Book Fair
అక్షరాలే ఆయుధాలుగా, జ్ఞానమే నిధిగా భావించే పుస్తక ప్రేమికులతో ఈ 11 రోజులు హైదరాబాద్ బుక్ ఫెయిర్(Book Fair) ఒక మినీ జాతరను తలపించింది. 11 రోజులుగా నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాగిన 38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన.. సోమవారంతో అత్యంత ఘనంగా ముగిసింది.
అయితే ఈసారి జరిగిన ఈ పుస్తక ప్రదర్శన (Book Fair)ఒక అరుదైన రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఎప్పుడూ లేనంతగా దాదాపు పదహారు లక్షల మందికి పైగా సందర్శకులు ఈ అక్షర సేద్యాన్ని సందర్శించినట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, ప్రముఖ కవి యాకూబ్ చెప్పారు.
సాధారణంగా ఈ రోజుల్లో అందరూ స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారని అనుకున్న అందరినీ ఆశ్చర్యపరిచేలా బుక్ ఫెయిర్‌లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చలి తీవ్రతను కూడా లెక్కచేయకుండా రాత్రి తొమ్మిది గంటల వరకు స్టాళ్లన్నీ సందర్శకులతో కిటకిటలాడటం ఈ ఏడాది విశేషం.
ఈ ప్రదర్శనలో మొత్తం 265 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఫిక్షన్ పుస్తకాలకు ఈసారి విపరీతమైన ఆదరణ లభించింది. వీటితో పాటు బాల సాహిత్యం, సైన్స్, ఆధ్యాత్మికం , ప్రముఖుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలు భారీగా అమ్ముడుపోయాయి. చాలా మంది యువ రచయితలు తమ పుస్తకాలను ఈ వేదికపైనే ఆవిష్కరించుకోవడం మరో విశేషం.
చాలామంది రచయితలు తాము రాసిన స్టాళ్ల వద్దే ఉండి పాఠకులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ, వారితో ముచ్చటించడం పుస్తక ప్రియులకు ఒక మధురమైన అనుభూతిని ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఉద్యోగ నోటిఫికేషన్లు పెద్దగా లేకపోవడంతో పోటీ పరీక్షల పుస్తకాలకు గతం కంటే ఆదరణ కొంచెం తగ్గిందని నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ బుక్ ఫెయిర్(Book Fair)లో కేవలం పుస్తకాలే కాకుండా పలు సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు కూడా జరిగాయి. పుస్తక ప్రియుల కోసం ప్రత్యేకంగా స్టేజీలను ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను పంచుకునేలా ప్రోత్సహించారు. పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ‘సురక్ష’ స్టాల్ ఈ బుక్ ఫెయిర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడ ఫోటోలు దిగడానికి సందర్శకులు పోటీ పడ్డారు.
అలాగే అన్ని స్టాళ్లలో పుస్తకాలపై పది నుంచి ఇరవై శాతం వరకు రాయితీ ఇవ్వడంతో, పాఠకులు తమకు కావాల్సిన పుస్తకాలను తక్కువ ధరకే కొనుక్కునే అవకాశం లభించింది. పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లలో నీతి కథలు, డ్రాయింగ్ పుస్తకాలు, 3డీ పుస్తకాలు చిన్నారులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్టేషనరీ స్టాళ్లు కూడా ఈ జాతరలో సందడి చేశాయి.
డిసెంబర్ 19న ప్రారంభమైన ఈ అక్షర పండుగ అందరి అంచనాలను దాటి పదహారు లక్షల మార్కును చేరుకోవడం ఈ ప్రదర్శన విజయానికి నిదర్శనం. మొత్తానికి హైదరాబాద్ బుక్ ఫెయిర్ అక్షరాలను ప్రేమించే ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక చెరగని ముద్ర వేస్తూ ఈ ఏడాదికి సెలవు తీసుకుంది.
