Lalita Parayanam
భారతదేశంలోని పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రాల్లో.. తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో వెలసిన మేఘనాథ స్వామి , లలితాంబికా దేవి ఆలయం అత్యంత విశిష్టమైనదిగా పురాణాలలో చెబుతారు. ఈ క్షేత్రానికి ఉన్న మరో ప్రధాన గుర్తింపు ఏంటంటే, విశ్వవ్యాప్తమైన లలితా సహస్రనామ స్తోత్రం ఇక్కడే ఉద్భవించింది.
పురాణ గాథల ప్రకారం, భండాసురుడనే రాక్షసుడిని చంపిన తర్వాత అమ్మవారు అత్యంత ఉగ్ర రూపంలో ఉండేవారట. అయితే పరమశివుడి సూచనతో లలితాంబికా దేవి ఈ ఆలయానికి చేరుకుని.. ఇక్కడ తపస్సు చేసి శాంత స్వరూపిణిగా వెలిశారట. ఆ సమయంలోనే వాగ్దేవతలంతా కలిసి అమ్మవారిని మనసారా స్తుతిస్తూ మొట్టమొదటిసారిగా లలితా సహస్రనామాలను పఠించారని పురాణాలు చెబుతాయి.
అలా శ్రీచక్రంపై ఆసీనురాలై ఉండే లలితాంబికా అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మనసులోని కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. అంతే కాకుండా, దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా తొలగిపోతాయని కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం చోళ రాజుల కాలంలో నిర్మించబడిందని చరిత్ర చెబుతుంది. ఇక్కడ పరమశివుడు మేఘనాథ స్వామిగా కొలువై ఉంటాడు. అలాగే అమ్మవారు లలితాంబికగా భక్తులను కటాక్షిస్తున్నారు.
సూర్య భగవానుడు ఈ ప్రాంతంలో తపస్సు చేసి.. తను కోల్పోయిన తేజస్సును తిరిగి పొందాడని స్థల పురాణం చెబుతోంది. దీనికి నిదర్శనంగా ప్రతి ఏడాది ఏప్రిల్ మాసంలో సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలను తాకే ఒక అద్భుత దృశ్యం ఆవిర్భవిస్తుంది.
అంతేకాకుండా ఇక్కడి లలితాంబవారిని సౌందర్య నాయకిగా కూడా పిలుస్తారు. ఎనిమిది చేతులతో ఉండి చేతిలో చిలుకను ధరించిన శుక బ్రహ్మ దుర్గను దర్శించుకుంటే ఎలాంటివారికి అయినా జ్ఞానం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు.
అయితే లలితా పారాయణం(Lalita Parayanam) చదివినపుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడైనా లలితా సహస్రనామాలు పఠించేటప్పుడు…గర్భగుడి బయట ఉండే శ్రీచక్ర స్తంభం వద్ద కూర్చుని ఒక్కసారి పఠించినా చాలట. ఎందుకంటే అది కోటి సార్లు పఠించిన ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెబుతుంటారు.
హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఈ స్తోత్ర రహస్యాలను మేఘనాథ స్వామి , లలితాంబికా దేవి ఆలయంలోనే ఉపదేశించారని కూడా ప్రతీతి. అందుకే ఆధ్యాత్మిక శాంతిని కోరుకునే వారితో పాటు, లలితా పారాయణం(Lalita Parayanam) చేసేవారు కూడా తమ జీవితంలో కనీసం ఒక్కసారైనాఈ దివ్య క్షేత్రాన్ని దర్శించుకోవాలని చెబుతారు.
