AI: ఏఐతో మెదడు మొద్దుబారుతోందా? టెక్నాలజీ మాయలో మనం తెలివితేటలు కోల్పోతున్నామా?

AI:ఏఐ మనల్ని నిజంగా తెలివైన వారిని చేస్తోందా? లేక మన మెదడుకు పని లేకుండా చేసి మొద్దుబారేలా చేస్తోందా?

AI

ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మన అందరి లైఫ్‌లో ఒక భాగమైపోయింది. ఏదైనా తెలీకపోతే పుస్తకాలు తిరగేయడం, పది మందిని అడగడం ఇప్పుడు పాత పద్ధతి.ఇప్పుడు చేతిలో ఫోన్ ఉంటే చాలు, ఏఐ నుంచి సెకన్లలో సమాధానం వచ్చేస్తోంది. అయితే, ఇది మనల్ని నిజంగా తెలివైన వారిని చేస్తోందా? లేక మన మెదడుకు పని లేకుండా చేసి మొద్దుబారేలా చేస్తోందా? అనే ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

ఒకప్పుడు ఏదైనా విషయం నేర్చుకోవాలంటే గంటలు గంటలు రీసెర్చ్ చేయాల్సి వచ్చేది. లైబ్రరీకి వెళ్లడం, డిఫరెంట్ కోణాల్లో దాని గురించి ఆలోచించడం వల్ల మనలో ‘క్రిటికల్ థింకింగ్’ (విశ్లేషణాత్మక ఆలోచన) పెరిగేది. కానీ ఇప్పుడు చాట్ జీపీటీ (ChatGPT),జెమినీ ఏఐ, పెర్‌ప్లెక్పిటీ వంటి టూల్స్ వల్ల మనం ప్రశ్నించడం కంటే, రెడీమేడ్ ఆన్సర్ల మీద, క్విక్ రెస్పాన్స్ మీద ఆధారపడుతున్నాం. దీనివల్ల మన మెదడు మెల్లగా ఆలోచించే శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు హోం వర్క్ కోసం, ఎస్సేలు రాయడం కోసం కూడా ఏఐ(AI)ని ఎక్కువగా వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల వాళ్ళు పనిని వేగంగా పూర్తి చేస్తున్నారే తప్ప, ఆ సబ్జెక్టును లోతుగా అర్థం చేసుకోవడం మానేస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏఐని ఒక ట్యూటర్ లాగా వాడుకుంటే పర్లేదు, కానీ అదే హోం వర్క్ చేసేయాలనుకోవడం వల్ల పిల్లల్లో క్రియేటివిటీ చనిపోతోందని చెబుతున్నారు.

అంతేకాదు..ఏఐ అప్పుడప్పుడు తప్పుడు సమాధానాలు కూడా ఇస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు తప్పు అని తెలిసిన విషయాన్ని ఏఐని అది రైట్ కదా అంటే అవును అది రైట్ అంటుంది. అదేంటి అలా చెబుతున్నావు అది తప్పు కదా అంటే వెంటనే అది కూడా అవునవును అది తప్పే క్షమించు అని సమాధానం చెబుతుంది. దీనిని బట్టి ఏఐని గుడ్డిగా నమ్మకూడదని నిపుణులు అంటున్నారు.

అలాగే కొన్నిసార్లు ఏఐ తనంతట తానుగా తప్పుడు వివరాలను, లేని ఆధారాలను కూడా క్రియేట్ చేస్తుంది. దీనినే AI Hallucinations అంటారు. పెద్ద పెద్ద ఐటీ సంస్థలు కూడా ఏఐ వల్ల జరిగిన తప్పుల కారణంగా బహిరంగంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి కళ్లు మూసుకుని ఏఐని నమ్మడం ప్రమాదకరమే కాదు నష్టాన్ని కూడా తీసుకువస్తుందని తెలుస్తోంది.

AI

మరి ఇదే విషయంపై ఏఐ బోట్స్ (ChatGPT, Grok, Meta AI) అభిప్రాయం అడిగితే.. అవి చాలా తెలివైన సమాధానాలిచ్చాయి. ఏఐ అనేది ఒక సాధనం మాత్రమేనని చెప్పి… అది మిమ్మల్ని తెలివైన వారిని చేస్తుందా లేక మొద్దుబారేలా చేస్తుందా అన్నది మీరు దాన్ని ఎలా వాడుతున్నారనే దానిపై ఆధారపడి ఉంటుందని సున్నితంగా చెప్పాయి. మీరు మీ ఆలోచనా శక్తికి బదులుగా దీన్ని వాడితే ప్రమాదమేనని ఒప్పుకున్నాయి. అదే మీ ఆలోచనలకు మెరుగులు దిద్దుకోవడానికి వాడితే అది మీకు గొప్ప శక్తిగా మారుతుందని అవి పేర్కొన్నాయి.

దీనిని బట్టి అందరూ ఒకటి అర్ధం చేసుకోవాలి. అదేంటంటే ఏఐ అనేది ఒక కత్తి లాంటిది. దాన్ని పండ్లు కోయడానికి వాడతామా లేక వేలు కోసుకోవడానికి వాడతామా అనేది మన చేతుల్లోనే ఉంది. టెక్నాలజీని వాడుకుంటూనే.. మన మెదడుకు ఇచ్చే పనిని మాత్రం ఎక్కడా తగ్గించొద్దు. మనల్ని ఏఐ శాసించే స్థాయికి వెళ్లకుండా మనం ఏఐని శాసించేలా స్థితిలోనే ఉండాలి. .

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version