Help :అతి మంచితనం మంచిదేనా? సాయం చేసే చేతికి సంకెళ్లు వేయడం కరెక్టేనా?

Help : స్నేహితులో, బంధువులో కష్టాల్లో ఉన్నారని చెప్పగానే, వారి దగ్గర లేకపోయినా ఎక్కడో చోట అప్పు చేసో, ఇంట్లోని బంగారం తాకట్టు పెట్టో డబ్బు తెచ్చి ఇస్తారు.

Help

లోకంలో స్వార్థం కోసం ఆలోచించే మనుషుల మధ్య కొంతమందిలో అయినా మంచితనం ఉండటం నిజంగా వరమే. అయితే ఆ మంచితనం హద్దులు దాటి అతిమంచితనంగా మారితే మాత్రం అది తిరిగి వారికే శాపంగా మారుతుందనేది తెలుసుకోవాలి.

స్నేహితులో, బంధువులో కష్టాల్లో ఉన్నారని చెప్పగానే, వారి దగ్గర లేకపోయినా ఎక్కడో చోట అప్పు చేసో, ఇంట్లోని బంగారం తాకట్టు పెట్టో డబ్బు తెచ్చి ఇస్తారు. మరి కొందరు అయితే క్రెడిట్ కార్డులు వంటివి ఇచ్చి హెల్ప్(Help) చేస్తారు.

అయితే ఆ క్షణంలో అవతలి వ్యక్తికి వారు దేవుడిలా కనిపిస్తారు. వారు లేకపోతే తమ పని అయ్యేది కాదని, వారి రుణం తీర్చుకోలేనని కన్నీళ్లు పెట్టుకుంటారు . అయితే అదంతా ఆ క్షణం వరకే. అలా అన్న వాళ్లే, తీరా ఇవ్వాల్సిన సమయం వచ్చాక ఆ డబ్బులు తిరిగి ఇవ్వమంటే ముఖం చాటేస్తారు.

సాయం పొందినప్పుడు ఉన్న ఫీలింగ్, తిరిగి ఇచ్చేటప్పుడు మారిపోతుంది. దీంతో చివరకు ఆ అప్పు తీర్చలేక, చేసిన పాపానికి వారే సొంతంగా పర్సనల్ లోన్లు తీసుకునో లేదా మరో చోట అప్పు చేసో తీర్చాల్సిన దుస్థితి వస్తుంది. ఈ సమయంలో మనశ్శాంతిని, పరువును రెండింటినీ కోల్పోతారు చాలామంది. ఇలాంటివారికి సాయం చేశామా అని పశ్చాత్తాప పడతారు.

స్నేహితుడో, బంధువో వచ్చి కన్నీళ్లు పెట్టుకోగానే, వాళ్లింట్లో పరిస్థితి గురించి తెలిసినా ఇదే పని చేస్తుంటారు . ఇది అవతలి వాళ్లకు సాయం చేసినట్లు అయినా..ఇంట్లో వాళ్లకు, చివరకు తనకు తాను ద్రోహం చేసినట్లే లెక్క అవుతుంది. ఎందుకంటే వాళ్లకు సాయం చేసిన పాపానికి మళ్లీ పర్సనల్ లోన్లు తీసుకుని, వడ్డీలు కట్టలేక నానా కష్టాలు పడుతుంటే, ఆ బాధ అతనొక్కడిదే కాదు.. వారిని నమ్ముకున్న భార్యాబిడ్డలది కూడా అవుతుంది. పోనీ ఒక్కసారి మోసపోయాక అయినా బుద్ధి తెచ్చుకుంటారా అంటే, మళ్లీ ఇంకొకరు వచ్చి సెంటిమెంట్ డైలాగులు కొట్టగానే కరిగిపోతారు.

Help

ఎప్పుడయినా సరే ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మీ దగ్గర ఉంటే సాయమో, దానమో ఏదొకటి చేయండి. అది కూడా అపాత్ర దానం అస్సలు చేయకూడదు. ఇంకో విషయం ఏంటంటే అప్పు చేసి మరీ అవతలివారికి సాయం చేయడం వంటి పనులు పొరపాటున కూడా చేయొద్దు.

విలువ లేని మనుషుల కోసం గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని ఎవరి దగ్గరా అస్సలు తాకట్టు పెట్టకూడదు. మొహమాటాన్ని చంపుకుని కఠినంగా ఉండటం నేర్చుకోవాలి. లేదు అని ఒక్క ముక్కలో చెప్పడం వల్ల..అలాంటి పనికిరాని ఒక బంధం దూరమవుతుంది అంటే.. పర్వాలేదు ముందుగానే నో చెప్పేయండి.

ఇక్కడ మరో విషయం గురించి కూడా చెప్పుకోవాలి. ఇచ్చిన వాడు లాస్ అయ్యేది డబ్బులే. కానీ ఒకసారి డబ్బు ఎగ్గొట్టిన వాడు మాత్రం జీవితాంతం ఒకరి నమ్మకాన్ని కోల్పోతాడన్న విషయాన్ని మర్చిపోతున్నాడు. రేపు నిజంగానే మరో పెద్ద అవసరం వస్తే..సాయం చేయడానికి ఏ చేయి ముందుకు రాదన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాడు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version