Vijay For PM
సినిమాను తలదన్నే రేంజ్‌లో తమిళనాడు పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కిపోయాయి. తమిళ వెట్రి కజగం (TVK) అధినేత, దళపతి జోసెఫ్ విజయ్ తమిళనాడు సీఎం పీఠం ఎక్కి 100 రోజులు పూర్తి చేసుకున్న సంతోషంలో ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో బయటకొచ్చిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే రిజల్ట్ చెన్నైలో అసలైన పొలిటికల్ బాంబ్‌లా పేలింది.
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ తర్వాత..పీఎం రేసులో అత్యంత పాపులర్ లీడర్‌గా విజయ్ మూడో స్థానంలో నిలిచినట్లు ఆ సర్వే చెప్పడంతో టీవీకే కేడర్‌లో ఒక్కసారిగా జోష్ పెరిగింది. దీంతో విజయ్ ఫర్ పీఎం(Vijay For PM) 2029 అంటూ టీవీకే శ్రేణులు సోషల్ మీడియా నుంచి చెన్నై వీధుల వరకు ప్రచారాన్ని హోరెత్తించడం మొదలుపెట్టాయి. అయితే ఈ ప్రచారం ఇప్పుడు అధికార కూటమిలో చిచ్చు పెట్టి, కాంగ్రెస్ వర్సెస్ టీవీకే పొలిటికల్ యుద్ధంగా మారిపోయింది
టీవీకే శ్రేణుల హంగామా చూసి కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్ ఆగ్రహంతో రగిలిపోతోంది. విజయ్ కేబినెట్‌లో మంత్రిగా సేవలందిస్తున్న కాంగ్రెస్ నేత రాజేష్ కుమార్ డైరెక్టుగా ..2029 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి ఏకైక పీఎం కేండిడేట్ రాహుల్ గాంధీ మాత్రమేనని తెగేసి చెప్పారు.
ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం టీవీకేకి ఇష్టం లేకపోయినా లేదంటే రాహుల్‌కు మద్దతు ఇవ్వడానికి విజయ్ అంగీకరించకపోయినా కూడా .. తాము ఒక్క క్షణం కూడా ఈ ప్రభుత్వంలో కొనసాగమని రాజేష్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు.అంతేకాదు విజయ్ కేబినెట్‌లో ఉన్న కాంగ్రెస్ మంత్రులందరూ గుడ్‌బై చెప్పి, వెంటనే తమ పదవులకు రిజైన్ చేసి మరీ బయటకు వచ్చేస్తారని అల్టిమేటం కూడా జారీ చేశారు.
ఈ గొడవలోకి ప్రతిపక్ష డీఎంకే ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్‌లో సెటైర్లు పేల్చింది. టీవీకే నాయకుల ఊహలకు అసలు సరిహద్దులే లేవని డీఎంకే సీనియర్ నేత ఆర్.ఎస్. భారతి ఎద్దేవా చేశారు. వీరిని ఇలాగే వదిలేస్తే విజయ్‌ని తీసుకెళ్లి ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడిని చేస్తామని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని కామెంట్ చేశారు.
కూటమిలో ఉంటూనే రాహుల్ గాంధీని కాదని విజయ్‌ని పీఎం కేండిడేట్‌గా ప్రొజెక్ట్ చేయడం వెనుక ఏమాత్రం లాజిక్ లేదన్నారు ఆర్.ఎస్.భారతి . రాహుల్‌కి సపోర్ట్‌గా నిలబడే ఆత్మగౌరవం కాంగ్రెస్ శ్రేణులకు అసలుందో లేదో వారే తేల్చుకోవాలంటూ కొత్త పాయింట్‌ను లేవనెత్తారు.
మరోవైపు ఈ సర్వే హడావుడిపై తమిళనాడు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన మాణికం ఠాగూర్ తనదైన స్టైల్‌లో రియాక్టవుతూ..నక్క నకిలీ పోల్ అనే ఒక చిన్న స్టోరీని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ సర్వేల క్రెడిబిలిటీని పూర్తిగా ప్రశ్నించారు. ప్రతీ నెంబరు నిజం అయిపోదని, మీడియాలో వచ్చే అన్ని సర్వేలు జనాభిప్రాయం కాదని కొట్టిపారేశారు.
అటు రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయం దేశంలో ఎవరూ లేరని కూటమిలోని మరో సీనియర్ నేత, ఎండీఎంకే అధినేత వైకో స్పష్టం చేశారు. తమిళనాడు సీఎం విజయ్‌కి దేశ ప్రధానమంత్రి అవ్వాలనే కోరికలు ఉన్నాయని తాను అనుకోవడమే లేదని, పార్టీ నేతలు ఇలాంటి తొందరపాటు కామెంట్లు చేసి సొంత పార్టీ పరువును పోగొట్టవద్దని సలహా ఇచ్చారు.
ఒకవైపు 100 రోజుల పాలనలో విజయ్ సాధించిన పాపులారిటీ అంతా టీవీకే శ్రేణులకు బూస్టింగ్ ఇస్తుంటే.. మరోవైపు కూటమి పార్టీల ఛాలెంజ్‌లు, రాజీనామా వార్నింగ్‌లు తమిళనాడు సర్కార్‌ను ఇరకాటంలో పడేశాయి. మరి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని విజయ్ అంగీకరిస్తారా.. లేదంటే విజయ్ ఫర్ పీఎం నినాదానికే కట్టుబడి కూటమికి బైబై చెప్పేస్తారా అనే విషయాలు తమిళనాడు రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయి.
Rain Alert : తెలంగాణకు రెయిన్ అలర్ట్..ఆ జిల్లాలలో ఉరుములు, 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు..
