Hair Fall
పెరిగిపోతున్న పొల్యూషన్, మెంటల్ టెన్షన్స్ , సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల చిన్న వయసులోనే జుట్టు రాలడం(Hair Fall), పలచబడటం, తెల్లబడటం వంటి సమస్యలు కామన్ అయిపోయాయి. చాలామంది జుట్టును రక్షించుకోవడం కోసం ఖరీదైన షాంపూలు, కండీషనర్లు, ఆయిల్స్ వాడుతుంటారు.
అయితే జుట్టు ఆరోగ్యానికి బయటి నుంచి చేసే షాంపూలు, కండీషనర్లు, ఆయిల్స్ వంటి ప్రయోగాల కంటే లోపలి నుంచి అందే పోషణే ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే సమతుల్య ఆహారం జుట్టు వేర్లను స్ట్రాంగ్‌గా మారుస్తుంది.
ముఖ్యంగా ఐరన్, జింక్, విటమిన్ డి, విటమిన్ సి , బయోటిన్ లోపం వల్ల జుట్టు పలచబడటం జరుగుతుంది. అందుకే మనం తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయల రసాలను చేర్చుకోవడం ద్వారా జుట్టుకు అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను , విటమిన్లను సమృద్ధిగా అందించొచ్చు.
జుట్టు విపరీతంగా రాలిపోతున్నప్పుడు ఉసిరికాయలతో తయారుచేసిన జ్యూస్ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఒక ఉసిరికాయ, పది కరివేపాకు రెబ్బలు, సగం నిమ్మకాయ , ఒక చెంచా తేనెను గ్లాసు నీటిలో కలిపి తీసుకుంటే జుట్టు వేర్లు చాలా స్ట్రాంగ్‌గా మారుతాయి. ఉసిరిలో ఉండే విటమిన్ సి వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి బాగా పెరుగుతుంది. అలాగే కరివేపాకులోని పోషకాలు జుట్టు పలచబడకుండా చేయడంలో సాయపడతాయి. అంతేకాకుండా తలలో ఉండే చుండ్రును నిమ్మకాయ రసం నివారించి చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఇక జుట్టు ఒత్తుగా, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో నిగనిగలాడాలంటే నట్స్ , విత్తనాలతో కూడిన స్మూతీని ప్రయత్నించాలి. నానబెట్టిన బాదంపప్పులు, వాల్‌నట్‌లు, గుమ్మడి గింజలు మరియు ఖర్జూరాన్ని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన జింక్ మరియు మెగ్నీషియం అందుతాయి. ఇది కొత్త జుట్టు పెరగడానికి , జుట్టు సాంద్రత పెరగడానికి ఎంతగానో తోడ్పడుతుంది.
జుట్టు వేగంగా పొడవు పెరగాలంటే విటమిన్ ఏ , ఐరన్ చాలా అవసరం. దీనికోసం క్యారెట్, బీట్‌రూట్, ఆపిల్ మరియు అల్లం కలిపి తయారుచేసిన జ్యూస్ ఒక పవర్‌ఫుల్ టానిక్ లా పనిచేస్తుంది. క్యారెట్ జుట్టుకు సహజమైన మెరుపును ఇస్తే, బీట్‌రూట్ తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తలలో ఇన్ఫెక్షన్లు లాంటివి ఏమైనా ఉంటే అవి అల్లం వల్ల తగ్గిపోతాయి.
ఇప్పుడు చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం అందరినీ వేధిస్తున్న మరో మెయిన్ ప్రాబ్లెమ్ అయిపోయింది. దీనిని అరికట్టడానికి నల్ల నువ్వులు, అవిసె గింజలు, ఉసిరి పొడి డ్రింక్ చాలా బాగా పనిచేస్తుంది. నల్ల నువ్వుల్లోని ఖనిజాలు జుట్టు సహజ రంగును కాపాడి తెల్లబడకుండా చేస్తాయి.
అలాగే జుట్టుతో పాటు నెత్తిమీద స్కిన్ ఆరోగ్యంగా ఉండటానికి కలబంద గుజ్జు, పుదీనా ఆకులు, దోసకాయ, కొబ్బరి నీళ్ల మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇది శరీరాన్ని చల్లబరిచి తలలో దురదతో పాటు వేడిని కూడా బాగా తగ్గిస్తుంది. కొబ్బరి నీటిలోని ఎలక్ట్రోలైట్స్.. జుట్టు కణాలకు అవసరమైన హైడ్రేషన్ అందిస్తాయి. ఇలా ఈ పానీయాలను రోజు మార్చి రోజు కానీ కనీసం వారంలో 2,3సార్లు అయినా తీసుకుంటే మీ జుట్టు రాలడం తగ్గి(Hair Fall) లోపలి నుంచి ఆరోగ్యంగా, దృఢంగా మారుతుంది.
