Child Psychology
చిన్నారుల పెంపకంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. దీనికోసం డాక్టర్ల సూచనలతో పాటు పెద్దల మాటలను పాటిస్తూ ఉంటారు. అయితే 18 నెలలలోపు చిన్న పిల్లలకు అద్దం చూపించకూడదని, అలా చూపిస్తే వారికి మాటలు త్వరగా రావు అని చాలామంది పేరెంట్స్ నమ్ముతుంటారు. అసలు ఈ నమ్మకంలో నిజం ఉందా అనే దానిపై చాలామందికి చాలా అపోహలుంటాయి.
చైల్డ్ సైకాలజీ(Child Psychology) చెబుతున్నదాని ప్రకారం, చిన్న పిల్లలు తమను తాము గుర్తించుకునే తెలివి తేటలను తమకు తామే మెల్లగా పెంచుకుంటారు. అలాగే ఒకటిన్నర సంవత్సరం అంటే 18 నెలల వయస్సు వచ్చేంతవరకు కూడా అద్దంలో కనిపిస్తున్న రూపాన్ని వారు తమ సొంత ప్రతిబింబమే అని అనుకోలేరు. అద్దంలో ఎవరో కొత్త బాబు లేదా పాప ఉన్నారేమోనని ఆశ్చర్యంగా చూస్తారు. కొంతమంది పిల్లలు అద్దాన్ని చూసి సరదాగా నవ్వేస్తే, మరికొంతమంది చిన్నారులు మాత్రం కొత్తగా అనిపించి కాస్త గందరగోళానికి గురవుతుంటారు.
అంతే తప్ప అద్దం చూపించడం వల్ల పిల్లల ఎదుగుదల దెబ్బతింటుందని,వారికి మాటలు రావడం ఆలస్యమవుతుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని సైకాలజీ(Child Psychology) చెబుతోంది. నిజానికి పిల్లలకు అద్దం చూపించడం వల్ల ఎలాంటి హాని కూడా జరగదు. ఇప్పుడంటే డ్రస్సింగ్ టేబుల్స్, లాంగ్ వ్యూ మిర్రర్స్ వచ్చాయి .
కానీ కొంత కాలం క్రితం వరకూ అందరి ఇళ్లల్లో ఎక్కువగా చేతితో పట్టుకునే చిన్న అద్దాలో,గోడకు తగిలించుకునే మీడియం సైజ్ అద్దాలో ఉండేవి. చిన్న పిల్లలు ఈ అద్దాల దగ్గర ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పగిలి వారికి గాయాలు అవుతాయని ముందుగానే ఒక నమ్మకాన్ని అడ్డు పెట్టి మిర్రర్స్‌కు దూరంగా ఉంచేవారు మన పెద్దలు.
అందుకే చిన్నపిల్లల చేతికి గాజు అద్దాలు ఇస్తే పగిలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, ప్లే స్కూల్స్‌లో వాడే సేఫ్టీ మిర్రర్స్ ఉపయోగిస్తే మంచిది.పిల్లలు అద్దాన్ని ఎక్కువ సమయం చూస్తూ ఉండిపోయే అవకాశం ఉంది కాబట్టి అలా కాకుండా.. చుట్టుపక్కల వాతావరణాన్ని, మనుషులను కూడా గమనించేలా వారిని ఆడిస్తూ ఉండాలి. ఇది చిన్నారుల మానసిక వికాసానికి ఎంతో ఉపయోగపడుతుంది.
మరోవైపు హిందూ సాంప్రదాయాలలో కూడా పసిపిల్లలకు అద్దం చూపించడంపై కొన్ని నిబంధనలున్నాయి. అద్దంలో తమ రూపాన్ని తామే చూసుకోవడం వల్ల పిల్లల సున్నితమైన మనసుపై తెలీని ఒక చెడు ప్రభావం పడుతుందని, అలాగే దిష్టి కూడా తగులుతుందని పెద్దలు చెబుతుంటారు. అయితే ఇవి కేవలం తరతరాలుగా వస్తున్న నమ్మకాలు మాత్రమే కానీ, వీటికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు.
తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల కోసం వారితో ఎక్కువ సమయం గడపడం, మాట్లాడటం, ప్రకృతిని చూపించడం వంటివి చేయాలి. అద్దం చూపించడం వల్ల తమ పిల్లలకు నష్టం జరుగుతుందని కంగారు పడాల్సిన పనేమీ లేదు.
Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్ తింటున్నారా?..ఈ 5 రకాల ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్త..
