Blood Relation : రక్త సంబంధీకులు దూరమవుతున్నారు..బయటివాళ్లే మనవాళ్లలా మారుతున్నారు..

Blood Relation : రక్త సంబంధీకులు ఎందుకు దూరమవుతున్నారు, రక్త సంబంధం లేని వాళ్లు మనసును అర్థం చేసుకుని వాళ్లే నిజమైన ఆప్తులుగా మనసుకు దగ్గరవుతున్నారు. అసూయ, స్వార్థం, ఆత్మగౌరవం మధ్య దాగున్న నిజాల గురించి సైకాలజిస్టులు ఏమంటున్నారు?

Blood Relation

మనిషి లైఫ్‌లో కొన్ని బంధాలు పుట్టుకతోనే కలిసి వస్తాయి, మరికొన్ని జీవిత ప్రయాణంలో నడిచేటప్పుడు పరిచయమవుతాయి. అయితే పుట్టుకతో వచ్చే రిలేషన్స్ కంటే, మనసుతో కనెక్ట్ అయ్యే బంధాలు ఎందుకు అంత బలంగా మారుతాయో ఆలోచిస్తే చాలా విషయాలు అర్థమవుతాయని సైకాలజిస్టులు చెబుతున్నారు.

ఎప్పుడైనా సరే మనం బాధలో ఉన్నప్పుడు తోడుగా ఉండే మనిషి బయటివారైనా కూడా మనవాళ్లలా అనిపిస్తారు. అదే సమయంలో, ఒకే ఇంట్లో పెరిగి ఒకే బ్లడ్ పంచుకున్నవాళ్లు మాత్రం మన కష్టాలను పట్టించుకోకపోగా, మన ఎదుగుదలను చూసి తట్టుకోలేక పరాయివాళ్లలా, కొన్నిసార్లు శత్రువుల్లా కూడా ప్రవర్తిస్తుంటారు.

నిజానికి ఒకే ఇంట్లో కలిసి పుట్టినంత(Blood Relation) మాత్రాన అందరి ఆలోచనలు, ఒపీనియన్స్, అంచనాలు ఒకేలా ఉండవు. ప్రతీ మనిషిలో కూడా తనదైన ఆశలు, భయాలు, ఇన్‌ఫిరియారిటీ కాంప్లెక్స్‌ ఇలా చాలా ఉంటాయి. కుటుంబంలో డబ్బు, ఆస్తి, హోదా, గుర్తింపు వంటి అంశాలేమైనా తెర మీదకు వచ్చినప్పుడు ప్రేమ ప్లేస్‌లో పోటీ చేరుతుంది.

ఒకరి హ్యాపీనెస్ వేరొకరికి మింగుడుపడని విషయంగా మారుతుంది. తనతోడబుట్టిన వాళ్లు ముందుకెళ్తుండటం చూసి లోలోపల కుమిలిపోయే మైండ్ సెట్ పెరిగినప్పుడు, చిన్న చిన్న మాటలను పెద్ద అగాధాలుగా మార్చేస్తారు. నిన్నటివరకు నవ్వుతూ మాట్లాడిన వాళ్లే, సిచ్యువేషన్ మారగానే ఎడమొహం పెడమొహంగా మారిపోయే సీన్లు ఎన్నో ఇళ్లలో కనిపిస్తాయి.

ఇలాంటి బంధాలు కేవలం అవసరాల చుట్టూ అల్లుకుని ఉంటాయి. మన చేతిలో మనీ ఉన్నప్పుడు, మన మాట చెల్లుబాటు అయ్యే స్థితిలో ఉన్నప్పుడు, మన వల్ల ఏదైనా ప్రయోజనం ఉంది అనుకున్నప్పుడు చూపించే ఆప్యాయత నిజమైనది కాదు. ఎప్పుడైతే మనకు కష్టాలెదురవుతాయో, మన పరిస్థితి దిగజారుతుందో, అప్పుడే అసలు రంగు బయటపడుతుంది.

పరిస్థితులు బాగోలేక చేయి జారిపోయిన టైమ్‌లో దూరంగా వెళ్లిపోయే బంధాల మధ్య, ఏ బాండ్‌ లేని ఒక వ్యక్తి నిశ్శబ్దంగా వచ్చి భుజం తట్టడం ఎంతో ఓదార్పునిస్తుంది. మనం ఓడిపోయినప్పుడు ధైర్యం చెప్పేవాడు, మన బాధను తీర్పులు లేకుండా వినేవాడు నిజమైన ఆప్తుడు అవుతాడు. ఆ క్షణంలో బ్లడ్ రిలేషన్ కంటే ఆత్మీయతే గొప్పదనిపిస్తుంది.

రిలేషన్‌ను లోలోపల తినేసే అసూయ అనేది కంటికి కనిపించని శత్రువు వంటిది. మనకు తెలీకుండానే మన విజయాన్ని కొంతమంది దానిని వారి ఓటమిగా లెక్కలేసుకుంటారు. మనం మంచి జాబ్ సాధించినా, ఆర్థికంగా నిలదొక్కుకున్నా, సొసైటీలో గౌరవం పొందినా సంతోషించలేని స్టేజ్‌లో మన మనుషులే ఉంటారు.

కాకపోతే ఇలా మన దగ్గర ఎక్కడ తప్పు జరుగుతుందా అని వెయిట్ చూస్తూ, తప్పు దొరికినప్పుడు ఆనందించే ప్రవర్తన మన గుండెను బరువెక్కిస్తుంది. ఆ మాటలు లేదా ఆ చూపులు ఎక్కడో ఉన్న పరాయివారి నుంచి వస్తే పెద్దగా పట్టించుకోం కానీ, సొంతవాళ్ల నుంచి వచ్చినప్పుడు మాత్రం ఆ పెయిన్ చాలా లోతుగా తగులుతుంది.

మన చుట్టూ ఉన్నవారంతా మనల్ని అర్థం చేసుకుంటారని ఆశించడం ముందు మనం చేసే పెద్ద తప్పు అని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే కొంతమంది జీవితాంతం మన పక్కనే ఉన్నా మన మౌనాన్ని చదవలేరు. మరికొంతమంది కొద్దిరోజులు పరిచయంలోనే మన కళ్లలోని బాధను ఇట్టే గుర్తిస్తారు. నిజమైన అనుబంధానికి ఏజ్, స్టేటస్, పరిచయ కాలంతో పనిలేదు. పరస్పర గౌరవంతో పాటు నమ్మకం, నిజాయితీ, కష్టంలో తోడుగా నిలబడే మనిషి ఉంటే చాలు, ఆ బంధం ఎప్పటికీ నిలుస్తుంది.

సొంతవాళ్లతో దూరం పెరిగినప్పుడు ప్రతిసారీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పదేపదే అవమానిస్తూ, మన వ్యాల్యూని తగ్గించేలా ప్రవర్తించే వారిని భరించడం ప్రేమ అసలు కాదు. మన మనసులోని మాటను క్లియర్‌గా చెప్పినా.. అర్థం చేసుకోని వారితో అనవసరమైన వాదనలు కూడా అనవసరం.

మీ తోడబుట్టిన వారితోనో లేదంటే దగ్గర బంధువులతో వీలైనంత వరకు ప్రశాంతంగా మాట్లాడి గ్యాప్ రాకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలి. అయినా సరే వారిలో ఛేంజ్ రాకపోతే, మన మనశ్శాంతి కోసం కొంత డిస్టెన్స్ పాటించడం తప్పు కాదు. అదే టైమ్‌లో మన కష్టంలో నిలబడిన వారికి, మనల్ని నిజంగా అర్థం చేసుకున్న వారికి జీవితాంతం వ్యాల్యూ ఇవ్వాలి.

చివరగా గుర్తుంచుకోవాల్సిన నిజం ఒక్కటే. మన చుట్టూ ఎంతోమంది ఉండొచ్చు, కానీ మన మనసును అర్థం చేసుకునే ఆప్తులు మాత్రం కొంతమందే ఉంటారు. రక్త సంబంధం(Blood Relation) మనకు ఒక ఫ్యామిలీని ఇస్తుంది, కానీ ప్రేమ, నమ్మకం, గౌరవం మాత్రమే నిజమైన బాండ్‌ను నిలబెడతాయి. మన లైఫ్‌లో ఎవరెంతకాలం ఉన్నారన్నది కాదు, మన కష్టకాలంలో ఎవరు మన పక్కన నిలబడ్డారన్నదే అసలు లెక్క. బంధం రక్తంతో ఏర్పడొచ్చు కానీ, అనుబంధం మాత్రం మనసుతోనే నిలబడుతుందనేది మర్చిపోకూడదు.

Revanth Reddy Love Story : రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ.. ఢిల్లీకి వెళ్లి మరీ పెళ్లికి ఒప్పించిన రేవంత్ రెడ్డి..

↑
Exit mobile version