Astrologer
రాజకీయాల్లో నిర్ణయాలు వేగంగా తీసుకుంటే ఇబ్బందులు తప్పవు. మరీ ముఖ్యంగా ప్రభుత్వాన్ని నడిపించేటప్పుడు ఏ నిర్ణయమైనా, నియామకమైనా ఒకటికి పదిసార్లు ఆలోచించి, చర్చించి ముందుకెళ్లాలి. లేకుంటే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా విజయం సాధించి మిత్రపక్షాల మద్దతుతో టీవీకే చీఫ్ , నటుడు విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో బలపరీక్ష కూడా నెగ్గారు.
అదే సమయంలో పాలనలోనూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్కూల్స్, ఆలయాల పరిసరప్రాంతాల్లో మద్యం షాపులు బంద్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే విజయ్ తీసుకున్న మరో నిర్ణయంపై మాత్రం తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.మిత్రపక్షాలు తప్పుపట్టాయి.
అదేంటంటే తన ఓఎస్డీగా తనకు ఎంతో కాలంగా పరిచయం ఉన్న జ్యోతిష్కుడు(Astrologer) రికీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మిత్రపక్షాల నుంచి విమర్శలు మొదలయ్యాయి. రాధన్ జ్యోతిష్యుడిగా చాలా ఫేమస్. దివంగత సీఎం జయలలితకు , బీజేపీ సీనియర్ నేత ఎల్.కె అద్వానీకి సైతం ఆస్థాన జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు.విజయ్ కచ్చితంగా అధికారంలోకి వస్తారని గత ఏడాదే ఆయన జోస్యం చెప్పారు.
ఆయనతో ఉన్న అనుబంధం దృష్ట్యా ఓఎస్డీగా నియమిస్తూ విజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ మిత్రపక్షాలు ఈ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. బలపరీక్ష సందర్భంగా జరిగిన చర్చలో డీఏంకే ఎమ్మెల్యేలు, ఇతర సభ్యులు కూడా దీనిపై గట్టిగా ప్రశ్నించారు. తమిళనాడు యువత అంతా మీకు ఓట్లు వేస్తే ఒక జ్యోతిష్యుడిని నమ్మి ఓఎస్డీగా ఎలా నియమిస్తారని మిత్రపక్షాలు నిలదీశాయి.
ఒక జ్యోతిష్యుడికి ఓఎస్డీ పోస్ట్ ఎందుకు అవసరమో చెప్పాలంటూ పలువురు రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. యువతకు ఏం సందేశం ఇస్తున్నారంటూ కొంతమందది ఎమ్మెల్యేలు సైతం మండిపడ్డారు. దీంతో విజయ్ వెనక్కి తగ్గక తప్పలేదు. జ్యోతిష్కుడు(Astrologer) రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అసెంబ్లీలో ఈ నియామకం పైన పునరాలోచన చేస్తానని చెప్పిన కొద్దిసేపటికే నియామక రద్దు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఇకపై అయినా ఏవైనా ప్రభుత్వం తరపున నిర్ణయాలు తీసుకునే ముందు విజయ్ ఆచితూచి వ్యవహరించాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
