Self Talk
మనల్ని ప్రపంచం ఎంతగా విమర్శిస్తుందో, ఎంత తక్కువ చేస్తుందో తెలియదు కానీ, మనల్ని మనం విమర్శించుకునే మోతాదు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మన మెదడులో ఎప్పుడూ ఒక గొంతు వినిపిస్తూనే ఉంటుంది.
నువ్వు ఈ పని చేయలేవు, నీకు అంత అదృష్టం లేదు, మళ్లీ ఈసారి కూడా ఏదో తప్పు చేస్తావు చూడు అంటూ మన మెదడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. దీనినే నెగటివ్ సెల్ఫ్ టాక్(Self Talk) అంటారు. నిజానికి ఇది ఒక విష వలయం వంటిదని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మనం మన గురించి ఏమని అనుకుంటామో, కాలక్రమేణా అదే నిజమవుతుంది.
ఈ నెగిటివ్ ఆలోచనల వల్ల మనిషి కొత్తగా ఏమైనా ప్రయత్నాలు చేయాలన్నా భయపడతాడు. ఎందుకంటే కొత్త పనులు చేసేటపుడు ఏ చిన్న పొరపాటు జరిగినా దానిని భూతద్దంలో పెట్టి చూపిస్తుంది ఇలాంటి మనస్తత్వం.
ఇక్కడ ఒకటే గుర్తు పెట్టుకోవాలి. ప్రపంచం మొత్తం నిన్ను నమ్మినా సరే, నిన్ను నువ్వు నమ్మకపోతే ఏదీ సాధించలేవు. ఎప్పుడూ కూడా మనం ఇతరులకు ఎంత గౌరవాన్ని, ప్రేమను ఇస్తామో.. మనకు మనం కూడా అంతే గౌరవాన్ని ఇచ్చుకోవడం అలవాటు చేసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తూ, మనుషులు వారి విషయంలో అత్యంత కఠినమైన తీర్పులు ఇచ్చేసుకుంటారు.
ఈ సమస్యను ఓవర్‌కమ్ చేయాలంటే మన మనసుతో మనం నిత్యం చేసే సంభాషణా విధానాన్ని మార్చుకోవాలి. మనకు మనమే విమర్శించుకోవడం, మనల్ని మనమే తక్కువ చేసుకోవడానికి బదులుగా మనకి మనమే ప్రోత్సాహాన్ని అందించుకోవాలి. ఏదైనా తప్పు జరిగినప్పుడు మనం ఫెయిల్ అయ్యామని అనుకోకుండా.. ఈ విషయంలో ఒక పాఠాన్ని నేర్చుకున్నామని చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి.
ఎందుకంటే మన ఆలోచనలే మన ముందున్న ప్రపంచాన్ని కొత్తగా నిర్మిస్తాయి. కాబట్టి మన అంతర్గత గొంతును ఒక స్నేహితుడిలా మార్చుకున్నప్పుడు మాత్రమే.. మన జీవితంలో ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ముందడుగు వేయడం సాధ్యమవుతుంది.
Cool Drinks :కూల్ డ్రింక్స్ , చిప్స్ కాంబినేషన్ ఇష్టమా? సమ్మర్‌లో ఈ పొరపాటు అస్సలు చేయొద్దు..
