Single Mom
ఎవరికైనా సరే, ఎప్పుడైనా సరే నిజాయితీకి మించిన అందం లేనేలేదు. అంకితభావానికి మించిన అలంకారం అసలే ఉండదు. టెక్సాస్‌కు చెందిన ఓ సింగిల్ మదర్ విషయంలో ఇదే జరగడంతో ఒక్కసారిగా ఆమె వండర్ న్యూస్‌గా మారిపోయింది.
ఒకే ఒక సాధారణ జూమ్ (Zoom) కాల్ ఆమె జీవితాన్ని మార్చి.. ఓవర్ నైట్ ఇంటర్నెట్ సెలబ్రిటీ అయిపోయింది. సోషల్ మీడియాలో ఓ ఉప్పెనల వ్యాపించిన ఆ ఒక్క స్క్రీన్‌షాట్, ఈ తరం వర్కింగ్ ఉమెన్ ఎదుర్కొంటున్న సవాళ్లకు, వారి అసాధారణ స్కిల్‌కు ఒక నిలువుటద్దంలా నిలవడంతో ఆ ఫోటో ఎందరినో టచ్ చేసింది. దీంతో ఇది కేవలం ఒక వైరల్ ఫోటో కాదని.. బాధ్యతల సుడిగుండంలో కూడా చిరునవ్వు వీడని ఒక తల్లి(Single Mom) విజయమని చెబుతూ వస్తున్న కామెంట్లతో ఇప్పుడు సోషల్ మీడియా షేక్ అవుతోంది.
ఎప్పటిలాగే టెక్సాస్‌లోని మార్కెటింగ్ ఏజెన్సీ మీటింగ్ ఆన్‌లైన్లో మొదలవ్వగానే ..కొలీగ్స్ అంతా వెనుక అందమైన బ్యాక్‌గ్రౌండ్లతో, ప్రశాంతమైన హోమ్, ఆఫీసుల నుంచి లాగిన్ అయ్యారు. కానీ, మెలిస్సా సిమన్స్ (Melissa Simmons)అనే యువతి మాత్రం కిచెన్‌లో స్టౌ పక్కన నిలబడి మీటింగ్‌లో ప్రత్యక్షమైంది.
వైట్ కలర్ డ్రస్‌లో ఎంతో ప్రొఫెషనల్‌గా కనిపిస్తూనే.. ఒక చేత్తో పాస్తా కలుపుతూ, మరో చేత్తో లాప్‌టాప్‌లో మీటింగ్ నోట్స్ టైప్ చేస్తూ ఆమె కనిపించింది. నిజానికి ఆ వెనుక గందరగోళంగా ఉన్న సింక్, స్కూల్ రిమైండర్లతో నిండిపోయిన ఫ్రిజ్, పక్కనే హై-చైర్‌లో కూర్చుని తింటున్న చిన్న బాబు.. ఇదీ అసలు సిసలైన ‘రియల్ లైఫ్’సీన్ అన్నట్లుగా ఉంది.
సాధారణంగా మీటింగ్‌లో ఇలాంటి సీన్ చూస్తే బాస్‌లు, మేనేజర్లు, టీమ్ లీడర్లు ఉంటారు కాబట్టి వారు సీరియస్ అవుతారేమోనని అంతా భయపడతారు. కానీ అక్కడ జరిగింది వేరు. ఆమె మల్టీ టాస్కింగ్ చూసి కొలీగ్స్ అంతా ఫిదా అయిపోయారు. చాట్ బాక్స్‌ను హార్ట్ ఎమోజీలతో నింపేసి ..మీరు సూపర్ మేమ్ అంటూ ప్రశంసలు కురిపించారు.
ఆమె బాస్ అయితే ఏకంగా ఆ వీడియోను పిన్ చేసి మరీ.. దీన్నే అంకితభావం అంటారని అందరి ముందు ఆ ఎంప్లాయ్‌ను కొనియాడారు. అయితే ఇప్పుడు ఆ స్క్రీన్‌షాట్ లింక్డిన్, టిక్‌టాక్ వంటి వేదికలపై లక్షల వ్యూస్ సాధించి గ్లోబల్ ట్రెండ్‌గా మారింది. మరోవైపు ఆమె సిన్సియారిటీని గుర్తించిన నెటిజన్లు పొగడ్తలతో సరిపెట్టకుడా ఆ సింగిల్ మదర్(Single Mom) కష్టానికి తమ వంతు సాయంగా వేల డాలర్ల ఫండ్రైజర్‌తో అండగా నిలవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
ఈ రియల్ స్టోరీ ఇచ్చే సందేశం ఒక్కటే.. మనం సక్సెస్ అవ్వాలి అంటే లగ్జరీ ఆఫీస్ గదులు లేదా నిశ్శబ్దమైన వాతావరణం ఇలా ఏమీ అక్కర్లేదు. మనసు నిండా బాధ్యత, మనం చేసే పని మీద గౌరవం ఉంటే ఎంతటి గందరగోళంలోనైనా మన పనిని మనం అందరూ మెచ్చేలా చేయొచ్చు. ఏది ఏమయినా పర్ఫెక్ట్‌గా ఉండటం కంటే కూడా, ప్రాక్టికల్‌గా ఉంటూ మన పని మనం చేసుకుని పోవడమే నిజమైన గెలుపు అని ఈ సింగిల్ మామ్ ప్రపంచానికి చాటి చెప్పినట్లు అయింది.
