Telangana
దేశంలోనే పెట్రోల్ ధరలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ (Telangana)ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించినా, ఇక్కడ ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. గత ఐదు సంవత్సరాలలో తెలంగాణలో పెట్రోల్ ధరలు 23% కంటే ఎక్కువ పెరిగాయి. ఇది ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాలలో పెరిగిన ధరల కంటే దాదాపు 10% అధికం. కేంద్ర ఎక్సైజ్ సుంకం తగ్గించినా కూడా, ఈ పెరుగుదల కొనసాగింది.
లోక్‌సభలో సమర్పించిన డేటా ప్రకారం, తెలంగాణకు రిఫరెన్స్ నగరమైన హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 2021లో లీటర్‌కు రూ. 87.06 ఉండగా, ఇప్పుడు రూ. 107.46 కి చేరింది. ప్రధాన నగరాల్లో, కోల్‌కతాలో మాత్రమే ఇలాంటి పెరుగుదల నమోదైంది. దేశవ్యాప్తంగా చూస్తే, పెట్రోల్ ధరల్లో తెలంగాణ మూడవ స్థానంలో ఉంది. పూణే (రూ. 109.74) ,జలంధర్ (రూ. 107.48) తర్వాత తెలంగాణలోనే ధరలు ఎక్కువగా ఉన్నాయి.
కేంద్ర పెట్రోలియం , సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ ధరల పెరుగుదలపై స్పందించారు. వివిధ భౌగోళిక రాజకీయ, మార్కెట్ కారణాల వల్ల ముడి చమురు (crude oil) ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల, ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 110.04 నుంచి రూ. 94.77 కు, డీజిల్ ధర రూ. 98.42 నుంచి రూ. 87.67 కు తగ్గింది. 2021 నవంబర్, 2022 మే నెలల్లో కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్‌పై రూ. 13, డీజిల్ పై రూ. 16 తగ్గించాం, ఆ ప్రయోజనం పూర్తిగా వినియోగదారులకు చేరిందని ఆయన వివరించారు.
తెలంగాణ(Telangana)లో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం(Telangana) విధించే పన్నులు (VAT) అని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించినా, తెలంగాణ మాత్రం తగ్గించలేదు. ఒకవేళ వ్యాట్‌ను సవరిస్తే, ఇక్కడ ఇంధన ధరలు గణనీయంగా తగ్గుతాయి.
అధిక వ్యాట్ వల్ల, తెలంగాణ(Telangana)లో ధరలు ఎక్కువగా ఉండటంతో.. పొరుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉండటంతో, బల్క్ కొనుగోలుదారులు అక్కడికి వెళ్లి ఇంధనం నింపుకుంటున్నారు.ఈ విధంగా తెలంగాణ, కర్ణాటకకు ఏటా దాదాపు రూ. 2,000 కోట్లు కోల్పోతోంది. ఎందుకంటే, కర్ణాటక సరిహద్దు జిల్లాలైన కలబురగి (గుల్బర్గా) వంటి ప్రాంతాల నుంచి చాలామంది బల్క్ కొనుగోలుదారులు ఇంధనం కొనుగోలు చేస్తున్నారు.
డీలర్లు చెబుతన్న దాని ప్రకారం, హైదరాబాద్‌లో డీజిల్ ధరలు కూడా ముంబై కంటే వేగంగా పెరిగాయి. తెలంగాణలో పెట్రోల్ ధరల (Petrol Prices)పెరుగుదలకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం విధించే అధిక వ్యాట్. కేంద్రం సుంకాలు తగ్గించినా కూడా ..రాష్ట్ర ప్రభుత్వం వాటిని తగ్గించకపోవడంతో ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇది రాష్ట్రానికి ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తుంది. అయితే ఇలా బల్క్ కొనుగోలుదారులు తక్కువ ధరలు ఉన్న పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. ఈ సమస్యను పరిష్కరించడానికి వ్యాట్‌ను కూడా తగ్గించాలి.