Ex-Servicemen
నాలుగేళ్ల పాటు సైన్యంలో పనిచేసి బయటకు వచ్చిన మాజీ సైనికులకు కేంద్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. స్పెషల్ స్కీమ్ కింద విధులు పూర్తి చేసుకున్న ఈ మాజీ సైనికులు(Ex-Servicemen) కేంద్ర సాయుధ బలగాల్లో (సిఏపీఎఫ్) చేరడానికి వీలుగా కీలక నిబంధనలను అమలు చేయనున్నట్లు పార్లమెంట్ వేదికగా ప్రకటించింది.
దీనిలో భాగంగానే వివిధ సెక్యూరిటీ ఫోర్సులలో ఉండే కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ పోస్టులలో ఏకంగా 50 శాతం ఖాళీలను వీళ్ల కోసమే కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఈ అంశంపై లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. సైనిక సర్వీసు ముగించుకున్న యువతకు ఫ్యూచర్‌లో ఉపాధి సమస్యలు రాకుండా ఉండటానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సీఆర్పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ,ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్ వంటి కీలక బలగాల పోస్టింగులలో ఈ 50 శాతం కోటా వీరికి వర్తిస్తుందని తెలిపారు. ఇది కేవలం మాట వరుసకు ఇచ్చే ఇంపార్టెన్స్ కాదని, రిక్రూట్‌మెంట్ నిబంధనల్లోనే అఫీషియల్‌గా చేర్చిన ప్రత్యేక సదుపాయమని వెల్లడించారు.
కేవలం ఉద్యోగాల కేటాయింపుతోనే ఆగకుండా, ఏజ్ విషయంలోనూ కేంద్రం పెద్ద ఊరట నిచ్చింది. సాధారణ నియామకాల్లో ఉండే గరిష్ఠ ఏజ్ లిమిట్ కంటే అదనంగా మూడేళ్ల పాటు వెసులుబాటు కల్పించనున్నారు. అలాగే తొలి బ్యాచ్‌లో చేరి సర్వీసులు ముగించుకున్న వారికి అయితే ఈ వయో సడలింపును ఏకంగా ఐదేళ్లకు పెంచారు. అయితే ఈ ఐదేళ్ల రాయితీ అనేది ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకునేలా కండీషన్ పెట్టారు.
అంతేకాకుండా ఈ పోస్టింగ్‌లలో వీరికి రిటెన్ ఎగ్జామ్‌తో పాటు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టుల నుంచి పూర్తిగా మినహాయింపునిచ్చారు. నాలుగేళ్ల పాటు అత్యంత క్రమశిక్షణతో, కఠినమైన వాతావరణంలో పనిచేసి ఫిట్‌గా ఉంటారు కాబట్టే ఈ ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టులు అవసరం లేదని భావించి ఈ వెసులుబాటు ఇచ్చారు. వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, వివిధ శాఖలతో బ్యాలెన్స్ చేసుకోవడం కోసం హోంశాఖ ప్రత్యేకంగా ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది.
మొత్తంగా కేంద్రం తీసుకొచ్చిన ఈ 50 శాతం కోటా, ఏజ్ లిమిట్ సడలింపులు, ఎగ్జామ్ మినహాయింపులు మాజీ సైనికులకు(Ex-Servicemen) కేంద్రం పెద్ద భరోసానిస్తుంది. అయితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ సైనిక సర్వీసులు పూర్తి చేసుకుని బయటకు వచ్చేవారికి ఈ విధానం ఎలా అమలవుతుందనేది చూడాల్సి ఉంది. కాగితాలపై ఉన్న ఈ నిబంధనలు క్షేత్రస్థాయిలో అమలై రిజల్ట్ వస్తే మాత్రం వేలాది మంది భవిష్యత్తుకు బలమైన పునాది పడినట్లే అవుతుంది.
Balakrishna : ఏఐజీ హాస్పిటల్‌లో బాలయ్య..హెల్త్ బులెటిన్ విడుదల
