HYDRA : హైదరాబాద్‌లో వర్షం ఎప్పుడు వస్తుందో, ఎంత సేపు కురుస్తుందో అంచనా వేయడం ఎప్పుడూ ఒక సవాలే. ఎండ కాస్తుందని బయలుదేరిన అరగంటకే వర్షం మొదలై వాహనదారులను ఇబ్బంది పెడుతుంది. కనీసం వర్షం గురించి గంట ముందు అయినా కచ్చితమైన సమాచారం ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఇప్పుడు హైదరాబాద్‌లో హైడ్రా (HYDRA) రంగంలోకి దిగింది. వర్షం కబురును రెండు గంటల ముందే చెబుతూ హైదరాబాద్ ప్రజలను ముందుగానే అప్రమత్తం చేస్తోంది.
HYDRA
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్డీఎంఏ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ), భారత వాతావరణ శాఖతో కలిసి హైడ్రా ఇటీవల ఈ విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. గతంలో వాతావరణ సమాచారం కేవలం ఐదు నుంచి పది ప్రాంతాల నుంచి మాత్రమే వచ్చేది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లకు వాతావరణ శాఖ వేర్వేరుగా సమాచారం ఇచ్చేది. అయితే ఇప్పుడు, జీహెచ్‌ఎంసీ, హైడ్రా సంయుక్త కృషి ఫలితంగా, 150 డివిజన్లలో ఏకంగా 5 లక్షలమందికి వేర్వేరుగా వాతావరణ సమాచారాన్ని రూపొందిస్తున్నారు.
ఈ సమాచారం కేవలం అధికారులకే పరిమితం కాకుండా, ప్రజల వద్దకు నేరుగా చేరవేసేలా హైడ్రా ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. సెల్ టవర్ల సిగ్నళ్ల ఆధారంగా ఏ ప్రాంతంలో వర్షం కురవబోతుందో గుర్తించి, ఆ ప్రాంతంలోని ఫోన్ నంబర్లకు సంక్షిప్త సందేశాలను (SMS) పంపిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ టెక్నాలజీని ఉపయోగించడం ఇదే మొదటిసారి.
ఒకేసారి 5 లక్షల మందికి హైడ్రా సిబ్బంది SMSలు పంపిస్తున్నట్లు హైడ్రా అధికారులు చెబుతున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ‘సచేత్ యాప్’ వినియోగదారుల సెల్ నంబర్లకు కూడా హైడ్రా వాతావరణ సమాచారాన్ని చేరవేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వరకు ఉన్న మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు కూడా వర్ష సూచనను అందిస్తున్నారు. ఈ ముందస్తు సమాచారం ద్వారా సంబంధిత ప్రాంతాల్లోని వర్షాకాల అత్యవసర బృందాలు అప్రమత్తమై, రోడ్లపై నీరు నిలవకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్నాయి.
హైడ్రా కృషి వల్ల హైదరాబాద్(Hyderabad) ప్రజలు ఇకపై వర్షం గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కేవలం రెండు గంటల ముందే అలర్ట్ అయి తమ పనులను తగిన విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ సమయాన్ని 3 గంటలకు పెంచేందుకు హైడ్రా కృషి చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
వర్షాలు, విపత్తుల సమయంలో నగరవాసులు సంప్రదించాల్సిన హైడ్రా కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు:90001 13667, 87124 06901, 040 2955 5500 అలాగే జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ నంబరు:040 2111 1111ను సేవ్ చేసుకుని అత్యవసర సహాయం కోసం కాల్ చేయమని అధికారులు కోరుతున్నారు.
కాగా వాతావరణ కేంద్రం వెల్లడించిన ప్రకారం, తెలంగాణలో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. దీంతో పలు జిల్లాలకు ‘ఆరెంజ్’ అలర్ట్ జారీ చేయబడింది. మంగళవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ, మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. బుధవారం మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ, మిగిలిన జిల్లాల్లో భారీగా వర్షాలు పడనున్నాయి.