Annamalai : తమిళనాట మరో కొత్త పార్టీ ?..బీజేపీకి షాక్ ఇవ్వబోతున్న అన్నామలై

Annamalai : తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేసి సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా?

Annamalai

తమిళనాడు రాజకీయాలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి. భాష, ప్రాంతీయవాదానికే అక్కడ ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తుంది. రాజకీయాల్లో అయితే బయటి పార్టీలను రానిచ్చే ప్రసక్తే లేదు. తమిళ పార్టీలే అక్కడ మనుగడలో ఉంటాయి. అందుకే ఇప్పటి వరకూ కాంగ్రెస్ , బీజేపీ వంటి జాతీయ పార్టీలు తమిళనాడులో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయాయి. దీంతో మంచి ఫాలోయింగ్ ఉన్న నేతలు సైతం స్థానిక పార్టీల్లో ఉంటారే తప్ప జాతీయ పార్టీలవైపు వెళ్లరు.

ఈ విషయాన్ని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆలస్యంగా గ్రహించినట్టున్నారు. తమిళనాట ఫైర్ బ్రాండ్ నేతగా పేరున్న అన్నామలై(Annamalai) అనతికాలంలోనే బీజేపీకి అక్కడ కీలక నేతగా మారారు. దూకుడుగా వ్యవహరిస్తూ బీజేపీ అగ్రనేతలను ఆకట్టుకున్న అన్నామలై తమిళనాడులో బీజేపీని ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇచ్చే స్థాయికి తీసుకొచ్చారు.

2021 నుంచి 2025 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అన్నామలై(Annamalai) ఆ సమయంలో సి.ఎన్. అన్నాదురై, జయలలితలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. ముఖ్యంగా మిత్రపక్షంగా ఉన్న ఏఐఏడీఎంకేతో తీవ్ర విభేదాలకు దారితీసాయి.

దీంతో అన్నామలైని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడంలో ఏఐఏడీఎంకే తెరవెనుక కీలకపాత్ర పోషించింది. తర్వాత పొత్తులో భాగంగా 27 సీట్లకే పరిమితమవ్వడం అన్నామలై వ్యతిరేకించినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ కారణంగానే ఎన్నికల్లో పోటీ చేయలేదన్న ప్రచారం కూడా జరిగింది.

ఇటీవలే ముగిసిన ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక సీటు మాత్రమే గెలిచింది. ఎన్నికల తర్వాత అన్నామలై(Annamalai) ఒక్కసారిగా సైలెంట్ గా మారడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా అన్నామలై సంచలన నిర్ణయం తీసుకున్నట్టు కథనాలు వస్తున్నాయి. విజయ్ పార్టీ అత్యధిక సీట్లు గెలిచిన వేళ జాతీయ పార్టీలో ఉంటే మనుగడ కష్టమని అన్నామలై భావిస్తున్నట్టు సమాచారం.

Annamalai

దీనిలో భాగంగానే కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. జూన్ 4వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా అన్నామలై కొత్త పార్టీ ప్రకటన చేసే అవకాశముంది. ఇప్పటికే ఆయన మద్దతు దారులు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు.. బోర్డులు ఏర్పాటు చేయడంతోఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

తమిళనాడులో ప్రాంతీయ సమీకరణాలే బలంగా ఉండడం, తన ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్న అసంతృప్తి అన్నామలైలో ఉన్నట్టు అతని సన్నిహితులు చెబుతున్నారు. ఈ కారణంగానే అన్నామలై కొత్త పార్టీ ఏర్పాటుపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అయితే తమిళనాడు బీజేపీ నేతలు మాత్రం ఇవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేస్తున్నారు.

Ram Charan : రామ్ చరణ్ పెద్ది థియేట్రికల్ జాతర.. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల వేట షురూ..

Exit mobile version