BRS : బీఆర్ఎస్ లో కనిపించని ప్రచారహోరు..మున్సిపోల్స్ పై కారు స్పీడ్ తగ్గిందా ?

BRS : తెలంగాణలో ఇప్పుడు పురపోరు హడావుడి మామూలుగా లేదు. అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా ప్రచారహోరులో బిజీగా మారిపోయాయి. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం అంత జోష్ గా కనిపించడం లేదు

BRS

తెలంగాణలో ఇప్పుడు పురపోరు హడావుడి మామూలుగా లేదు. అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా ప్రచారహోరులో బిజీగా మారిపోయాయి. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం అంత జోష్ గా కనిపించడం లేదు. కాంగ్రెస్, బీజేపీలతో పోలిస్తే ప్రచారంలో గులాబీ పార్టీ శ్రేణులు బాగా వెనుకబడ్డాయి.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుతో లేకున్నా కాస్త హడావుడి చేసిన పలువురు బీఆర్ఎస్(BRS) నేతలు మున్సిపల్ ఎన్నికలను లైట్ తీసుకున్నారన్న ప్రచారం వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికలు చాలా కీలకమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. గులాబీ బాస్ కూడా సీరియస్ గా తీసుకున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి చాలా భిన్నంగా కనిపిస్తోంది.

పురపోరు ఎన్నికల బాధ్యతలను ఇంచార్జ్‌లు, స్థానిక నాయకులకే వదిలేసినట్టు అర్థమవుతోంది. అభ్యర్థుల ఎంపిక, బీ ఫాంల పంపిణి, ప్రచార బాధ్యతలు , జనసమీకరణ వంటివి స్థానిక నేతలే చూసుకుంటారని పలువురు చెబుతున్నారు. హరీశ్ రావు, కేటీఆర్ కూడా మున్సిపల్స్ కు సంబంధించి తమ తమ నియోజకవర్గాలకే పరిమితమవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎలాగూ కేసీఆర్ రానప్పడు హరీశ్, కేటీఆర్ లే చూసుకోవాలి. కానీ హరీశ్ రావు సిద్ధిపేట, కేటీఆర్ సిరిసిల్లలోనే ఉండడం పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తోంది.

BRS

కేసీఆర్ రాకున్నా హరీశ్ రావు, కేటీఆర్ వంటి ముఖ్యనేతలు జిల్లాల పర్యటనలకు వస్తారని, ప్రచారంలో దూసుకెళ్ళొచ్చని గులాబీ పార్టీ కింది స్థాయి నేతలు, శ్రేణులు భావించాయి. తీరా టైమ్ వచ్చేసరికి అవేమీ జరగకపోవడం వారి ఉత్సాహాన్ని నీరుగార్చినట్టుగానే కనిపిస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంది. విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన కొన్నిగంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఇతర నేతలతో సమావేశం నిర్వహించి చర్చించారు.

ఏ జిల్లాకు ఎంతమంది మంత్రులు వెళ్లాలి, ప్రచార కార్యక్రమాల షెడ్యూల్, వంటి వాటిపై దిశానిర్ధేశం చేశారు, అటు బీజేపీ కూడా మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారంటే ఎంత సీరియస్ గా తీసుకున్నారనేది అర్థమవుతోంది. ఇక జనసేన పార్టీ సైతం ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుండడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తం మీద ఇతర పార్టీలతో పోలిస్తే బీఆర్ఎస్(BRS) జోష్ తగ్గడానికి కారణాలపై అందరూ ఆరా తీస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version