Banana Lassi
వేసవి కాలంలోనే కాదు ఎప్పుడైనా సరే బాడీకి తక్షణ శక్తిని అందించడానికి లస్సీ అద్భుతంగా పని చేస్తుంది. అయితే దానికి అరటిపండును యాడ్ చేస్తే టేస్ట్‌తో పాటు ప్రోటీన్, పొటాషియం, కాల్షియం, ప్రోబయోటిక్స్ వంటి బోలెడు పోషకాలు దొరుకుతాయి.
ఉదయం టిఫిన్ సమయంలో కానీ, సాయంత్రం వేళ లేదా వర్కవుట్ చేసిన తర్వాత తాగడానికి కానీ ఈ బనానా లస్సీ(Banana Lassi) ఒక పర్ఫెక్ట్ హెల్దీ డ్రింక్ అనే చెప్పొచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా ఈజీ.
దీనికి బాగా పండిన అరటిపండ్లు – 2 , గడ్డ పెరుగు – 1 కప్పు, చల్లటి పాలు అర కప్పు (అవసరమైతే), తేనె లేదా బెల్లం తురుము – 1 నుంచి 2 చెంచాలు, యాలకుల పొడి – చిటికెడు, ఐస్ క్యూబ్స్ – సరిపడా, బాదం, పిస్తా ముక్కలు – అలంకరణ కోసం
ముందుగా అరటిపండ్ల ముక్కలను జార్‌లో వేసి తర్వాత పెరుగు, పాలు, తేనె లేదా బెల్లం, యాలకుల పొడి వేసుకోవాలి. ఇవన్నీ మెత్తగా, క్రీమీగా మారే వరకు గ్రైండ్ చేయాలి. దీనిని చిల్డ్‌గా కావాలనుకుంటే ఐస్ ముక్కలు వేసి మరొకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు దీనిని గ్లాసులో పోసి, పైన బాదం, పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకుని వెంటనే సర్వ్ చేసుకోవాలి.
బనానాలోని నేచురల్ కార్బోహైడ్రేట్లు, కర్డ్‌లోని ప్రోటీన్ కలిసి అలసటను పోగొట్టి తక్షణ శక్తిని ఇస్తాయి. పెరుగులోని ప్రోబయోటిక్స్ ప్రేగుల హెల్త్‌ను కాపాడితే, బనానాలోని పీచు పదార్థం అరుగుదలను పెంచుతుంది.
ఎండ దెబ్బ నుంచి రిలీఫ్ కలిగించి, శరీరాన్ని కూల్‌గా ఉంచేందుకు ఈ లస్సీ బాగా సహాయపడుతుంది. అరటిపండు ద్వారా లభించే పొటాషియం కండరాల నొప్పులను తగ్గించి, బాడీలో నీటి శాతాన్ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుతుంది. అలాగే పెరుగులోని కాల్షియం బోన్స్‌ను బలంగా ఉంచడానికి తోడ్పడుతుంది.
రుచిని, పోషకాలను మరింత పెంచడానికి దీనిలో చియా సీడ్స్ లేదా ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కలపొచ్చు. షుగర్ అసలే వాడకుండా హనీ కానీ ఖర్జూరం కానీ వాడటం మంచిది. కావాలంటే చిటికెడు దాల్చిన చెక్క పొడి వేస్తే కొత్త సువాసన వస్తుంది.
అయితే డయాబెటిస్ ఉన్నవారు తీపిని వీలైనంత తగ్గించి తీసుకోవాలి. డెయిరీ ప్రొడెక్ట్స్ పడనివారు లాక్టోస్ ఫ్రీ పెరుగు లేదా ప్లాంట్ బేస్డ్ పెరుగు వాడొచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని తర్వాత తాగొచ్చులే అని కాకుండా..లస్సీని తయారు చేసుకున్న వెంటనే తాగేస్తేనే పూర్తి పోషకాలు అందుతాయి.
Siddaramaiah : ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను..సిద్ధరామయ్య ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు?
