First Selfie : స్మార్ట్‌ఫోన్ పుట్టకముందే ఫస్ట్ సెల్ఫీ ..ఫ్రంట్ కెమెరా లేకుండానే సెల్ఫీ ఎలా తీశారు?

First Selfie : మనమంతా ఇప్పుడు వాడుతున్న సెల్ఫీ (Selfie) అనే పదం మాత్రం 2013 సంవత్సరంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు దీన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ప్రకటించింది.

First Selfie

ఒకప్పుడు ఫోటో దిగాలంటే ఎవరో ఒకరి సాయం ఉండాల్సిందే. కానీ ఇప్పుడు కావాల్సినపుడు, కావాల్సినన్ని సెల్ఫీలు తీసుకుంటున్నాం. మూతి ముడుచుకుని ఒక ఫోటో, నవ్వుతూ ఒక ఫోటో.. ఇలా నచ్చిన సెల్ఫీలు తీసుకోవడం, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేస్తున్నాం.

అయితే సెల్ఫీలు అంటే స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాకే పుట్టాయని చాలామంది అనుకుంటారు. కానీ డిజిటల్ కెమెరాలే కాదు అసలు మొబైల్ ఫోన్లు కూడా భూమి మీద ఉనికిలో లేని రోజుల్లోనే రాబర్ట్ కార్నెలియస్ (Robert Cornelius) అనే వ్యక్తి తన ఫోటో తానే దిగి రికార్డు సృష్టించారు. అదీ కూడా 200 ఏళ్ల కిందట, సరిగ్గా 1839వ సంవత్సరంలోనే సెల్ఫీ మూలకర్తగా ఫేమస్ అయిపోయారు.

అమెరికాలోని ఫిలడెల్ఫియాకు చెందిన రాబర్ట్ కార్నెలియస్ .. కెమిస్ట్రీ ప్రాసెస్ తెలిసిన ఫోటోగ్రఫీ ప్రేమికుడు. ఆయన కుటుంబం ల్యాంపుల బిజినెస్ చేసేది. అప్పట్లో కెమెరాలు అంటే ఇప్పుడు మన చేతిలో ఉండే చిన్న కెమెరాలు, ఫోన్లలా ఉండేవి కావు. చాలా పెద్ద పరిమాణంలో, భారీ లెన్స్‌లతో, లోహపు ప్లేట్లతో ఉండేవి. అప్పటికి ఫోటో తీయడం అనేది చాలా పెద్ద ప్రయోగంతో సమానంగా అంతా భావించేవారు.

1839 ఇయర్ ఎండింగ్‌లో ఒకరోజు, రాబర్ట్ కార్నెలియస్ తన ఇంటి వెనుక వైపున్న లైటింగ్ బాగా వచ్చే ఖాళీ ప్లేస్‌లో కెమెరాను ఫిక్స్ చేశారు. అప్పట్లో కెమెరాకి లెన్స్ క్యాప్ తీసి, ఫోటో రికార్డు అయ్యేలా ఏర్పాట్లు చేసి, ఆ తర్వాత తను కూడా వెళ్లి అందరితో పాటు కెమెరా ముందు కూర్చోవాల్సి వచ్చేది. రాబర్ట్ కూడా సరిగ్గా అదే చేశాడు. లెన్స్ క్యాప్ తీసి పరుగెత్తుకెళ్లి కెమెరా ముందు కూర్చుని హిస్టరీలోనే మొట్టమొదటి సెల్ఫీ దిగారు.

ఆ సమయంలో డాగ్యురియోటైప్ (Daguerreotype) అనే కెమెరా టెక్నాలజీ ఉండేది. ఈ ప్రాసెస్‌లో లైట్ రికార్డ్ అవ్వడానికి చాలా సమయం పట్టేది. ఇప్పుడంటే కెమెరా క్షణాల్లో క్లిక్ అయిపోతుంది కానీ, రాబర్ట్ తన సెల్ఫీ కోసం సుమారు 10 నిమిషాల పాటు రెప్ప వేయకుండా, చిన్న కదలిక కూడా లేకుండా అలానే కూర్చుండిపోవాల్సి వచ్చింది. కొద్దిగా కదిలినా ఫోటో బ్లర్ అయిపోతుంది కాబట్టి చాలా ఓపికగా కూర్చుని తన ఫోటోను తనే క్లిక్ చేసుకున్నారు.

First Selfie

ఆ సెల్ఫీ గుర్తుగా ఆ ఫోటో వెనుక రాబర్ట్ కార్నెలియస్ తన స్వహస్తాలతో 1839లో తీసిన తొలి కాంతి చిత్రం.. అని రాసుకున్నార. ఆ హిస్టారికల్ ఫోటో ఇప్పటికీ అమెరికాలోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో చాలా భద్రంగా ఉంది. ఆ తర్వాత రాబర్ట్ ఫొటోగ్రఫీ స్టూడియోలు కూడా పెట్టి, ఫోటో తీసే టైమ్‌ను తగ్గించే ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు .

మనమంతా ఇప్పుడు వాడుతున్న సెల్ఫీ (Selfie) అనే పదం మాత్రం 2013 సంవత్సరంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు దీన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ప్రకటించింది. పదం ఇప్పటిదే కావచ్చు కానీ, ఆలోచన మాత్రం రెండు శతాబ్దాల కిందటిది అని చాలామందికి తెలీదు.

మొత్తంగా అప్పట్లో 10 నిమిషాల నరకాన్ని భరించి రాబర్ట్ కార్నెలియస్ తీసిన ఆ ఒక్క ఫోటో.. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రోజుకి వందల కోట్ల సెల్ఫీలుగా మారిన.. సాంకేతిక విప్లవానికి మొదటి అడుగుగా చెప్పుకోవచ్చు.

Check Laziness : ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఉందా? ఈ 5 జపనీస్ సీక్రెట్ టెక్నిక్స్ ట్రై చేయండి..

Exit mobile version