September Festivals
క్యాలెండర్‌లో పేజీ తిరిగి సెప్టెంబర్ నెల వచ్చేసింది. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ మాసం సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. ఓ వైపు ఎంతో నిష్ఠగా జరుపుకొనే శ్రావణ మాసం చివరి ఘట్టాలు, మరోవైపు బొజ్జ గణపయ్య హడావుడితో మొదలయ్యే మహిమాన్వితమైన భాద్రపద మాసం రాకతో..సెప్టెంబర్ నెలంతా పూజలు, నైవేద్యాలతో ప్రతి ఇల్లూ ఒక ఆధ్యాత్మికంగా మారిపోనుంది.
భాద్రపదమాసం అనగానే వెంటనే గుర్తుకొచ్చే వినాయక చవితి, గణేష్ నవరాత్రుల హంగామా, రుషి పంచమి, అనంత చతుర్దశి, పితృపక్షాల వంటి ఎన్నో పర్వదినాలకు సెప్టెంబర్ నెలవు కాబోతుంది(September Festivals). నెల ఆరంభంలోనే సెప్టెంబర్ 1 న మూడో శ్రావణ మంగళగౌరీ వ్రతంతో పూజల పర్వానికి ఆది పడనుంది. వివాహమైన స్త్రీలంతా కుటుంబమంతా సంతోషంగా ఉండాలని, భర్తకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మంగళగౌరీ దేవిని భక్తితో ఆరాధిస్తారు.
ఇక సెప్టెంబర్ 4వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక వస్తుంది. భాద్రపద మాసంలో వచ్చే కృష్ణ పక్ష అష్టమి తిథి రోజే ఆ మురళీధరుడు జన్మించాడు. ఈ పవిత్ర దినాన ఉదయం నుంచే కఠినంగా ఉపవాసం ఉంటూ, కృష్ణుడు పుట్టిన అర్ధరాత్రి సమయానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. వెన్న దొంగ అయిన కన్నయ్యకు ఇష్టమైన చిక్కటి పాలు, పెరుగు, వెన్న, అటుకులు, రకరకాల పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మహా మంత్రాన్ని వీలయినన్ని ఎక్కువసార్లు జపించడం వల్ల విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.
ఆ వేడుక ముగిసిన వెంటనే సెప్టెంబర్ 7న పవిత్రమైన ఏకాదశి తిథి పర్వదినం వస్తుంది. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. విష్ణు సహస్రనామాలు చదవడం, ఓం నమో నారాయణాయ అనే నామాన్ని జపించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు.
ఆ తర్వాత సెప్టెంబర్ 11న ఈ సంవత్సరపు శ్రావణ మాసం పూర్తిగా ముగిసి శ్రావణ అమావాస్య వస్తుంది. ఈ అమావాస్య రోజు మన పితృదేవతలను స్మరించుకోవడం హిందువుల ఆచారంగా వస్తుంది. పితృదేవతలకి తర్పణాలు వదలడం, పేదలకు అన్నదానం అలాగే దానధర్మాలు చేయడం వల్ల వారి ఆశీస్సులు కుటుంబానికి లభిస్తాయి. ఇక మర్నాడు అంటే సెప్టెంబర్ 12 నుంచి అత్యంత మహిమాన్వితమైన భాద్రపద మాసం ప్రారంభమవుతుంది.
ఈ నెలలోనే సమస్త విఘ్నాలను తొలగించే వినాయక చవితి సెప్టెంబర్ 14న అత్యంత వైభవంగా రాబోతోంది. ప్రతి ఇంటా, వీధి వీధినా, వాడవాడలో మట్టితో చేసిన గణపతి విగ్రహాలను ప్రతిష్టించి స్వామిని పూజిస్తారు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్లు, కుడుములు, మోదకాలను నైవేద్యంగా నివేదిస్తారు. ఈ వినాయక చవితితోనే తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే.. గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతాయి.
