Apple Pay
ఇండియాలో డిజిటల్ పేమెంట్ మార్కెట్ ఎంత స్పీడ్‌గా దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీ బడ్డీ దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకూ ఫోన్ పే, గూగుల్ పేలతో స్క్యాన్ చేసి పేమెంట్ చేయడం అందరికీ అలవాటైపోయింది.
అయితే, ఇప్పుడు ఈ ఆన్‌లైన్ డిజిటల్ పేమెంట్ వరల్డ్‌లోకి ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ కూడా ఎంట్రీ ఇస్తోంది. తన సొంత డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ యాపిల్ పే ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
వచ్చే అక్టోబర్ నాటికి ఈ సేవలను అధికారికంగా రోల్ అవుట్ చేయడానికి కంపెనీ సన్నాహాలు ముమ్మరం చేసింది. కానీ, ఇండియన్ యూజర్లకు ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఎదురుకాబోతోంది. స్టార్టింగ్ స్టేజ్‌లో ఈ ప్లాట్‌ఫామ్‌లో మనం రెగ్యులర్‌గా వాడే యూపీఐ (UPI) ట్రాన్జాక్షన్స్‌కు సపోర్ట్ ఉండే అవకాశం లేకపోవడం గమనార్హం.
మరి యూపీఐ లేకపోతే చెల్లింపులు ఎలా సాగుతాయని చాలామందికి డౌట్ వస్తుంది. తొలి దశలో ఐఫోన్, యాపిల్ వాచ్ యూజర్లు తమ యాపిల్ వాలెట్ యాప్‌లో వీసా, మాస్టర్‌కార్డ్ నెట్‌వర్క్‌లకు చెందిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను యాడ్ చేసుకోవచ్చు.
ఎన్ఎఫ్‌సీ (NFC) ఫెసిలిటీ ఉన్న పాయింట్-ఆఫ్-సేల్ (POS) మిషన్ల వద్ద తమ ఐఫోన్ లేదా యాపిల్ వాచ్‌ను జస్ట్ ట్యాప్ చేయడం ద్వారా కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ పూర్తి చేయొచ్చు. ఈ కాంటాక్ట్‌లెస్ సర్వీస్ కోసం యాపిల్ కంపెనీ ఇప్పటికే దేశంలో ప్రముఖ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి బిగ్ ప్లేయర్లతో ప్రాథమిక చర్చలు ముగించింది.
అయితే, ప్రతి ఒక్కరూ వాడే యూపీఐ సర్వీసులు యాపిల్ పేలో అందుబాటులోకి రావడానికి ఇంకా టైమ్ పట్టేలా ఉంది. భారత దేశంలో యూపీఐ సర్వీసులను నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) నుంచి పర్మిషన్ రావడం ఇక్కడ అత్యంత కీలకం.
సెక్యూరిటీ అండ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ విషయంలో యాపిల్, ఎన్‌పీసీఐ మధ్య అభిప్రాయ భేదాలు కొలిక్కి రాలేదని వార్తలు వస్తున్నాయి. యాపిల్ తన సొంత డివైజ్ సెక్యూరిటీ (ఫేస్ ఐడీ, టచ్ ఐడీ)కే ఇంపార్టెన్స్ ఇస్తుండగా, ఎన్‌పీసీఐ మాత్రం కచ్చితంగా ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ ఉండాల్సిందేనని పట్టుబడుతోంది.
దీనికి తోడు, ట్రాన్సాక్షన్ ఛార్జీల విషయంలోనూ బ్యాంకులు, యాపిల్ మధ్య చర్చలు నడుస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో ప్రతి ట్రాన్జాక్షన్‌పై 0.15 శాతం నుంచి 0.20 శాతం వరకు వసూలు చేసే యాపిల్, ఇండియాలో మాత్రం ఆ కమీషన్‌ను 0.10 శాతానికి తగ్గించుకోవాలని బ్యాంకులు ప్రతిపాదిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా పదేళ్ల క్రితమే అందుబాటులోకి వచ్చిన యాపిల్ పే(Apple Pay), ఇప్పటికి ఇండియాకి వస్తుంది. స్టార్టింగ్‌లో కేవలం ప్రీమియం కార్డ్ హోల్డర్లు, ఎన్ఎఫ్‌సీ మిషన్లు ఉన్న బిజినెస్ మ్యాన్‌లకే ఇది పరిమితం కాబోతోంది. అందువల్ల, ప్రస్తుతం దేశ మూలమూలలా బలంగా ఉన్న క్యూఆర్ కోడ్ బేస్డ్ యూపీఐ మార్కెట్‌పై యాపిల్ పే ఎఫెక్ట్ వెంటనే పెద్దగా ఉండకపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
Cinnamon Coffee : దాల్చిన చెక్క కాఫీ టేస్ట్ చేశారా? బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదలరు..
