Foreign Tour
చాలా మందికి ఫారెన్ ట్రిప్(Foreign Tour) అనేది ఒక డ్రీమ్. అయితే విమాన టికెట్లు, వీసా ఖర్చులు చూసి భయపడి ఇష్టాన్ని చంపుకొని వెనకడుగు వేస్తుంటారు. కానీ సరైన ప్లాన్ ఉంటే భారత దేశంలోని కొన్ని పర్యాటక ప్రాంతాలకు అయ్యే ఖర్చు ఎంత అవుతుందో అంతే ఖర్చుతో.. అందమైన విదేశాలను ఎంచక్కా చుట్టేసి రావచ్చు.
అలాంటి దేశాల్లో మొదటిది వియత్నాం. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, రుచికరమైన స్ట్రీట్ ఫుడ్,చౌకైన ట్రాన్స్‌ఫోర్ట్ సిస్టంకు వియత్నాం పెట్టింది పేరు. ఇక్కడ ఇండియన్ కరెన్సీకి చాలా మంచి విలువ ఉంటుంది కాబట్టి, బస, భోజన ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా హా లాంగ్ బే, హో చి మిన్ సిటీ వంటి ప్రాంతాలకు అసలు మిస్ అవకుండా వెళ్లొచ్చు. ముందే టికెట్లు బుక్ చేసుకుంటే లక్ష రూపాయలలోపే ఈ దేశాన్ని హాయిగా చూసేసి రావొచ్చు.
ఇక బడ్జెట్ ఫ్రెండ్లీ దేశంగా రెండవ ఆప్షన్ థాయిలాండ్. భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ లేదా వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉండటం వల్ల ఇక్కడికి వెళ్లడం చాలా ఈజీ. బ్యాంకాక్‌లోని షాపింగ్ సెంటర్లు, ఫుకెట్‌లోని అందమైన బీచ్‌లు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. బడ్జెట్ హోటళ్లు , హాస్టళ్లు ఇక్కడ పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి.
అలాగే మూడో దేశం ఇండోనేషియాలోని బాలి ద్వీపం కూడా ఇండియన్స్‌కు బెస్ట్ ట్రిప్ అవుతుంది. హనీమూన్ కపుల్స్‌కు అయినా, సోలో ట్రావెలర్స్‌కు అయినా బాలి ఒక స్వర్గధామం అనే చెప్పాలి. ఇక్కడి ఆధ్యాత్మిక దేవాలయాలతో పాటు పచ్చని కాఫీ తోటలు మనసుకి ప్రశాంతతను ఇస్తాయి.
అయితే ఈ మూడు దేశాల్లో ఎక్కడికి వెళ్లాలన్నా సరే.. కనీసం మూడు నెలల ముందే విమాన టికెట్లు బుక్ చేసుకోవడం అన్నదే ఇంపార్టెంట్. అలాగే స్థానిక కరెన్సీ కంటే ఫోరెక్స్ కార్డులు వాడటం ద్వారా ఎక్సట్రా ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఫారెన్ ట్రిప్(Foreign Tour) అంటే కేవలం ధనవంతులకే కాదు, పక్కా ప్లానింగ్ ఉంటే .. ఎవరైనా సరే ఈ అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకోవచ్చని ఈ మూడు దేశాల ట్రిప్ చెబుతాయి.
