Hesitation:మంచితనమా? మొహమాటమా? ..మారలేని మనస్తత్వాల వెనుక నిజాలేంటి?

Hesitation : తమ పార్టనర్‌కు తాను ముఖ్యం కాదనే ఫీలింగ్ పెరిగి వారి నుంచి శాశ్వతంగా దూరం చేసేలా చేస్తుంది. చివరకు శారీరకంగా ఒకే ఇంట్లో ఉన్నా, భావోద్వేగపరంగా ఒక అపరిచితుడిలా మారిపోయే పరిస్థితి వస్తుంది.

Hesitation

కొంతమంది అందరితో మంచిగా ఉండాలని అనుకుంటారు. అలా అనుకోవడం గొప్ప విషయమే కానీ.. ఆ మంచితనం , మొహమాటం (Hesitation)తన సొంత వారిని తరచూ ఇబ్బంది పెట్టే స్థితికి చేరిందంటే అది ఒక మానసిక వ్యాధి అని గుర్తించాలని మానసిక నిపుణులు అంటున్నారు. బయట ప్రపంచంలో మంచోడనే సర్టిఫికేట్ కోసం ఆరాటపడుతూ.. ఇంట్లో వారిని నిర్లక్ష్యం చేయడం తనను తాను అర్పించుకోడమేనని చెబుతున్నారు.

మంచోడు అనే తాత్కాలిక మత్తు కోసం వారి ఆత్మగౌరవాన్ని, చివరకు కుటుంబ ప్రశాంతతను తాకట్టు పెడుతున్నారు. సైకాలజీ ప్రకారం దీన్ని పీపుల్ ప్లీజింగ్ అంటారు. దీని వెనుక నన్ను ఎవరూ అసహ్యించుకోకూడదు, అంతా తమను ఇష్టపడాలనే ఒక బలహీనమైన భావం దాగి ఉంటుంది.

కొంతమంది ఇంట్లోవారికి ఇష్టం లేకపోయినా ఫ్రెండ్స్ దగ్గర చెప్పలేక మొహమాట(Hesitation)పడుతూ ఉంటారు. వారిని ఎంటర్టైన్ చేయడానికి వారి విలువైన సమయాన్ని కూడా తెలీకుండానే కోల్పోతారు. ఆ సమయంలో వారి మెదడు కూడా ఫ్రెండ్స్ దగ్గర ఇంట్లో వారికంటే కూడా ఎక్కువ సంతోషాన్ని పొందుతుంది. కానీ దాని పరిణామాలు ఆ క్షణం వారికి గుర్తు కూడా రావు. పైగా ఇంట్లోవారు ఏమైనా అంటే ఫ్రెండ్స్‌ను, ఆప్తులను వెనుకేసుకుని వస్తారు. తాము చేసింది అసలు తప్పు కాదు అన్నట్లు వాదిస్తారు.

ఈ అలవాటు వల్ల నెమ్మదిగా ఆ ఇంట్లో ప్రశాంతత కనుమరుగవుతుంది. మీ పార్టనర్‌కు మీపై మెల్లమెల్లగా నమ్మకం పోతుంది. మారతానని మాటిచ్చి తర్వాత ఆ మాటే మర్చిపోయినట్లు ప్రవర్తిస్తున్నారన్న భావన పెరిగిపోతుంది. అంతేకాదు తమ పార్టనర్‌కు తాను ముఖ్యం కాదనే ఫీలింగ్ పెరిగి వారి నుంచి శాశ్వతంగా దూరం చేసేలా చేస్తుంది. చివరకు శారీరకంగా ఒకే ఇంట్లో ఉన్నా, భావోద్వేగపరంగా ఒక అపరిచితుడిలా మారిపోయే పరిస్థితి వస్తుంది.

ఇక్కడే ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అందరినీ సంతోషపెట్టాలని చూసే వ్యక్తిని సొసైటీ ఒక ఉచిత సేవకుడిలా చూస్తుందే తప్ప మనిషిగా గౌరవించదు. నిజానికి గౌరవం అనేది ఎదుటివారు అడిగితే వచ్చేది కాదు, అది మీరు గీసుకునే హద్దుల నుంచే పుడుతుంది. ప్రస్తుతం నాకు కుదరదు, నాకు వేరే పని ఉందని నిర్మొహమాటంగా చెప్పలేనప్పుడు, మీకు తెలీకుండానే మీరు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయినట్లే లెక్క.

Hesitation

దీని నుంచి బయటపడాలంటే ఈ ప్రపంచంలో ఎవరూ కూడా.. ఎవరినీ హండ్రెడ్ పర్సంట్ సంతోషపెట్టలేరనే నిజాన్ని ముందుగా అంగీకరించాలి. సమయం, శక్తి చాలా పరిమితమైనవని గుర్తించాలి. హద్దులు గీసుకోవడమంటే ఎదుటివారిని అవమానించడం అని కాదు, తమను తాము గౌరవించుకోవడం అని తెలుసుకున్నప్పుడే ఆ వ్యక్తిలో మార్పు మొదలవుతుంది.

మొదట్లో కొందరు మీకు దూరమవ్వొచ్చు, కానీ వారే కనుక నిజమైన ఆప్తులు , స్నేహితులు అయితే మెల్లగా మీ విలువను గుర్తిస్తూ వారు మీ హద్దులను కూడా గౌరవించడం మొదలు పెడతారు. అయితే రోజులు గడిచినా మారకపోతే మాత్రం ..చివరకు మీ దగ్గర పేరు, స్నేహితులు, పరిచయాలు అన్నీ ఉంటాయి కానీ, మీ కోసం ప్రేమగా ఎదురుచూసే మనసు మాత్రం ఉండదన్న విషయాన్ని గ్రహించాలి .

Mango Peels : మామిడి తొక్కలతో మెరిసే చర్మం..పార్లర్ అవసరం లేకుండా బ్యూటీ టిప్స్

Exit mobile version