Siddaramaiah
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య(Siddaramaiah) సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, భవిష్యత్తులో మరే ఇతర ఎన్నికల్లో గానీ పోటీ చేయబోనని ప్రకటించారు. అయితే రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగడం లేదని, కేవలం ఎన్నికల బరి నుంచి మాత్రమే తప్పుకుంటున్నానని వివరించారు.
ప్రజా జీవితంలో ఉంటూ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తానని సిద్ధరామయ్య తెలిపారు. ప్రస్తుత రాజకీయాల్లో నైతిక విలువలు లేవన్నారు. పైగా అవినీతి బాగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు .గతంలో తాను పోటీ చేసినప్పుడు వరుణ నియోజకవర్గ ప్రజలే డబ్బులు విరాళంగా ఇచ్చి గెలిపించారని, కానీ నేడు ఓట్ల కోసం అభ్యర్థులే ప్రజలకు డబ్బులు పంచాల్సిన దుస్థితి ఏర్పడిందనన్నారు.
ఇలాంటి వ్యవస్థలో నిజాయితీ గల రాజకీయాలకు చోటు లేదని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. అలాగే శారీరక కారణాలు కూడా ఈ నిర్ణయానికి కారణమని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ కాలం ముగిసే సరికి తనకు 81 ఏళ్లు వస్తాయని, గతంలో లాగా పూర్తి ఉత్సాహంతో, పనిచేయడం సాధ్యం కాదని చెప్పారు.ఇన్నేళ్లుగా తనకు అండగా నిలిచిన కర్ణాటక ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కొన్ని నెలల క్రితం హైకమాండ్ నిర్ణయం మేరకు సిద్ధరామయ్య కర్ణాటక సీఎంగా తప్పుకున్నారు. అనంతరం డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్యను సీడబ్ల్యూసీ సభ్యుడిగా నియమించింది. సిద్ధరామయ్య 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
2028 నాటికి సిద్ధరామయ్య ప్రజా జీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తాను ఎన్నో ఓటములు, విజయాలు చూశానని, అయితే ఎప్పుడూ తన సిద్ధాంతాలకు కట్టుబడి, మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించలేదనే తృప్తి తనకు ఉందని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
2006లో హెచ్.డి. దేవెగౌడతో వచ్చిన రాజకీయ విభేదాలతో జెడి(ఎస్) పార్టీని వీడి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. తన నియోజకవర్గానికి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2010లో బళ్లారి మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా బెంగళూరు నుంచి బళ్లారి వరకు ఆయన చేపట్టిన 320 కిలోమీటర్ల పాదయాత్ర కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది.
2009 నుంచి 2013 వరకు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా దూకుడుగా వ్యవహరించారు. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో సిద్ధరామయ్య(Siddaramaiah) మొదటిసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.2023 మే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.
Metformin : మెట్‌ఫార్మిన్ టాబ్లెట్ ఎందుకు, ఎవరికి మంచిది? దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయా?
