Tourism
హైదరాబాద్ సిటీ అందాలను పర్యాటకులు సరికొత్త కోణంలో చూడటానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సిటీలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలను సందర్శించే వారి కోసం.. ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తీసుకురావడానికి పర్యాటక శాఖ గట్టిగా నిర్ణయించుకుంది.
అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సుమారు 12 కోట్ల రూపాయల వ్యయంతో హెచ్ఎండీఏ ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ బస్సులు కొన్ని మార్గాల్లో మాత్రమే తిరుగుతున్నాయి. అయితే వీటిని పూర్తిస్థాయిలో టూరిజం(Tourism) రంగం కోసం వినియోగిస్తే, సిటీకి వచ్చే టూరిస్టులకు ఒక మధురమైన అనుభూతిని అందించొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతోనే ఈ బస్సులను హెచ్ఎండీఏ నుంచి తమ పరిధిలోకి తెచ్చుకోవడానికి టూరిజం శాఖ కసరత్తు చేస్తోంది.
అయితే ఈ బస్సులను పూర్తిగా కొనడం కంటే, అద్దె ప్రాతిపదికన తీసుకోవడం ద్వారా నిర్వహణ భారాన్ని తగ్గించుకోవాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. నెలవారీ కొంత మొత్తాన్ని హెచ్ఎండీఏకు రెంట్ రూపంలో చెల్లించి, వీటిని టూరిస్ట్ ప్రాంతాల మధ్య నడపనున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి.
ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యం ఉంది. చార్మినార్ నుంచి గోల్కొండ వరకు, లేదా హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. బస్సు పైభాగంలో కూర్చుని సిటీతో పాటు చారిత్రక కట్టడాలను వీక్షించడం పర్యాటకులకు, ముఖ్యంగా పిల్లలకు , విదేశీ టూరిస్టులకు గొప్ప అనుభవంగా మారనుంది.
దీనివల్ల నిజంగానే అందరినీ ఆకట్టుకోగలరా అంటే.. కచ్చితంగా ఆకట్టుకోగలరని చెప్పొచ్చు. ఎందుకంటే డబుల్ డెక్కర్ బస్సులకు అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా ఒక ప్రత్యేకమైన ఆకర్షణ (Charm) ఉంటుంది. ఇది కేవలం జర్నీ మాత్రమే కాదు, అదొక పర్యాటక ఆకర్షణగా మారుతుంది. లండన్ వంటి నగరాల్లో ఇలాంటి బస్సుల్లో సిటీ చూడటం పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్.
అదే మోడల్‌ను హైదరాబాద్‌లోనూ అమలు చేయడం వల్ల టూరిజం(Tourism) డిపార్ట్‌మెంట్‌కు ఆదాయం పెరగడమే కాకుండా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. సామాన్యులు కూడా తక్కువ ధరలో విలాసవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద రేవంత్ ప్రభుత్వం తీసుకున్న ఈ అడుగు ..హైదరాబాద్ టూరిజం రంగానికి కొత్త కళను తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది.
