Draupadi : కురుసభలో తలవంచిన మానవత్వం..కురుక్షేత్ర యుద్ధానికి అదే అసలు పునాదా?

Draupadi : మహాభారతంలోని హస్తినాపుర రాజసభలో జరిగిన ద్రౌపది వస్త్రాపహరణం వెనుకున్న కుటిల రాజకీయాలు, శకుని మాయాజూదం, భీష్మాచార్యుల మౌనం, కురుక్షేత్ర రణరంగానికి దారి తీసిన అసలు కారణాలేంటి?

Draupadi

చరిత్ర పుటలను ఒక్కసారి తిరగేస్తే చాలు ఎన్నో సామ్రాజ్యాల గెలుపోటములతో పాటు వీరుల పరాక్రమాలు మన కళ్లముందు మైమరిపిస్తాయి. కానీ, కాలాలు మారినా, యుగాలు దాటినా ప్రతీ ఒక్కరినీ ఈనాటికీ ఆలోచింపచేసే, సమాజాన్ని నిలదీసే దారుణమైన ఘట్టం మాత్రం మహాభారతంలోనే మనకు కనిపిస్తుంది.

అది హస్తినాపుర రాజసభ వేదికగా ఓ అబలకు జరిగిన ఆ రౌద్ర అవమానం. లోకాన్ని జయించగల పరాక్రమమున్న ఐదుగురు భర్తలు పక్కనే ఉన్నా, సామ్రాజ్యాధినేతలు, మహామేధావులు తలలు దించుకుని చూస్తుండగా.. ఒక మహిళను బలవంతంగా నిండు సభలోకి ఈడ్చుకొచ్చి, ఆమె వస్త్రాలను ఊడదీస్తూ దుర్మార్గంగా అవమానించిన ఆ చీకటి రోజు.. భారతీయ చరిత్రాన్ని అక్షరాలా కుదిపేసింది. అసలు ఆరోజు ఆ రాజసభలో అలాంటి దారుణమైన, హేయమైన, క్రూరమైన పరిస్థితి దేని గురించి వచ్చింది? ధర్మం నిలవాల్సిన చోట అధర్మం ఎందుకు విలయతాండవం చేసింది? దాని వెనుక నడిచిన కుటిల రాజకీయ క్రీడలేంటో లోతుగా గమనిస్తే విస్తుపోయే నిజాలు బయటపడతాయి.

పాండవులంతా అత్యంత వైభవోపేతంగా నిర్మించుకున్న ఇంద్రప్రస్థ నగరం, అక్కడ మయసభలో కౌరవ రాజకుమారుడైన దుర్యోధనుడు ఎదుర్కొన్న చిన్నచూపుతో పాటు కొన్ని ఇబ్బందులు అతని గుండెల్లో కక్షా కార్పణ్యాలను రగిలించాయి. ఆ అసూయ, ఈర్ష్యలను తగ్గించుకోవడానికి ఎలాగైనా పగ తీర్చుకోవాలనే దుర్బుద్ధితో.. శకుని తన మాయాజూదపు పాచికలతో దుర్మార్గమైన వ్యూహం పన్నాడు. పథకం ప్రకారం పాండవులను జూదానికి ఆహ్వానించడంతో పాటు వారి సర్వస్వాన్ని, సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. అయితే ఆటలో ఒక్కొక్కటిగా ఓడిపోతూ వచ్చిన ధర్మరాజు చివరకు తనను తాను పణంగా పెట్టుకుని కూడా ఓడిపోయాడు. ఆ తర్వాత తన భార్య అయిన ద్రౌపది(Draupadi)ని కూడా పణంగా పెట్టడంతోనే మహాభారత యుద్ధానికి తెర లేపింది.

ధర్మరాజే ఓడిపోయిన తర్వాత తనను పణంగా పెట్టే హక్కు అతడికి ఎక్కడిదని ఆ నిండు సభలో ద్రౌపది లేవనెత్తిన ఆ ఒక్క సూటి ప్రశ్న అక్కడున్న దిగ్గజాలందరి నోట మాట రానీకుండా చేసింది. భీష్ముడు, ద్రోణుడు వంటి మహామేధావులు, ధర్మకోవిదులు కూడా ధర్మం అనేది చాలా సూక్ష్మమైనదని చెప్పి మౌనం వహించడం ఆ ఘోరమైన అన్యాయానికి పరోక్షంగా ఊతమిచ్చింది. ఇక దుశ్శాసనుడు సోదరుల భార్య అని కూడా చూడకుండా ద్రౌపదిని బలవంతంగా జుట్టు పట్టుకుని మరీ నిండు సభలోకి ఈడ్చుకురావడం,కౌరవుల అహంకారానికి, అజ్ఞానానికి పరాకాష్టగా నిలిచాయి.

ఆ సమయంలో ఆ సభలో ఒక్కరి మద్దతు కూడా లేక ధర్మం కూడా ఓడిపోయిన క్షణాన ద్రౌపది(Draupadi) తాను నమ్మిన కృష్ణ భగవానుడిని మనసారా శరణు కోరింది. కన్నయ్య అద్భుత మహిమతో ఆమె ధరించిన చీర అనంతంగా మారిపోవడంతో, ఆ వస్త్రాలు లాగి లాగి అలసిపోయిన కౌరవుల పరువు ఆ ఘటనతో గాలిలో కలిసిపోయింది. అలా నిండు సభలో జరిగిన ఈ దారుణ అవమానమే పాండవులలో ప్రతీకార జ్వాలలను రాజేసి, కౌరవ వంశ నాశనానికి, కురుక్షేత్ర మహాసంగ్రామానికి అదే బలమైన పునాది వేసింది. అందుకే ఏ సమాజంలోనైనా, ఏ కాలంలో అయినా స్త్రీ ఆత్మగౌరవాన్ని మించిన ధర్మం వేరే లేదన్న నిజాన్ని ఈ పౌరాణిక ఇతిహాసం ఇప్పటికీ చాలా గట్టిగా చాటుతూనే ఉంది.

Relationship Needs : అవసరాల చుట్టూ తిరిగే మనుషులు.. ఈ ప్రవర్తన వెనుక ఉన్న సైకాలజీ సీక్రెట్

↑
Exit mobile version