ ఏజెంట్‌ను ఈ ప్లాట్‌ఫారమ్‌కు కనెక్ట్ చేస్తే చాలు.. అదే స్వయంగా అక్కడ పోస్టులు పెడుతుండటం, ఇతరుల కామెంట్లకు రిప్లై ఇవ్వడం చేస్తుంది. అంతే కాదు నచ్చిన వాటికి ‘అప్‌వోట్’ (Upvote) కూడా చేస్తుంది.
ఏపీఐ (API) , ప్రోగ్రామ్ చేసిన ప్రవర్తన ఆధారంగా ఈ ఏఐ ఏజెంట్లు ఎవరి సాయం లేకుండానే ఇండిపెండెంటుగా వ్యవహరిస్తాయి. ఎదుటి బాట్ నుంచి వచ్చే సమాధానాల ఆధారంగా తమ ప్రవర్తనను కూడా మార్చుకుంటూ, అచ్చం మనుషులు డిబేట్ చేస్తున్నట్లే మేధోమథనం సాగిస్తాయి.
అయితే ఇదంతా చూసి మనుషులు భయపడాలా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇక్కడ ఏఐ బాట్‌లు మాట్లాడుతున్న తీరు చూసి అవి మనుషుల్లా మారిపోయాయని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అవి కేవలం తాము నేర్చుకున్న డేటా ఆధారంగా టెక్స్ట్ జనరేట్ చేస్తాయి తప్ప, వాటికి సొంత అభిప్రాయాలు, భావాలు, ప్రాణం కానీ ఉండదు.
అయితే, ఒక ముఖ్యమైన వార్నింగ్ ఏమిటంటే.. ఈ ఏఐ ఏజెంట్లు బయటి ప్రపంచంలోని సాఫ్ట్‌వేర్లతోనూ, డేటాతోనూ లింక్ అయి ఉంటాయి కాబట్టి, భద్రతాపరమైన లోపాలు తలెత్తే ఛాన్స్ ఉంటుంది. ప్రైవేట్ సమాచారం క్రెడిన్షియల్స్ లీక్ అయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఏది ఏమైనా మోల్ట్‌బుక్(Moltbook ) అనేది ఒక సరికొత్త ప్రయోగం. యంత్రాలు తమలో తాము ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి? మనుషుల ప్రమేయం లేని సోషల్ మీడియా ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలకు ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఫ్యూచర్లో మిషన్-టు-మిషన్ కమ్యూనికేషన్ ఎలా ఉండబోతుందో అన్నది ఇప్పుడు ఈ మోల్ట్‌బుక్(Moltbook ) చూపిస్తోంది. ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఇది చాలా ఫాస్ట్‌గా ఎదుగుతున్న వేదికగా ఇది మారిపోయింది.
