Sri Krishna Idol
మన భారతీయ సంప్రదాయంలో శ్రీకృష్ణుడు అంటే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. కొంతమందికి కన్నయ్య వెన్నదొంగ అయితే మరికొంతమందికి ప్రేమ తత్వానికి ప్రతీక అయిన మురళీధరుడు, ఇంకొంతమందికి భగవద్గీతను అందించిన జగద్గురువు. అందుకే చాలా మంది ఇంట్లో చిన్ని కృష్ణుడు ఏదో ఫోటో రూపంలోనో లేక చిన్న విగ్రహం రూపంలోనే ఉంటాడు. అయితే చాలామందికి అసలు కృష్ణుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఎలాంటి నిబంధనలు ఫాలో అవ్వాలనే అనుమానం ఉంటుంది.
అయితే కృష్ణయ్య విగ్రహాన్ని నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఏ ఇంట్లో అయినా కృష్ణుడి విగ్రహం ఉంటే ఆ ఇల్లెప్పుడూ ఆనందం, శాంతితో నిండిపోతుంది. కాకపోతే, ఆధ్యాత్మికంగా కూడా అదృష్టం కలిసి రావాలి అన్నా, పాజిటివ్ ఎనర్జీ రావాలి అన్నా కొన్ని చిన్న చిన్న విషయాలను కచ్చితంగా పాటించాలని అంటున్నారు.
కృష్ణుడి విగ్రహాన్ని ఉత్తర-తూర్పు మూల అయిన ఈశాన్యంలో పెట్టడం అనేది చాలా ముఖ్యమయినది. పూజ గదిలో అయినా లేదంటే ఇంట్లో ఈశాన్య దిశలో అయినా కృష్ణుడి విగ్రహాన్ని ఉంచడం వల్ల దైవకళ ఉట్టిపడటమే కాకుండా మంచి జరుగుతుంది. ఒకవేళ అది కుదరకపోతే తూర్పు(East ) లేదా ఉత్తర దిశ(North direction)లో పెట్టడం మంచిది.
ఎలాంటి విగ్రహం ఇంట్లో ఉంటే మంచిదనే దానికి న్యూమరాలజీ, అండ్ వాస్తు పరంగా ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉందని నిపుణులు అంటున్నారు. సంతానం కోసం ఎదురుచూసేవారు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్లు.. వెన్న కుండతో ఉండే చిన్న బాలకృష్ణుడి విగ్రహం పెట్టడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది.
భార్యాభర్తల మధ్య అనురాగం పెరగడానికి, ఇంట్లో ప్రేమ వాతావరణం ఉండడానికి రాధాకృష్ణుల విగ్రహం, వేణువు ఊదే మురళీ కృష్ణుడి విగ్రహం వంటివి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి.
కానీ కృష్ణుడు కాళీయుడి పాముపై నాట్యం చేస్తున్నట్లు ఉండే ఆగ్రహ రూపాలు అలాగే మహాభారత యుద్ధరంగంలో రథంపై ఉన్న ఫోటోలను ఇంట్లో పెట్టకూడదు. కేవలం ప్రశాంతమైన మురళీధర రూపాలనే ఎంచుకుంటే ఆ ఇంటికి మంచిది.
ఇంట్లో కృష్ణుడి విగ్రహం పెట్టుకున్న తర్వాత మంచి ఫలితాలు రావాలంటే రోజూ ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రశాంతంగా దీపారాధన చేయాలి. కృష్ణుడికి తులసి దళాలంటే ప్రాణం. కాబట్టి రోజూ పూజలో కొన్ని తులసి ఆకులను సమర్పిస్తే చాలు ఆ ఇంట అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. అలాగే వెన్న కానీ, పాలు కానీ ఇవేమీ లేకపోతే మిస్రీ (కండ చక్కెర) నైవేద్యంగా పెడితే ఆ ఇంట ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.
కన్నయ్య విగ్రహం చుట్టూ ఉన్న పరిసరాలను ఎప్పుడూ క్లీన్గా, ప్రశాంతంగా ఉంచాలి. కృష్ణుడి విగ్రహం అంటే కేవలం ఒక అలంకార వస్తువు కాదని.. అది మీ ఇంటికి పాజిటివ్ వైబ్రేషన్స్ తెచ్చే ఒక శక్తి కేంద్రం అని గుర్తు పెట్టుకోండి. ఈ చిన్న నియమాలు పాటిస్తూ ఆ నల్లనయ్యను ప్రతీరోజూ కొలిస్తే మీ ఇంట సంతోషం, ప్రశాంతత వెల్లివిరుస్తాయి.
