Telangana:62 ఏళ్ల వయసులో ఐసెట్‌లో సత్తా చూపించిన తెలంగాణ వాసి

Telangana:తెలంగాణలోని ఆదిలాబాద్‌కు చెందిన 62 ఏళ్ల రావుల సూర్యనారాయణ(Suryanarayana), ఇటీవల విడుదలైన ఐసెట్( ICET ) ఫలితాల్లో 178వ ర్యాంకు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Telangana:తెలంగాణలోని ఆదిలాబాద్‌కు చెందిన 62 ఏళ్ల రావుల సూర్యనారాయణ(Suryanarayana), ఇటీవల విడుదలైన ఐసెట్( ICET ) ఫలితాల్లో 178వ ర్యాంకు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. నేర్చుకోవాలనే ఆసక్తి, సాధించాలనే పట్టుదల ఉంటే వాటికి వయసు అడ్డుకాదని ఆయన నిరూపించారు.

Telangana:

Telangana: విషాదాలను అధిగమించి…
సూర్యనారాయణ(Suryanarayana) జీవితం ఒడిదుడుకులతో సాగింది. గతంలో ఎల్‌ఐసీలో సహాయ పాలనాధికారిగా పనిచేసిన ఆయన, తన భార్య సునీత, ఇద్దరు కుమారులతో సంతోషంగా జీవించారు. వారి పెద్ద కుమారుడు శశాంక్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాగా, చిన్న కుమారుడు శరణ్ వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. 2020లో సూర్యనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు.

అంతా బాగుందని అనుకున్న సమయంలో వైద్య విద్య అభ్యసిస్తున్న చిన్న కుమారుడు అనారోగ్యంతో మరణించాడు. ఆ తర్వాత కరోనా మహమ్మారికి ఆయన భార్య బలైపోయారు. ఈ వరుస విషాదాలతో ఆయన తీవ్ర కుంగుబాటుకు లోనయ్యారు. కొంత ఉపశమనం కోసం మహారాష్ట్రలోని పర్బణీలో ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్న తన పెద్ద కుమారుడి వద్దకు వెళ్లారు.

యువతకు స్ఫూర్తిగా నిలవాలనే లక్ష్యం
కుమారుడి వద్ద ఉన్న సమయంలో, పరీక్షల్లో సరిగా రాయలేదని విద్యార్థులు, పోటీ పరీక్షల్లో విఫలమయ్యామని యువకులు ఆత్మహత్య చేసుకున్న వార్తలు సూర్యనారాయణను కలచివేశాయి. ఎందరో జీవితాలకు భద్రత కల్పించే ఎల్ఐసీలో ఉద్యోగం చేసిన తాను, భావితరాలకు జీవిత విలువను తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వయోపరిమితి లేని ఐసెట్ పరీక్ష రాయాలని సంకల్పించారు. కష్టపడి చదివి, గత ఏడాది తన మొదటి ప్రయత్నంలో 1,828 ర్యాంకు సాధించారు. ఈసారి ఏకంగా 178వ ర్యాంకుతో సత్తాచాటారు. 62 ఏళ్ల వయసులో ఐసెట్‌లో సత్తా చూపించడంతో ఇప్పుడు అందరి కళ్లూ అతనిపైనే ఉన్నాయి.

తన విజయం గురించి సూర్యనారాయణ మాట్లాడుతూ, “నాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఎంసీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ సీబీటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(Computer Based Test) తరహాలో ఉండటం వల్ల ఆ పరీక్ష రాయడానికి నేను ప్రత్యేక ఆసక్తి చూపించాను. ఈ ఎగ్జామ్‌లో మంచి స్కోర్ సాధించడానికి కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్, షార్ట్ నోట్స్ సిద్ధం చేసుకోవడం, ప్రణాళికాబద్ధంగా చదవడమనేది ప్రధాన కారణాలు. మనం కష్టపడి చదువుతున్నామనే భావనతో కాకుండా ఇష్టపడి చదువుతున్నామనే భావనతో ఉండాలి” అని అన్నారు. ఏది ఏమైనా రావుల సూర్యనారాయణ విజయం, నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని.. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని ఆయన నిరూపించారని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Exit mobile version