CM Revanth : కలెక్టర్లూ..డైలీ రిపోర్ట్ రెడీనా?

CM Revanth : జిల్లాల పరిధిలోని ఐఏఎస్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, అలాగే కలెక్టర్లు రోజువారీగా చేసిన పనుల వివరాలను తనకు తెలియజేయాలని సీఎం ఆదేశించారు.

CM Revanth : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం, పాలనపై మరింత పట్టు సాధించేందుకు సరికొత్త విధానాన్ని అవలంబిస్తున్నారు. ముఖ్యంగా వర్షాలు కురుస్తున్న ఈ సమయంలో.. పరిపాలన, జనజీవన ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి సారించారు.దీనిలో భాగంగా, ఆయన జిల్లా కలెక్టర్ల నుంచి రోజువారీ వర్క్ రిపోర్ట్ మస్ట్ అని కండిషన్ పెట్టారు.

CM Revanth

సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కలెక్టర్ల(district collectors)తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వర్షాలు, సీజనల్ వ్యాధులు, నీటి సంరక్షణ, యూరియా నిల్వలు, రేషన్ కార్డుల పంపిణీ వంటి అంశాలపై చర్చించారు. జిల్లాల పరిధిలోని ఐఏఎస్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, అలాగే కలెక్టర్లు రోజువారీగా చేసిన పనుల వివరాలను తనకు తెలియజేయాలని సీఎం ఆదేశించారు. వారి కార్యాచరణ రిపోర్టు రోజూ తనకు పంపించాలని సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నుంచి కలెక్టర్ల పనితీరుపై రోజువారీ మానిటరింగ్ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

యూరియా స్టాక్‌కు సంబంధించి, ప్రతి ఎరువుల దుకాణం వద్ద స్టాక్ వివరాలను బోర్డుపై ప్రదర్శించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్రంలో కావాల్సినంత యూరియా స్టాక్ ఉందని తెలిపారు. ఇతర వ్యాపార అవసరాలకు యూరియాను ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు రేషన్ కార్డుల పంపిణీ చేయాలని, ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

భారీ వర్షాల సమయంలో కలెక్టర్లు వెదర్ రిపోర్ట్ (weather report)వచ్చిన వెంటనే, ఆయా జిల్లాల్లో అధికారులను అలర్ట్ చేసి, ప్రాణనష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై చర్యలు తప్పవని సమీక్షలో సీఎం హెచ్చరించారు. అంతేకాకుండా, కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. మొత్తంగా సరికొత్త దారిలో వెళుతున్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన హెచ్చరికలతో .. పాలన యంత్రాంగంలో ఎలాంటి మార్పు వస్తుందో చూడాలి.

 

Exit mobile version