Dehydrate: బాడీ డీహైడ్రేట్ అవుతోందా? అలర్ట్‌గా లేకపోతే ప్రాణాలకే ముప్పంట

Dehydrate : మన బాడీ తన సాధారణ పనులను చేయడానికి తగినంత ద్రవాలు లేని పరిస్థితినే డీహైడ్రేషన్ అంటారు.

Dehydrate

మన బాడీ సజావుగా పని చేయాలంటే.. ఆహారం కంటే నీరు చాలా ముఖ్యం. ఎందుకంటే మన బాడీలో సుమారు 78 శాతం నీరే ఉంటుంది. బాడీ టెంపరేచర్‌ను క్రమబద్ధీకరించడం నుంచి తిన్న ఆహారం జీర్ణమవ్వడం వరకు, రక్తం ప్రవహించడం నుంచి విషపదార్థాలు బయటకు వెళ్లడం వరకు ప్రతి పనిలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది.

ప్రస్తుతం ఎండాకాలం కావడంతో మన శరీరం నుంచి చెమట రూపంలో నీరు చాలా ఎక్కువగా బయటకు వెళ్లిపోతుంటుంది. ఇలా కోల్పోయిన నీటిని తిరిగి మనం మళ్లీ అందించకపోతే మన బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. మన బాడీ తన సాధారణ పనులను చేయడానికి తగినంత ద్రవాలు లేని పరిస్థితినే డీహైడ్రేషన్ (Dehydrate)అంటారు.

ఇది ఎవరికైనా రావొచ్చు కానీ చిన్నపిల్లలు, వృద్ధుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో విరోచనాలు, వాంతులు అయినప్పుడు శరీరంలో చాలా వేగంగా నీరు బయటకు పోతుంది. అలాగే వృద్ధుల శరీరంలో నేచురల్‌గానే నీటి నిల్వలు తక్కువగా ఉంటాయి. దీని వల్ల వారు త్వరగా అనారోగ్యానికి గురవుతుంటారు.

అయితే శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు వారిలో కనిపించే లక్షణాలు వారి వయసును బట్టి మారుతుంటాయట. చిన్నపిల్లల్లో అయితే నాలుక, పెదాలు పొడిబారిపోవడం, ఏడుస్తున్నప్పుడు కళ్లలో నుంచి కన్నీళ్లు రాకపోవడం, చర్మంపై ముడతలు పడటం వంటివి గమనించొచ్చు. అంతేకాదు శ్వాస వేగంగా తీసుకోవడం, కాళ్లు చేతులు చల్లగా మారిపోవడం వంటివి కూడా డీహైడ్రేషన్‌కు సంకేతాలే.

అదే పెద్దవారిలో అయితే విపరీతమై దాహం, తలనొప్పి, మతిమరుపు, గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. బాడీ డీహైడ్రేట్(Dehydrate) అయినప్పుడు గుండె వేగం పెరగడం, రక్తపోటు తగ్గిపోవడం, విపరీతమైన అలసట , బలహీనత ఆవరిస్తాయి. కొంతమందికి ఆకలి లేకపోవడం, స్వీట్లు తినాలనిపించడం, మూత్రం ముదురు రంగులో రావడం వంటి లక్షణాలు కూడా జరుగుతుంటాయి.

నిజానికి మంచినీళ్లు తాగడం చాలా రోగాలకు ఔషధం అన్నట్లుగానే .. డీ హైడ్రేషన్‌కు కూడా మంచినీళ్లే మందు అని తెలుసుకోవాలి. అయితే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మాత్రం వెంటనే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తగినన్ని లిక్విడ్స్ తీసుకోవాలి. ముఖ్యంగా మంచి నీళ్లు, కొబ్బరి నీళ్లు లేదా ఓఆర్ఎస్ వంటివి తాగడం వల్ల బాడీ మళ్లీ హైడ్రేట్ అవుతుంది.

అలాగే పిల్లలను ఈ ప్రమాదం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలు ఆడుకోవడానికో, స్కూలుకో , లేదా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్ క్యారీ చేసేలా అలవాటు చేయాలి. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పిల్లలను బయటకు పంపించకపోవడమే మంచిది.

Dehydrate

పిల్లల ఆహారంలో పుచ్చకాయ, దోసకాయ, నారింజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను చేర్చడం అలవాటు చేసుకోవాలి. అలాగే వేసవిలో లూజుగా ఉండే లేత రంగు కాటన్ దుస్తులు వేయడం వల్ల శరీరానికి గాలి తగిలి చెమట పట్టడం తగ్గుతుంది.

ఒకవేళ డీ హైడ్రేట్ లక్షణాలు 24 గంటల కంటే ఎక్కువగా ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలి. అలాగే మలంలో రక్తం కనిపిస్తున్నా, 102 డిగ్రీల కంటే ఎక్కువ జ్వరం ఉన్నా అస్సలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. తీవ్రమైన డీహైడ్రేషన్ ప్రాణాంతకం కావొచ్చు కాబట్టి ఎప్పటికప్పుడు నీటిని తాగిస్తూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడమే ఉత్తమమైన మార్గం అని తెలుసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version