love Bombing
మీ పార్టనర్ మిమ్మల్నిచాలా అంటే చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారా? ఊపిరి ఆడనంతగా ఎప్పుడూ మీపై ప్రేమను కురిపిస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగి ఆలోచించాల్సిందే అంటున్నారు సైకాలజస్టులు. ఎందుకంటే అది స్వచ్ఛమైన ప్రేమేనా లేక మిమ్మల్ని పూర్తిగా తన కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి వేసిన లవ్ బాంబింగ్(love Bombing )అనే సైకలాజికల్ ట్రాపా? అని తెలుసుకోవాలని అంటున్నారు.
మొదట్లో ఊహించని విధంగా విపరీతమైన ప్రేమను కురిపించి.. ఆ తర్వాత అదే వ్యక్తిని తన గుప్పిట్లో పెట్టుకోవడమే ఈ ట్రిక్ అసలు ఉద్దేశం అట. ఇప్పుడు యువతలో చాలా మంది దీనిని అపారమైన ప్రేమ అనుకుంటారు. కానీ తర్వాత తర్వాత ఇది ఒక మానసిక దాడి అని మెల్లగా అర్థమవుతుంది.
సాధారణంగా ఏదైనా బంధం నెమ్మదిగానే మొదలవుతుంది. కానీ లవ్ బాంబింగ్‌లో మాత్రం అలా కాదు.. అంతా మెరుపు వేగంతో జరిగిపోతుంది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే నా ప్రపంచం అంటూ గాలిలో తేలిపోయేలా చేస్తారు. ఖరీదైన గిఫ్టులు ఇవ్వడం, ఎక్కువ సార్లు కలవడానికి ఇంట్రస్ట్ చూపించడం, కంటిన్యూగా ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో మిమ్మల్ని ముంచెత్తడం వంటివి చేస్తారు.
అంతేకాదు మీ లోపాలను కూడా అద్భుతాలు అంటూ పొగుడుతూ, మిమ్మల్ని ఒక రకమైన మత్తులో ముంచేస్తారు. అయితే ఈ అతి ప్రేమ వెనుక అసలు కథ వేరే ఉంటుందని అంటున్నారు సైకాలజిస్టులు. ఎప్పుడైతే మీరు పూర్తిగా వారిపై ఆధారపడటం మొదలుపెడతారో, అప్పుడే వారి అసలు స్వరూపం బయటపడుతుంది.
ఒక్కసారి మీరు పూర్తిగా వారి మాయలో పడ్డారని అర్ధం అయ్యాక.. నెమ్మదిగా మిమ్మల్ని కంట్రోల్ చేయడం మొదలుపెడతారు. మీ స్నేహితులతో మాట్లాడుతున్నా, చివరకు ఇంట్లో వారితో సమయం గడిపినా వారికి నచ్చదు. నా కంటే నీకు వాళ్లే ఎక్కువయ్యారా? అంటూ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తారు.
మీరు ఏ పని చేసినా వారి పర్మిషన్ తీసుకోవాలని చెప్పే రేంజ్‌కు మీ బంధాన్ని తీసుకెళ్తారు. ఒకప్పుడు ప్రతీరోజూ అంతులేని ప్రేమను చూపించిన అదే వ్యక్తి, ఆ తర్వాత చిన్నచిన్న విషయాలకి కూడా మిమ్మల్ని మానసిక వేదనకు గురి చేస్తుంటారు. మీరు ఆశ్చర్యపోయేంతగా ఆ మార్పు ఉంటుంది. దీంతో మళ్లీ పాత రోజులు వస్తాయేమో అని ఎదురుచూస్తూ ఆ నరకంలోనే ఉండిపోయే పరిస్థితికి చేరుకుంటారు.
అయితే నిజమైన ప్రేమ ఎప్పుడూ స్వేచ్ఛను ఇస్తుంది. కానీ లవ్ బాంబింగ్(love Bombing )మాత్రం మీ వ్యక్తిత్వాన్ని చంపేస్తుంది. బంధం మొదట్లో ఏ మాత్రం అతిగా అనిపించినా, మీ ప్రైవసీని గౌరవించకపోయినా వెంటనే తేరుకోండి. ఎదుటివారు చూపించేది ప్రేమో లేక ఆధిపత్యమో గుర్తించలేకపోతే, జీవితాంతం అవతలి వారి కంట్రోల్‌లోనే ఉండిపోవాల్సి వస్తుంది.
