Delhi Protest
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలు(Delhi Protest).. శాంతిభద్రతల అంశంగా మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపైన కూడా ఎఫెక్ట్ చూపించే దిశగా మారుతున్నాయి. విద్యా వ్యవస్థలోని లోపాలు, నీట్ ఎగ్జామ్ పేపర్స్ లీకేజీకి నిరసనగా వేలాది మంది స్టూడెంట్స్, యువత రోడ్లపైకి రావడం ప్రజాస్వామ్యంలో కామనే అయినా, ఇటువంటి సుదీర్ఘ వీధి పోరాటాల వల్ల దేశ ప్రగతి చక్రాలను ఎలా మందగింపజేస్తాయో అన్న విషయాన్ని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సామాజిక అశాంతితో పాటు పెద్ద ఎత్తున జరిగే నిరసనల వల్ల దేశ ఆర్థిక రంగంపై పడే నెగిటివ్ ప్రభావంపై ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) సమగ్ర అధ్యయనాన్ని నిర్వహించింది. 1985 నుంచి 2021 వరకు ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో చోటుచేసుకున్న ఇలాంటి పరిణామాలను పరిశీలించినప్పుడు ఒక చేదు నిజం బయటపడింది.
భారీ ఆందోళనలు జరిగిన తర్వాతి ఆరు త్రైమాసికాల్లో ఆ దేశాల స్థూల జాతీయోత్పత్తి (GDP) సగటున ఒక శాతం వరకూ పడిపోతుందని ఈ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. నేటి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణంతో పోల్చి చూస్తే.. ఒక శాతం జీడీపీ కోల్పోవడం అంటే సుమారు రూ. 3.23 లక్షల కోట్ల వరకూ భారీ ఆర్థిక నష్టం జరగడమే అన్నమాట.
ఈ ఆందోళనల ఎఫెక్ట్ కేవలం జీడీపీకే పరిమితం కాకుండా ఆర్థిక మార్కెట్లను కూడా బాగా కుదిపేస్తుంది. ఐఎంఎఫ్ విశ్లేషించిన 72 దేశాల్లోని 156 నిరసనలను ఉదాహరణగా తీసుకుంటే , పెద్ద ఎత్తున అశాంతి నెలకొన్న సమయంలో స్టాక్ మార్కెట్ రిటర్న్స్ సగటున 1.4 శాతం పడిపోతాయి.
కొన్ని రకాల పరిస్థితుల్లో నిరసనలు మొదలైన మొదటి 3 రోజుల్లోనే మార్కెట్ విలువ 2 శాతం, నెలాఖరు నాటికి 4 శాతం వరకు క్షీణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఇటువంటి అనిశ్చితి వాతావరణంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగు వేయడమే దీనిని ప్రధాన కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాన్ఫ్లిక్ట్ ట్రాకింగ్ సంస్థ ..ఏసీఎల్ఈడీ (ACLED) అందించిన గణాంకాల ప్రకారం చూస్తే.. భారత్‌లో పదేళ్లలో ప్రజలు తమ డిమాండ్ల సాధన కోసం రోడ్లపైకి రావడం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2024 , 2025 లలో ప్రతి ఏడాదీ దేశవ్యాప్తంగా 20,000 కంటే ఎక్కువ ఆందోళన కార్యక్రమాలు జరిగినట్లుగా రికార్డులు నమోదయ్యాయి.
ముఖ్యంగా గడిచిన ఒకే ఏడాదిలో ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంస్కరణలు, పోటీ పరీక్షల అక్రమాలపైనే ఏకంగా 300కు పైగా నిరసనలు జరిగినట్లు తెలుస్తోంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఎడ్యుకేషన్ సమస్యలపై జరిగే పోరాటాలు ఆర్థిక రంగాన్ని డైరెక్టుగానూ, ఇన్‌డైరెక్ట్‌గానూ మరింత దెబ్బతీస్తాయి.
ఇక స్థానిక స్థాయిలో చూస్తే, ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ వంటి మెయిన్ బిజినెస్ ఏరియాల్లో వ్యాపార వేళలను కుదించి సాయంత్రం 6.30 గంటలకే షాపులు మూసివేయాల్సి రావడం, మెట్రో స్టేషన్లను టెంపరరీగా మూసివేయడం వల్ల రోజువారీ వ్యాపారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ స్తంభించడంతో పాటు వినియోగదారుల కొనుగోలు శక్తి కూడా మందగిస్తోంది.
ఒక ప్రాంతంలో మొదలైన నిరసన జ్వాలలు 6 నెలల వ్యవధిలో మళ్లీ చెలరేగే అవకాశం 4 రెట్లు ఎక్కువగా ఉంటుందని, పొరుగు ప్రాంతాలకు విస్తరించే ముప్పును చూస్తే కనుక అది రెట్టింపు అవుతుందని ఐఎంఎఫ్ హెచ్చరిస్తోంది. కాబట్టి ఇలాంటి నిరసనలను(Delhi Protest), ధర్నాలను కేవలం రాజకీయ, సామాజిక కోణంలోనే కాకుండా.. ఎకనామికల్ యాస్పెక్ట్‌లో కూడా చూస్తూ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి.. సంప్రదింపులు, చర్చల ద్వారా వీలైనంత త్వరగా పరిష్కారం కనుగొనడం దేశ భవిష్యత్తుకు అత్యంత ఆవశ్యకం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Students Protest : నీట్ లీక్ వివాదంపై ఆగని విద్యార్థి ఉద్యమం..ఢిల్లీలో అసలేం జరుగుతోంది?
