Cafe Coffee Day
కేఫ్ కాఫీ డే… బహుశా మన దేశంలోని మెట్రో నగరాల్లో ఈ పేరు తెలియని వారుండరు. భారతదేశంలో ఆధునిక కాఫీ సంస్కృతిని పరిచయం చేసిన మొట్టమొదటి అతిపెద్ద బ్రాండ్‌గా కేఫ్ కాఫీ డే(Cafe Coffee Day) గుర్తింపు తెచ్చుకుంది. 1996లో వీజీ సిద్ధార్థ బెంగళూరులో దీనిని ప్రారంభించారు. కేవలం కాఫీ తాగడమే కాకుండా, స్నేహితులతో మాట్లాడటానికి, వ్యాపార చర్చలకు ,ప్రశాంతంగా సమయం గడపడానికి ఒక చక్కని వేదికగా కాఫీ డే నిలిచింది.
ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఒకచోట చేరి సమయాన్ని గడిపే కల్చర్‌ను తీసుకొచ్చింది. సొంతంగా 20 వేల ఎకరాల నుంచి కాఫీ గింజలను సేకరించడం ఈ కేఫ్‌కు మరింత గుర్తింపునిచ్చింది. అయితే ఎంతో వేగంగా అందరి మన్ననలు పొందిన కాఫీ డే కొంతకాలంగా దివాళా అంచున నిలిచింది. కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ ఆత్మహత్య, తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు దీనికి కారణమయ్యాయి. ముఖ్యంగా మితిమీరిన అప్పులు, అనవసరమైన విస్తరణలే ఈరోజు కాఫీ డేను పతనం అంచున నిలబెట్టాయి.
వీజీ సిద్ధార్థ 2019 జూలై 29న కర్ణాటకలోని నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ అల్లుడైన ఆయన బలవన్మరణానికి ఆర్థిక ఇబ్బందులు, అప్పులే కారణంగా ఆయన సూసైడ్ నోట్ ద్వారా తెలిసింది. వ్యాపార విస్తరణలో భారీగా అప్పుల భారం పెరిగిందనీ, ప్రైవేట్ ఈక్విటీ భాగస్వాముల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైందని లేఖలో పేర్కొన్నారు.
ఐటీ అధికారుల నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లు సిద్ధార్థ లేఖలో ఆరోపించారు. 2019 నాటికి కంపెనీపై దాదాపు రూ.7,000 కోట్ల కంటే ఎక్కువ అప్పులు పేరుకుపోయాయి. కేఫ్‌ల నుంచి వచ్చే ఆదాయం మొత్తం తీసుకున్న రుణాల వడ్డీలు చెల్లించడానికే సరిపోయేది. మరోవైపు వీజీ సిద్ధార్థ కాఫీ వ్యాపారానికే పరిమితం కాకుండా రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్ , ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి ఇతర రంగాలలో పెట్టుబడులు పెట్టారు.
ప్రధాన కాఫీ వ్యాపారం లాభాల్లో ఉన్నా సరే సిద్ధార్థ మిగిలిన వ్యాపారాల్లో అనుకున్న లక్ష్యాలను అందుకోలేకపోయారు. ఫలితంగా భారీగా పెట్టుబడులు వృథా అయ్యాయి. ఈ కారణంగానే కంపెనీ దివాళా అంచునకు వచ్చేసి వీజీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నారు.
వీజీ సిద్ధార్థ మరణం తర్వాత ఆయన భార్య మాళవిక హెగ్డే కేఫ్ కాఫీ డే(Cafe Coffee Day) బాధ్యతలను స్వీకరించారు.సంస్థకున్న భారీ అప్పులను క్రమంగా చెల్లిస్తూ, కుప్పకూలుతుందనుకున్న కాఫీ డే బ్రాండ్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నష్టాల్లో ఉన్న అవుట్‌లెట్లను మూసివేయడం, ఆస్తులను విక్రయించడం ద్వారా రూ. 7 వేల కోట్ల రుణాన్ని భారీగా తగ్గించి కంపెనీని కాపాడారు.
అయినా సరే పాత అప్పుల బకాయిల వల్ల కంపెనీ ఇప్పటికీ దివాలా ప్రక్రియ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కార్పొరేట్ ప్రపంచంలో ప్రధాన వ్యాపారం బాగున్నా మితిమీరిన అప్పులు చేయడం, అనవసర విస్తరణలపై దృష్టి పెడితే కోర్ బిజినెస్ కుప్పకూలిపోతుందనే దానికి కాఫీ డేను ఉదాహరణగా చెబుతారు.
Date Of Birth : ఈ నెంబర్ వారికి సొసైటీలో గౌరవం పెరుగుతుంది..వీరికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం
