West Bengal
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో తమిళనాడు తరహాలోనే అందరినీ ఆకర్షించిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్…. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి కంచుకోటగా మారిన బెంగాల్(West Bengal) లో జెండా పాతేందుకు బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. చివరికి ఈ సారి సక్సెస్ అయింది. తాజా ఎన్నికల్లో బెంగాల్ ను బీజేపీ కైవసం చేసుకుంది.
అది కూడా భారీ సీట్లతో మమతా బెనర్జీని ఓడించింది. ఇప్పటి వరకూ వెలువడుతున్న ఫలితాల్లో బీజేపీ దాదాపు 180కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉండగా.. మమతా బెనర్జీ పార్టీ టీఏంసీ 90 సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తోంది.నిజానికి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సమయంలో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ కనిపించింది.
అయితే ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత బీజేపీ అద్భుతంగా పుంజుకుంది. ఆరంభంలోని రెండు మూడు రౌండ్లలో టీఏంసీ, బీజేపీ మధ్య 10-12 సీట్ల తేడా మాత్రమే కనిపించగా.. తర్వాత రౌండ్లు పెరిగే కొద్దీ ఆధిక్యం పూర్తిగా బీజేపీ వైపే మొగ్గింది. ప్రస్తుతం టీఏంసీ కంటే రెట్టింపు సీట్లలో ఆధిక్యంలో ఉంది. దీంతో బెంగాల్ గడ్డపై కాషాయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైంది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచీ బెంగాల్ పై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. గత మూడు పర్యాయాలుగా దీదీకి బెంగాల్ లో తిరుగులేదు.
గత ఎన్నికల్లో బీజేపీ గట్టిపోటీనిచ్చినా అధికారాన్ని మాత్రం సాధించలేకపోయింది. ఈ సారి మాత్రం బెంగాల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలం పార్టీ నేతలు ముమ్మరంగా ప్రచారం చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత, కొన్ని పరిస్థితులు, ఇతర అంశాలు బెంగాల్ లో బీజేపీ విజయానికి దోహద పడ్డాయి.
అయితే బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్నా మమతా బెనర్జీ మధ్యాహ్నం ఒక వీడియో విడుదల చేశారు. తుది ఫలితాలు మారతాయనీ, టీఎంసీ శ్రేణులు కౌంటింగ్ సెంటర్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశించారు. పూర్తి ఫలితం వెలువడే వరకూ అక్కడే ఉండాలని స్పష్టం చేశారు.
అయితే కీలక నియోజకవర్గాల్లో సైతం టీఏంసీ పార్టీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. తాను పోటీ చేస్తున్న భవానీపూర్ లో మాత్రం మమతా బెనర్జీ ఆధిక్యంలో ఉన్నారు. అయితే ఆరంభంలో రెండు మూడు రౌండ్లు దీదీ వెనుకబడడం, సువేందు అధికారి ఆధిక్యత సాధించడం కూడా ఆసక్తిని రేకెత్తించింది. దీంతో ఇక్కడ చివరి రౌండ్ పూర్తయ్యే వరకూ ఎవరు గెలుస్తారనేది చెప్పలేమంటున్నారు.
TVK Vijay : తమిళనాట విజిల్ మోత..విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం
