Schizophrenia
మానసిక ఆరోగ్యం అనగానే మన సొసైటీలో ఇప్పటికీ ఒక రకమైన భయం, దానిని దాచడానికి ప్రయత్నించడం చూస్తూనే ఉంటాం. ఒంట్లో ఏదైనా నొప్పులు ఉంటే అందరికీ చెప్పుకునే మనుషులు.. అదే మనసుకు గాయమైతే మాత్రం దాన్ని లోపలే దాచుకుని నరకం అనుభవిస్తారు.
ముఖ్యంగా షిజోఫ్రెనియా (Schizophrenia)వంటి పెద్ద మానసిక సమస్య బారిన పడితే వారి మనసులో బాధకంటే.. చుట్టుపక్కల వాళ్లు వారిని ఒక వింత వ్యక్తిలా చూస్తూ దూరం పెట్టడం ఇంకా వేధిస్తుంది. సాధారణంగా మన సొసైటీలో మానసిక సమస్యలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది దీనిని ఒక శాపంగానో, దెయ్యాలు పట్టడమో అనుకుని తప్పుదారి పడుతుంటారు. కానీ ఇది మనిషి మెదడులోని కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ఒక సాధారణ జబ్బు మాత్రమే.
మే 24 ప్రపంచ షిజోఫ్రెనియా అవగాహన దినోత్సవం సందర్భంగా అసలు షిజోఫ్రెనియా అంటే ఏంటి, దాని ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయి.. ఆ సమస్యను ఎలా ఎదుర్కొని బయటపడాలనే వివరాలను ఓసారి చూద్దాం.
ఈ సమస్య ఉన్నవారిలో ఆలోచనలు, ప్రవర్తన మొత్తం మారిపోతాయి. ముఖ్యంగా వీరు లేని విషయాలను నిజం అని బలంగా నమ్ముతుంటారు. ఎవరో తమను చంపడానికి చూస్తున్నారని, తమపై కుట్రలు చేస్తున్నారని లేదంటే తమను ఎవరో అదేపనిగా గమనిస్తున్నారని విపరీతంగా భయపడిపోతుంటారు. అలాగే చుట్టుపక్కల ఎవరూ లేకపోయినా తమకు మాత్రమే కొన్ని వింత శబ్దాలు , ఎవరో మాట్లాడుతున్నట్లు గొంతులు వినిపిస్తున్నాయని అంటారు.
మాట్లాడేటప్పుడు కూడా ఒక పద్ధతి లేకుండా సడన్‌గా సంబంధం లేని విషయాలు మాట్లాడటం, ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకు హఠాత్తుగా మారిపోవడం జరుగుతుంది. వీరు ఆనందం కానీ, బాధ కానీ తమ ముఖంలో చూపించలేరు. ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా గదిలోనే ఉండటానికి ఇష్టపడతారు. చివరికి స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం వంటి సొంత పనులను కూడా చేసుకోలేనంత నీరసించిపోతారు.
షిజోఫ్రెనియా అనేది పెద్ద సమస్యే అయితే సరైన సమయంలో గుర్తిస్తే దీని నుంచి కచ్చితంగా బయటపడొచ్చని వైద్యులు చెబుతున్నారు. పైన చెప్పిన లక్షణాలు కనిపించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకియాట్రిస్ట్‌ను కలవాలి. ఎందుకంటే సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే అంత ఈజీగా నయం చేయొచ్చు. బీపీ, షుగర్ లాగే ఈ షిజోఫ్రెనియాకు కూడా డాక్టర్ సూచించిన మెడిసిన్స్‌ను చాలా కాలం పాటు వాడాల్సి ఉంటుంది.
మధ్యలోనే తమకు అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడంతా బాగుంది కదా అని మందులు ఆపేస్తే మాత్రం షిజోఫ్రెనియా(Schizophrenia) సమస్య మళ్లీ మొదటికి వస్తుంది.ముఖ్యంగా మందులతో పాటు కౌన్సెలింగ్ ఇప్పించడం వల్ల వారిలోన ఆలోచనా విధానం మారి, తిరిగి సాధారణ జీవితం వైపు అడుగులు వేయగలుగుతారు.
ఈ సమస్య ఉన్నవారికి అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది కుటుంబ సభ్యుల ప్రేమ, ఓపిక అని మానసిక నిపుణులు చెబుతారు. వారిని వెక్కిరించడం, తిట్టడం చేయకుండా.. వారికి అందరం ఉన్నామనే నమ్మకాన్ని ఇస్తూ సపోర్ట్ చేస్తూ వారికి అండగా నిలబడాలి. ఇలాంటి మానసిక అనారోగ్యంతో బాధపడేవారిని వింతగా చూడటం అనేది ఆపేయాలి.
