Cabinet Reshuffle : కేంద్ర కేబినెట్‌లో మార్పులు..ఎవరిపై వేటు..కొత్తగా ఎంట్రీ ఇచ్చేదెవరు ?

Cabinet Reshuffle : ఈసారి కేబినెట్ విస్తరణలో ఎన్జీయే మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఎన్సీపీకి చోటు దక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Cabinet Reshuffle

కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులకు కౌంట్‌డౌన్ మొదలైంది. బీజేపీ జాతీయ కార్యవర్గంలో ప్రక్షాళన జరగడంతోనే కేబినెట్ విస్తరణపైన కూడా వార్తలు వస్తున్నాయి. కొంతమంది కేంద్రమంత్రులు దీనిపై పరోక్ష సంకేతాలిచ్చారు. పాత కేబినెట్ నుంచి కొంతమందికి ఉద్వాసన పలికి, మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇచ్చేలా బీజేపీ అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారు.

కొందరు కేంద్ర మంత్రులకు పార్టీపరంగా జాతీయ కార్యవర్గంలో కీలక బాధ్యతలు అప్పగించడంతో కేబినెట్‌లో కొత్త వారికి అవకాశం దక్కడం ఖాయమైంది. ఇటీవల నీట్ పేపర్ లీకేజ్ రగడతో ఇటీవల ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ బాధ్యతల నుంచి తప్పుకోగా, ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలను అప్పగించారు. అలాగే రాజ్యసభ పదవీకాలం ముగిసిపోవడంతో జార్జ్ కురియన్ , రవ్‌నీత్ సింగ్ బిట్టు వంటి వారు పదవులకు దూరమయ్యారు.

ఆ స్థానాలను కూడా భర్తీ చేయాల్సి ఉంది. అదే సమయంలో అన్ని శాఖల మంత్రుల పనితీరుపై ప్రధాని సమీక్షించారు. వారి పనితీరు, ఇతర నివేదికల ఆధారంగా కొన్ని శాఖల్లో మార్పులు చేయబోతున్నారు. 2027లో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలను, 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈసారి కీలక నిర్ణయాలు ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

ఈసారి కేబినెట్ విస్తరణ(Cabinet Reshuffle)లో ఎన్జీయే మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఎన్సీపీకి చోటు దక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే కీలక బిల్లులకు మద్ధతిచ్చిన కొన్ని పార్టీలను సైతం సంతృప్తి పరచాల్సి ఉన్నా కూడా.. బీజేపీ అగ్రనాయకత్వం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది.

కాగా పాత కేబినెట్‌లో కీలక బాధ్యతల్లో ఉన్న పీయూష్ గోయల్‌కు ఉద్వాసన పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ప్రకటించిన పార్టీ సంస్ధాగత మార్పుల్లో పీయూష్‌కు ట్రెజరర్ బాధ్యతలు అప్పగించారు. దీంతో పార్టీకే పరిమితం చేస్తారా లేక మంత్రి వర్గంలో కొనసాగిస్తారా అనేది చూడాలి.

Cabinet Reshuffle

జేపీ నడ్డా తరహాలో ఒక వ్యక్తి రెండు పదవుల విధానానికి మొగ్గుచూపితే మాత్రం గోయల్ కొనసాగుతారు. ఆ విధానం వద్దనుకుంటే మాత్రం గోయల్‌ను తప్పించడం ఖాయం.  వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే యూపీ, పంజాబ్ వంటి పెద్ద రాష్ట్రాలకు చెందిన నేతలకు కేబినెట్‌లో చోటు దక్కనుందని సమాచారం.

ఒకవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతుండగానే మంత్రివర్గ విస్తరణపై మోదీ, అమిత్ షా , నడ్డాతో పాటు కొన్ని రాష్ట్రాలకు చెందిన కీలక నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అటు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి చోటు దక్కనుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.

Telangana Voters List : తెలంగాణ ఓటర్ల జాబితా రిలీజ్.. మరి మీ పేరుందో లేదో చూసుకోండి?

Exit mobile version