Aries
పరాభవ నామ సంవత్సరంలో మేష రాశి వారికి ఆదాయం 11 వంతులు ఉంటే వ్యయం 5 వంతులుగా ఉంది. రాజపూజ్యం 2 వంతులు , అవమానం 4 వంతులుగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సంపాదన బాగున్నా కూడా .. దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం మేష రాశి(Aries) వారు ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆగస్టు నెల వరకు అనుకోని ప్రమాదాలు కానీ, విపత్తులు జరిగే అవకాశం ఉండటంతో చాలా జాగ్రత్త అవసరం. అంతేకాకుండా ఈ ఏడాది బంధువులతో విరోధాలు ఏర్పడటం, అనారోగ్య సమస్యలు తలెత్తడం, కోర్టు వ్యవహారాల్లోనూ చిక్కుకునే ప్రమాదం ఉంది. ఎంత కష్టపడి పని చేసినా శ్రమకు తగిన ఫలితం దక్కదు. దీంతో నిరాశకు లోనయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం,గౌరవం పట్ల అత్యంత జాగ్రత్త వహించాలి.
ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ ఏడాది మేషరాశి వారికి అంతగా కలిసిరాదు. ప్రమోషన్లు రాకపోవడం, ఇష్టం లేని చోటికి బదిలీలు కావడం వంటివి మానసిక ఒత్తిడిని పెంచుతాయి. అయితే నిరుద్యోగులకు అక్టోబర్ తర్వాత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మాత్రం మంచి సమయమనే చెప్పొచ్చు.
రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో గడ్డు కాలం ఎదురవుతుంది. హై కమాండ్‌తో విభేదాలు రావడం, పదవులు కోల్పోయే ప్రమాదం, ఎన్నికల్లో ఓటమి వంటి ఇబ్బందులు ఉండొచ్చు. అయితే కళారంగంలో ఉన్న వారికి మాత్రం ఈ ఏడాది సానుకూలంగా ఉంటుంది.
టీవీ, సినిమా రంగంలో ఉన్నవారు అవార్డులు అందుకోవడంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ..ఇది అనుకూల సమయమయినా స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త అవసరం.
విద్యార్థులకు ఈ ఏడాది జ్ఞాపకశక్తి బాగుంటుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడికల్ వంటి ఉన్నత చదువులు చదివే వారు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. కానీ క్రీడాకారులకు ఈ ఏడాది అంతగా బాగోదు. వ్యవసాయదారులకు పంటలు పండినా అప్పుల బాధలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే అవకాశముంది.
మేష రాశి(Aries) స్త్రీలకు మాత్రం కుటుంబంలో సఖ్యత లోపించే అవకాశముంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఆవేశాలు పెరగడం, ఆరోగ్య భంగాలు కలగడం వల్ల చిన్న చిన్న సర్జరీలు జరిగే అవకాశముంది. ఉద్యోగాలు చేసే స్త్రీలకు దూర ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్లు కావొచ్చు. పెళ్లి కాని వారికి ఈ ఏడాది వివాహం జరిగే సూచనలున్నాయి. మొత్తం మీద మేష రాశి వారికి ఈ సంవత్సరం మంచి కంటే చెడు ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఆ సమయంలో మీ ధైర్య సాహసాలే మీకు కొండంత అండగా నిలుస్తాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
