Prometheus
భూమిపై మనిషి నాగరికతలు రూపుదిద్దుకోక ముందే, పెద్ద పెద్ద సామ్రాజ్యాలేవీ పుట్టుకురావడానికి ముందు నుంచే నిశ్శబ్దంగా జీవిస్తూ వచ్చిన ఒక అద్భుతం ప్రోమేథియస్ చెట్టు అని చెప్పాలి. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో ఉన్న వీలర్ పీక్ ఏరియాలో గ్రేట్ బేసిన్ బ్రిసిల్‌కోన్ పైన్ జాతికి చెందిన ఈ ట్రీ సుమారు 4,900 సంవత్సరాల పాటు జీవించింది.
తీవ్రమైన మంచు చలిని, ఎడారి గాలులను తట్టుకుంటూ వేల ఏళ్లు నిలబడింది ఈ మహా వృక్షం. అయితే ఈ చెట్టు అసలు ఇంపార్టెన్స్.. అది నరికివేయబడిన తర్వాతే ప్రపంచం మొత్తం తెలియడం ఒక పెద్ద విషాదం.
ఈ బ్రిసిల్‌కోన్ పైన్ చెట్లు అత్యంత కఠినమైన వెదర్‌లో చాలా నెమ్మదిగా పెరుగుతాయి. ఆ నెమ్మదైన ఎదుగుదల వల్లే వాటి కలప అత్యంత దట్టంగా, గట్టిగా మారేలా చేస్తుంది. అందువల్లే అవి వేల సంవత్సరాలు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా జీవించగలుగుతాయి.
అయితే 1964లో డోనాల్డ్ ఆర్.కర్రీ అనే జియాలజిస్ట్ మంచు యుగం వాతావరణ పరిస్థితులపై రీసెర్చ్ చేస్తూ ఈ మహా వృక్షం వద్దకు వచ్చారు. డెండ్రోక్రోనాలజీ మెథడ్ ద్వారా అంటే చెట్టు కాండంలో ఉండే సర్కిల్స్‌ను బట్టి భూమి పాత వాతావరణాన్ని అంచనా వేయొచ్చని కర్రీ భావించారు. దీనిలో భాగంగానే శాంపిల్ తీసుకోవడానికి ప్రయత్నించి, చివరికి ఆ చెట్టునే పూర్తిగా నరికేశారు.
చెట్టు కూలిపోయాక దాని కాండాన్ని పరిశీలిస్తే దానిలో 4,862 సర్కిల్స్ కనిపించాయి. కఠినమైన వాతావరణం వల్ల కొన్ని ఏళ్లలో రింగ్స్ ఏర్పడకపోవచ్చనే అంచనాతో ..ఈ చెట్టు వయసు సుమారు 4,900 ఏళ్లుగా నిర్ధారించారు. అంటే ఈ భూమిపై ఎన్నో విపత్తులకు సజీవ సాక్షిగా నిలబడ్డ ఆ చెట్టు చివరకు శాస్త్రవేత్తల చేతిలోనే అంతమైపోయింది.
ఈ ఘటన తర్వాత నేచర్ లవర్స్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనివల్లే ఆ తర్వాత పురాతన చెట్ల సంరక్షణపై కొత్త చట్టాలు వచ్చాయి. అంతేకాదు చెట్టును నరకకుండానే ఒక చిన్న డ్రిల్ మెషీన్ ద్వారా కాండంలోకి వెళ్లి సన్నని శాంపిల్ తీసి ఏజ్‌ను లెక్కించే లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.
ప్రోమేథియస్(Prometheus) అంతమయ్యాక, కాలిఫోర్నియాలోని వైట్ మౌంటెన్స్‌లో సుమారు 5,000 ఏళ్లకు పైగా వయసున్న మరో బ్రిసిల్‌కోన్ పైన్ వృక్షాన్ని కనుగొన్నారు. ఏది ఏమైనా ప్రోమీథియస్(Prometheus) మనకు నేచర్ విలువను, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేస్తూనే ఉంటుందన్నది మాత్రం నిజం.
